నీరు పుష్కలం.. సాగుకు సమాయత్తం
ABN , Publish Date - Aug 21 , 2025 | 12:01 AM
జీఎనఎస్‌ఎస్(గాలేరు నగరి సుజల స్రవంతి) కెనాల్, ఎస్సార్బీసీ(శ్రీశైలం రైట్ బ్రాంచ కెనాల్) కాల్వ ద్వారా నీరు వచ్చి చేరుతుండటంతో అవుకు రిజర్వాయర్‌లో 3.50టీఎంసీ నీటి నిల్వ ఉంది. రిజర్వాయర్‌లో పుష్కలంగా నీరు చేరటంతో మండల వ్యాప్తంగా 20వేలు ఎకరాల్లో రైతులు పంటలను సాగుచేస్తున్నారు.
పెరిగిన భూగర్భజలాలు
విస్తారంగా వరి, మొక్కజొన్న సాగు
పొలాల్లో సందడి వాతావరణం
అవుకు, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): జీఎనఎస్‌ఎస్(గాలేరు నగరి సుజల స్రవంతి) కెనాల్, ఎస్సార్బీసీ(శ్రీశైలం రైట్ బ్రాంచ కెనాల్) కాల్వ ద్వారా నీరు వచ్చి చేరుతుండటంతో అవుకు రిజర్వాయర్‌లో 3.50టీఎంసీ నీటి నిల్వ ఉంది. రిజర్వాయర్‌లో పుష్కలంగా నీరు చేరటంతో మండల వ్యాప్తంగా 20వేలు ఎకరాల్లో రైతులు పంటలను సాగుచేస్తున్నారు. దీంతో పొలా ల్లో ఎక్కడ చూసినా సందడి వాతావరణం నెలకొంది. కురుస్తున్న వర్షాలతో ఉప్పలపాడు హాయతఖాన చెరువు, కునుకుంట్లలోని దీక్షితులవారి చెరువు, శింగనపల్లెలోని పర్క్యులేషన ట్యాంకు నిండిపోయాయి. ఎస్సార్బీసీ ద్వారా వస్తున్న నీటితో మెట్టుపల్లె బాలికుంట చెరువు, వేములపాడు చెరువులు జలకళను సంతరించుకున్నాయి. రిజర్వాయర్‌కు నీరు చేరటం, కురుస్తున్న వర్షాలతో భూగర్భజలాలు పెరగటంతో బోర్లు, బావుల కింద పంట లను రైతులు సాగు చేస్తున్నారు. కొన్నిచోట్ల వరి నాటుకు పొలాలను ట్రాక్టర్లతో, ఎద్దులతో దమ్ము చేస్తుండగా, మరికొన్ని చోట్ల వరినాట్లు వేస్తున్నారు. మండలంలో వరి 10వేలు ఎక రాలు, మొక్కజొన్న 5వేలు ఎకరాలు, మిరప 2వేలు ఎకరాలు, కంది 800 ఎకరాలు, మినుము 210 ఎకరాలు, సాగు అవుతుండగా మిగతా పొలాల్లో వేరుశనగ, పత్తి, పసుపు, హార్టికల్చర్ పంటలను సాగుచేస్తున్నారు.