Share News

Fake Liquor Scam: ప్లాన్‌ జనార్దనరావుది

ABN , Publish Date - Oct 09 , 2025 | 04:10 AM

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో ఏ2 నిందితుడు కట్టా రాజు కీలకంగా వ్యవహరించాడు.

Fake Liquor Scam: ప్లాన్‌ జనార్దనరావుది

  • నకిలీ మద్యం తయారీ, అమ్మకాలు, వాటాల పంపిణీ బాధ్యత కట్టారాజుది

  • జయచంద్రారెడ్డికి మద్యం సొమ్ముల్లో వాటా

  • ఆయన ఇంట్లో పనిచేసే వ్యక్తికి అందజేత

  • చదువుకునే సమయం నుంచే జనార్దనరావుతో కొడాలి శ్రీనుకు స్నేహం

  • ములకలచెరువు నకిలీ మద్యం కేసులో కొత్తగా ఏడుగురు నిందితులు

  • ఇబ్రహీంపట్నంలోనూ ‘నకిలీ’ యూనిట్‌

  • మూడు నెలలుగా నకిలీ మద్యం తయారీ

  • జనార్దనరావు బార్‌, భాగస్వామిగా ఉన్నబెజవాడలోని శ్రీనివాస వైన్స్‌లో అమ్మకాలు

  • ‘ఎక్సైజ్‌’ రిమాండ్‌ రిపోర్టుల్లో వెల్లడి

రాయచోటి/ములకలచెరువు, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా ములకల చెరువు నకిలీ మద్యం తయారీ కేసులో ఏ2 నిందితుడు కట్టా రాజు కీలకంగా వ్యవహరించాడు. నకిలీ మద్యం తయారీ దగ్గర నుంచి అమ్మకాలు, కలెక్షన్లు, వాటాల పంపిణీ చూసుకునేవాడు. నకిలీ మద్యం తయారీకి ప్రధాన నిందితుడు జనార్దనరావు పథకం వేశాడు. టీడీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన జయచంద్రారెడ్డికి మద్యం వాటా సొమ్ములు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఆయన ఇంట్లో పనిచేసే అన్బురాసు అలియాస్‌ బాబు తీసుకునేవాడు. ఎక్సైజ్‌ అధికారులు సమర్పించిన రిమాండ్‌ రిపోర్టులో ఈ మేరకు విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోం ది. కట్టా రాజు అరెస్టు సమయంలో అతని వద్ద నుంచి ఒక డైరీ, ల్యా్‌పటాప్‌ను ఎక్సైజ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నానికి చెందిన కట్టా రాజుకు ప్రధాన నిందితుడు జనార్దనరావుతో 1990 నుంచి పరిచయం ఉంది. ఈ ఏడాది మార్చిలో కట్టా రాజు ములకలచెరువుకు వచ్చాడు. జనార్దనరావు మద్యం దుకాణాల్లో లెక్కలు చూసుకునేవాడు. ములకలచెరువులోని రాక్‌స్టార్‌ వైన్స్‌, చెండ్రాయునిపల్లెలో ఆంధ్రా వైన్స్‌లో పనిచేస్తూ వాటి వ్యవహారాలు చూసుకునేవాడు. ఈ ఏడాది ఏప్రిల్‌లో జనార్దనరావు అతడిని పిలిచి మాట్లాడాడు. జయచంద్రారెడ్డి తనకు చాలా సన్నిహితుడని, ఆయన బావమరిది గిరిధర్‌ రెడ్డి, బెంగళూరుకు చెందిన బాలాజీ, హైదరాబాద్‌కు చెందిన నెకిరికంటి రవి, కట్టా సురేంద్రనాయుడు కలిసి పెద్దఎత్తున నకిలీ మద్యం తయారు చేసి అమ్మాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.


నకిలీ మద్యం తయారీకి అవసరమైన సామగ్రి, యంత్రాలను సమకూర్చుకున్న తరువాత ఈ ఏడాది జూన్‌ నుంచి తయారీ ప్రారంభించారు. నకిలీ మద్యం అమ్మకాలు, కలెక్షన్లు, ఎవరికి, ఎక్కడ, ఎంత ముట్టజెప్పాలో, ఎలా అందజేయాలో కట్టా రాజు చూసుకునేవాడు. ఆ వివరాలన్నింటినీ జనార్దనరావు సూచనల మేరకు డైరీ, ల్యాప్‌టాప్‌లో నమోదు చేశాడు. జయచంద్రారెడ్డి వాటా సొమ్ములను ఆయన ఇంట్లో పనిచేసే అన్బురాసు తీసుకుని కట్టా రాజు వద్దనున్న డైరీలో సంతకం చేసేవాడు. కట్టా రాజు సెప్టెంబరు 21న దసరా కోసం విజయవాడకు వెళ్లాడు. ఈ నెల 3వ తేదీ ములకలచెరువు మద్యం తయారీ కేంద్రంపై దాడి జరిగినప్పుడు అక్కడ లేడు. 4వ తేదీన రావాల్సిన కట్టా రాజుకు జనార్దనరావు ఫోన్‌ చేసి ములకలచెరువుకు రావొద్దని చెప్పాడు. జనార్దనరావుతో పాటు బాలాజీ, రవి, జయచంద్రారెడ్డి, గిరిధర్‌ రెడ్డి, కట్టా సురేంద్ర నాయుడు, టి.రాజేశ్‌లతో పాటు మరికొంత మందికి ఈ నకిలీ మద్యంతో ప్రమేయం ఉందని కట్టా రాజు వాంగ్మూలం ఇచ్చాడు. రాక్‌స్టార్‌ వైన్స్‌కు సంబంధించిన అన్ని ఖాతాలను జయచంద్రారెడ్డి ఇంట్లో పనిచేసే అన్బురాసు చూసుకునేవాడని చెప్పాడు. కట్టా సురేంద్ర నాయుడు కమ్మవారిపల్లెలోని తన ఇంటిలో నకిలీ మద్యాన్ని నిల్వచేసి పరిసర గ్రామాలకు సరఫరా చేసేవాడని తెలిపాడు. రాక్‌స్టార్‌ వైన్స్‌కు సంబంధించి జయచంద్రారెడ్డి వద్ద డ్రైవర్‌గా పనిచేసే అష్రఫ్‌ అనే వ్యక్తి స్కార్పియో వాహనంలో పరిసర గ్రామాల్లో మద్యం సరఫరా చేసేవాడని కట్టా రాజు వాంగ్మూలంలో చెప్పాడు.


కొడాలికి ఆర్థిక సాయం

కేసులో ఏ12 నిందితుడు తెనాలికి చెందిన వైసీపీ నేత కొడాలి శ్రీనివాసరావు ఇచ్చిన వాంగ్మూలం మేరకు..జనార్దనరావుతో చదువుకునే సమయం నుంచే పరిచయం ఉంది. ఈ ఏడాది మార్చిలో జనార్దనరావు శ్రీనివాసరావును పిలిపించి ములకలచెరువులో తన వద్ద ఉద్యోగంలో చేరాలని కోరాడు. దీంతో అతను వారం తరువాత ములకలచెరువుకు వచ్చాడు. మదనపల్లె-ములకలచెరువు మార్గంలోని పాతరోడ్డులో పాత గోడౌన్‌ చూపించి నకిలీ మద్యం తయారీ కోసం లీజుకు తీసుకుంటున్నట్లు జనార్దనరావు చెప్పాడు. స్నేహం, గతంలో చేసిన ఆర్థిక సాయం కారణంగా ఆ షెడ్డును తాను లీజుకు తీసుకుంటున్నట్లు శ్రీనివాసరావు అగ్రిమెంటు చేసుకున్నాడు. అతనికి ఖాళీ మద్యం సీసాలు తెప్పించే బాధ్యత అప్పగించారు. మూడుసార్లు పెట్‌ బాటిల్స్‌ కావాలని పలు సంస్థలకు ఇన్‌వాయి్‌సలు పంపినట్లు తెలిపాడు. ఆ తరువాత భయపడి మే నెలలో వెనక్కి వెళ్లిపోయాడు. తిరిగి రాలేదు. పోలీసులు అతడి ఫోన్‌ను సీజ్‌ చేశారు.


కట్టారాజు, కొడాలికి రిమాండ్‌

ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు జనార్దనరావు అనుచరుడు కట్టా రాజు, కొడాలి శ్రీనివాసరావును పోలీసులు బుధవారం తంబళ్లపల్లె కోర్టులో హాజరుపరిచారు. కోర్టు వీరిద్దరికీ 14 రోజులు రిమాండ్‌ విధించింది. వీరిని మదనపల్లె సబ్‌జైలుకు తరలించారు. టీడీపీ నుంచి సస్పెన్షన్‌కు గురైన తంబళ్లపల్లె ఇన్‌చార్జి జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది గిరిధర్‌రెడ్డితో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే కొత్తగా చేర్చిన పేర్లను వెల్లడించకుండా ఉన్నతాధికారులు గోప్యత పాటిస్తున్నారు. కాగా ప్రధాన నిందితుడు జనార్దనరావు లొంగుబాటుకు సిద్ధమైనట్లు తెలిసింది. దక్షణాఫ్రికాలో ఉన్న అతను బెంగళూరుకు వచ్చి తంబళ్లపల్లె లేదా మదనపల్లె కోర్టులో లొంగిపోతాడని విశ్వసనీయ సమాచారం. గురు లేదా శుక్రవారం సాయంత్రంలోగా లొంగిపోయే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. జనార్దనరావు, జయచంద్రారెడ్డి ఇద్దరూ స్నేహితులు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా జయచంద్రారెడ్డి పోటీ చేసిన సమయంలో ఆయనకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలన్నీ జనార్దనరావే చూశారు. కాగా నకిలీ మద్యం తయారీ కేసులో ఇప్పటికే అరెస్టై మదనపల్లె సబ్‌జైలులో ఉన్న 10 మంది నిందితులను కస్టడీకి ఇవ్వాలని ఎక్సైజ్‌ అధికారులు తంబళ్లపల్లె కోర్టులో వేసిన పిటిషన్‌పై విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేశారు.

Updated Date - Oct 09 , 2025 | 04:11 AM