Share News

ఆడుకుంటూ అనంత లోకాలకు..

ABN , Publish Date - Jul 13 , 2025 | 12:54 AM

ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని కారు రూపంలో మృత్యువు కబళించిన హృదయ విదారక ఘటన కంకిపాడులో శనివారం జరిగింది.

ఆడుకుంటూ అనంత లోకాలకు..

-కారు ఢీకొని ఏడేళ్ల బాలుడి మృతి

-కంకిపాడులోని అంకమ్మతల్లి గుడి రోడ్డులో ప్రమాదం

కంకిపాడు, జూలై 12 (ఆంధ్రజ్యోతి):

ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని కారు రూపంలో మృత్యువు కబళించిన హృదయ విదారక ఘటన కంకిపాడులో శనివారం జరిగింది. అదనపు ఎస్సై తాతాచార్యులు తెలిపిన వివరాల ప్రకారం.. కంకిపాడులోని అంకమ్మతల్లి గుడి రోడ్డులో నివాసముంటున్న పడాల నాగిరెడ్డి కుమారుడు మోక్షితరెడ్డి (7) రెండో శనివారం పాఠశాలకు సెలవు కావడంతో ఇంటి వద్ద సైకిల్‌తో ఆడుకుంటున్నాడు. ఇంతలో అటుగా వెళ్తున్న ఓ కారు వేగంగా వచ్చి సైకిల్‌ను ఢీ కొంది. ఈ ప్రమాదంలో మోక్షిత రెడ్డి కుప్పకూలి పోయాడు. వెంటనే ఇంట్లో నుంచి బయటకు వచ్చిన నాగిరెడ్డి కుటుంబ సభ్యులు చిన్నారిని కంకిపాడులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లగా, మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించాలని వైద్యులు సూచించారు. చిన్నారిని విజయవాడ తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవరు భూపతి వెంకట శ్రీనివాసరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శ్రీనివాసరావు అవనిగడ్డ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఆయన భార్య డయాలసిస్‌ పేషెంట్‌ కావడంతో ఆమెను విజయవాడ తీసుకువెళ్లి తిరిగి వస్తుండగా, ఈ ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. చిన్నారి తండ్రి నాగి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.

Updated Date - Jul 13 , 2025 | 12:54 AM