CM Chandrababu Naidu: 2026 జూన్ నాటికి ప్లాస్టిక్ ఫ్రీ ఏపీ
ABN , Publish Date - Dec 21 , 2025 | 04:03 AM
ఆంధ్రప్రదేశ్‌ను 2026 జూన్ నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.
జనవరి 26 నాటికి రోడ్డుపై చెత్త కనిపించకూడదు: సీఎం
స్వచ్ఛాంధ్రతోనే స్వర్ణాంధ్ర సాధన సాధ్యం
అభివృద్ధి యజ్ఞం భగ్నానికి రాక్షసుల యత్నం
మెగా డీఎస్సీ నుంచి కానిస్టేబుల్ పోస్టుల దాకా కేసులు
అయినా ఆ రాక్షసులు నన్ను అడ్డుకోలేరు
పేదలకు మెరుగైన వైద్యమే ‘పీపీపీ’ లక్ష్యం
‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ ప్రజావేదికలో సీఎం
అనకాపల్లి, డిసెంబరు20 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ను 2026 జూన్ నాటికి ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. శనివారం అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెం పంచాయతీ పరిధిలోని బంగారయ్యపేట గ్రామంలో ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంపై నిర్వహించిన ప్రజావేదికలో ఆయన పాల్గొని ప్రసంగించారు.‘‘ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను ప్లాస్టిక్ రహితంగా చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్ర సచివాలయంలో ప్లాస్టిక్‌ను నివారించాం. ఇప్పటికే 21 విభాగాల్లో 69 రాష్ట్ర అవార్డులు, 1,257 జిల్లా స్థాయి అవార్డులు వచ్చాయి.’’ అని వివరించారు. గత ప్రభుత్వం రూ.86 లక్షల టన్నుల చెత్తను వారసత్వంగా ఇచ్చిందని, 2026 జనవరి 26 నాటికి రోడ్డుపై చెత్త అనేది కనిపించకూడదని లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు తెలిపారు. పరిసరాల పరిశుభ్రతే కాకుండా ప్రజల ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. ‘‘ఇది బలవంతపు కార్యక్రమం కాదు. భావి తరాలకు ఆరోగ్యకరమైన జీవితాన్ని ఇచ్చేందుకే దీనిని నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం 25 ప్రాంతాల్లో స్వచ్ఛ రథాలు పనిచేస్తున్నాయి. వాటి ద్వారా పొడి చెత్తను సేకరిస్తున్నాం. వాటి సంఖ్య త్వరలో వందకు పెంచుతాం. పట్టణ ప్రాంతాల్లో ఐదు లక్షల ఇళ్లలో హోం కంపోస్టు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇది ప్రస్తుతం 3.91 లక్షల ఇళ్లలో జరుగుతోంది. గ్రామీణ ప్రాంతంలో పది లక్షల ఇళ్లలో హోం కంపోస్టు తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించాం. వచ్చే ఏడాది మార్చి 26 నాటికి ఆ లక్ష్యాన్ని చేరుకుంటాం.’’ అని వివరించారు. సూపర్ సిక్స్ అమలు చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని సీఎం తెలిపారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
పారిశ్రామిక హబ్‌గా అనకాపల్లి జిల్లా
అనకాపల్లి జిల్లా పరిశ్రమల హబ్‌గా మారింది. రాంబిల్లి, నక్కపల్లి, మాకవరపాలెం, వల్లూరుల్లో 24,843 ఎకరాల్లో పరిశ్రమలు వస్తాయి. పరవాడ, అచ్యుతాపురాల్లో ఎంఎస్ఎంఈ పార్కులు తీసుకొచ్చాం. నక్కపల్లిలో 93 ఎకరాల్లో తొలి ప్రైవేటు పార్కు ఏర్పాటు చేశాం. ఒక్క అనకాపల్లి జిల్లాలోనే రూ.2.89 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయి. అనకాపల్లిలో ఆర్గానిక్ బెల్లం తయారు చేసి ప్రపంచానికి ఎగుమతి చేయవచ్చు.’’
మూడేళ్లలో ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు పూర్తి
‘‘మూడేళ్లలో ఉత్తరాంధ్రలోని అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. అనకాపల్లికి త్వరలో పోలవరం నీళ్లు వస్తాయి. గోదావరిని వంశధారకు అనుసంధానం చేస్తాం. ఉత్తరాంధ్రకు నిధులు ఇవ్వాలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరాను. విశాఖకు గూగుల్ డేటా సెంటర్ వస్తుంది. నాలెడ్జ్ లెవల్ ఎకానమీకి ఏఐ నెక్ట్స్ లెవల్.’’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
స్వచ్ఛ రథాలు ప్రారంభం
‘‘స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛ రథాలను ముఖ్యమంత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 అభివృద్ధి పనుల్లో భాగంగా రూ.68.25 కోట్లతో చేపట్టే ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు, శుద్ధి ప్లాంటు వంటి నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేశారు. గ్రీన్ అంబాసిడర్స్‌ను చంద్రబాబు సత్కరించారు. అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలానికి చెందిన శానిటేషన్ వర్కర్ హరికృష్ణను, అనకాపల్లి మండలం మార్టూరు గ్రామానికి చెందిన వీరరమణ, చోడవరం మండలం చౌడువాడ గ్రామానికి చెందిన కొట్యాడ అప్పారావులను ముఖ్యమంత్రి శాలువాతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.
సంపద కేంద్రం పరిశీలన
కశింకోట, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి అనకాపల్లి జిల్లా తాళ్లపాలెంలోని ‘సంపద’ కేంద్రాన్ని పరిశీలించారు. తడి చెత్త, పొడి చెత్త నిర్వహణ, ఎరువుగా తయారీపై పారిశుధ్య కార్మికులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో చెత్త సేకరణను స్వయంగా పరిశీలించారు. స్థానికులు, రైతులతో మాట్లాడారు. తాను పది ఎకరాల్లో కూరగాయలు, వరి, చెరకు వేస్తున్నానని, వాటికి సంపద కేంద్రాల్లో తయారైన ఎరువును వాడుతున్నానని ఒక రైతు చెప్పారు.
రాక్షసులు వస్తున్నారు.. జాగ్రత్త
‘‘మాప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి యజ్ఞాన్ని భగ్నం చేసేందుకు రాక్షసులు వస్తున్నారు. ఐటీ కంపెనీలు రాకుండా ఈ రాక్షసులు కేసులు వేస్తున్నారు.. మెగా డీఎస్సీ నుంచి కానిస్టేబుల్ పోస్టుల దాకా కేసు వేశారు. వీళ్లకు ఒక్కటే చెబుతున్నా! ఎన్ని అడ్డంకులు సృష్టించినా నన్ను అడ్డుకోలేరు. పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకే పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నాం. వాస్తవం ఇది కాగా, ప్రైవేటుపరం చేస్తున్నారంటూ మాట్లాడుతున్నారు. విశాఖలో ప్రపంచం మెచ్చే లా జరిపిన యోగాంధ్రపైనా విమర్శలు చేస్తున్నారు.’’