Share News

AP CM Chandrababu: ప్లాస్టిక్‌ వ్యర్థాలు కనపడొద్దు

ABN , Publish Date - Nov 25 , 2025 | 05:12 AM

రాష్ట్రంలో అన్ని రకాల ప్లాస్టిక్‌ వ్యర్థాలను డిస్పోజ్‌ చేసేందుకు ఒక విధాన నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

AP CM Chandrababu: ప్లాస్టిక్‌ వ్యర్థాలు కనపడొద్దు

  • త్వరలో ఒక విధాన నిర్ణయం

  • ‘నెట్‌ జీరో’ కాలుష్యం లక్ష్యం

  • సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ తగ్గాలి: సీఎం

అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో అన్ని రకాల ప్లాస్టిక్‌ వ్యర్థాలను డిస్పోజ్‌ చేసేందుకు ఒక విధాన నిర్ణయం తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. సోమవారం రాష్ట్ర సచివాలయంలో కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)తో సహా వివిధ శాఖల అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కాలుష్యాన్ని నెట్‌ జీరో స్థాయికి తగ్గించాలని నిర్దేశించారు. గాలి, నీరు, పరిశ్రమలు, ప్లాస్టిక్‌, బయో వ్యర్థాల వంటి విషయాలపై వివిధ రకాల అధ్యయనాలు చేయాలని, ఇందుకోసం టెక్నాలజీని వినియోగించాలని సూచించారు. ఎవరైనా నియమాలను అతిక్రమిస్తే.. సదరు సంస్థలు, వ్యక్తులకు ముందుగా హెచ్చరికలు జారీ చేసి, తర్వాత చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్లాస్టిక్‌ నిర్వహణ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వినియోగం తగ్గించేలా పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆరోగ్య పరిరక్షణ కేంద్రాల్లో బయో వ్యర్థాల డిస్పోజల్స్‌ విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం చేయరాదని, 48 గంటల్లోగా వాటిని డిస్పోజ్‌ చేయాల్సిందేనని స్పష్టం చేశారు. దీని పర్యవేక్షణకు టెక్నాలజీ, సీసీ టీవీలను వినియోగించాలని అధికారులకు సూచించారు.


వాయు నాణ్యతను విశ్లేషించాలి

రాష్ట్రంలో వాయు నాణ్యతను అన్ని కోణాల్లో విశ్లేషించాలని చంద్రబాబు పేర్కొన్నారు. ఎయిర్‌ క్వాలిటీ సిస్టం మానిటరింగ్‌ కోసం సరికొత్త సాంకేతికతను వినియోగించాలని, ఈ డేటాను అవేర్‌-2.0కు లింక్‌ చేయాలని నిర్దేశించారు. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినె్‌సను దృష్టిలో పెట్టుకుని, పరిశ్రమలకు అనుమతులిచ్చేందుకు అవసరమైన మార్పులు చేయాలని ఆదేశాలు జారీచేశారు. రెడ్‌ జోన్‌ పరిధిలోని పరిశ్రమలకు 12 రోజులు, ఆరెంజ్‌ జోన్‌లోని పరిశ్రమలకు 10 రోజులు, గ్రీన్‌ జోన్‌లోని పరిశ్రమలకు 3 రోజుల్లో అనుమతివ్వాలని పేర్కొన్నారు. మురుగునీటి శుద్ధి ప్లాంట్లు అన్నింటినీ త్వరలో అందుబాటులోకి తేవాలన్నారు. మైనింగ్‌ కాలుష్యం విషయంలోనూ దృష్టి పెట్టి చర్యలు తీసుకోవాలన్నారు. రాబోవు రోజుల్లో కాలుష్యం అంశాన్ని కూడా ‘అవేర్‌’లోకి తీసుకోవాలని పేర్కొన్నారు. మైక్రో ఇరిగేషన్‌లోనూ పంట పొలాల్లో ప్లాస్టిక్‌ షీట్ల వినియోగం వల్ల దీర్ఘకాలంలో రైతులకు ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని, దీని కోసం బయో షీట్లు వేసేలా వారికి అవగాహన కల్పించాలని సూచించారు. కాలుష్య నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై శిక్షణ ఇవ్వాలని, దీనికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. కాలుష్య నియంత్రణ మండలికి అవసరమైన సిబ్బంది కావాలని పీసీబీ చైర్మన్‌ కృష్ణయ్య కోరగా.. సీఎం అందుకు సానుకూలంగా స్పందించారు.

Updated Date - Nov 25 , 2025 | 05:16 AM