Share News

సమస్యలతో సతమతం

ABN , Publish Date - Dec 19 , 2025 | 01:05 AM

జిల్లా వాసులు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర రాక అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. వర్షాలు, వరదలు వచ్చినప్పుడు పంటలను ముంచెత్తుతున్న పంట కాల్వలు, డ్రెయిన్లు పూడిక తీతకు నోచు కోవడంలేదు. ప్రభుత్వ కాలనీల్లో అరకొర వసతులతో అవస్థలు పడుతూ జీవనం సాగిస్తున్నారు. జిల్లాకే తలమానికమైన మచిలీపట్నం పోర్టు, గిలకలదిండి హార్బర్‌ పనులు ఒక అడుగు ముందుకు, మూడు అడుగులు వెనక్కి అన్నట్టు సాగుతున్నాయి. ఇలా అనేక సమస్యలు జిల్లాలో తిష్ట వేశాయి. శుక్రవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన జరిగే సమావేశంలో ఈ సమస్యలపై చర్చించి పరిష్కారాలు చూపాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

సమస్యలతో సతమతం

-అన్నదాతకు అందని గిట్టుబాటు ధర

-పూడిక తీతకు నోచుకోని పంట కాల్వలు, డ్రెయిన్లు

-కనీస వసతులు లేక ప్రభుత్వ కాలనీల్లో ప్రజల అవస్థలు

-నత్తనడకన మచిలీపట్నం పోర్టు, గిలకలదిండి హార్బర్‌ పనులు

- నేడు ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన జిల్లా సమీక్షా సమావేశం

- జిల్లాలో ప్రధాన సమస్యలపై చర్చ జరిగేనా?

జిల్లా వాసులు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర రాక అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. వర్షాలు, వరదలు వచ్చినప్పుడు పంటలను ముంచెత్తుతున్న పంట కాల్వలు, డ్రెయిన్లు పూడిక తీతకు నోచు కోవడంలేదు. ప్రభుత్వ కాలనీల్లో అరకొర వసతులతో అవస్థలు పడుతూ జీవనం సాగిస్తున్నారు. జిల్లాకే తలమానికమైన మచిలీపట్నం పోర్టు, గిలకలదిండి హార్బర్‌ పనులు ఒక అడుగు ముందుకు, మూడు అడుగులు వెనక్కి అన్నట్టు సాగుతున్నాయి. ఇలా అనేక సమస్యలు జిల్లాలో తిష్ట వేశాయి. శుక్రవారం జిల్లా ఇన్‌చార్జి మంత్రి అధ్యక్షతన జరిగే సమావేశంలో ఈ సమస్యలపై చర్చించి పరిష్కారాలు చూపాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:

జెడ్పీ సమావేశపు హాలులో జిల్లా సమీక్షా కమిటీ సమావేశం జిల్లా ఇన్‌చార్జి మంత్రి వాసంశెట్టి సుభాష్‌ అధ్యక్షతన శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి ప్రారంభం కానుంది. మంత్రి కొల్లు రవీంద్ర, శాసన సభ్యులు, ఎంపీ, జిల్లా అధికారులు హాజరుకానున్నారు. ఈ సమావేశంలో జిల్లా అభివృద్ధిపై ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనే అంశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలులో సరైన మద్దతు ధర లభించక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో రహదారుల అభివృద్ధి, రానున్న వేసవిలో తాగునీటి ఇబ్బందులు, నిధుల కేటాయింపు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించినిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జిల్లా పరిషత నిధులు రూ.12 కోట్లతో చేపట్టేందుకు అనుమతులు ఇచ్చిన 205 పనులను ఇటీవల రద్దు చేశారు. ఈ అంశంపై జెడ్పీ సీఈవోకు, జెడ్పీటీసీ సభ్యులకు మధ్య వివాదం నడుస్తోంది. ఈ అంశం చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తోంది,

ధాన్యం కొనుగోలులో ఇబ్బందులపై చర్చిస్తారా!

ఖరీఫ్‌ ధాన్యం కొనుగోలులో రైతులకు పూర్తిస్థాయిలో మద్దతు ధర లభించడం లేదు.ఽ ధాన్యంలో తేమశాతం, నూకశాతం అధికంగా ఉందని, మొంథా, దిత్వా తుఫానుల ప్రభావంతో కురిసిన వర్షాలతో నాణ్యత లోపించిందనే కారణంతో మిల్లర్లు ధరలు తగ్గించారు. బస్తాధాన్యం రూ.1,770 కొనుగోలు చేయాల్సి ఉంటే రూ.1400 నుంచి రూ.1500 మాత్రమే కొంటున్నారు. బ్యాంకు గ్యారెంటీలు చూపకుండా జాప్యం చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 4.01 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా, ఇంకా 3.90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంది. రైతులకు ధాన్యం మద్దతు ధరను ఇప్పించే విషయంపై ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారని రైతులు ఎదురుచూస్తున్నారు.

కాల్వల మరమ్మతుల సంగతేంటి?

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌కు సంబంధించి వరి పంటను కాపాడేందుకు జనవరి నెల వరకు కాల్వలకు సాగు నీటిని విడుదల చేస్తామని జలవనరులశాఖ అధికారులు చెబుతున్నారు. దాళ్వా పంటకు సాగు నీటి విడుదల లేదని, ఆరు తడి పంటలనే సాగు చేయాలని అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి నుంచి జూన్‌, జూలై వరకు కాల్వలు ఖాళీగానే ఉంటాయి. ఈ ఆరు నెలల వ్యవధిలో జిల్లాలోని ప్రధాన పంట కాల్వలు, డ్రెయినేజీల్లో పూడికతీత పనులతో పాటు, మరమ్మతు పనులు ఎంతమేర చేస్తారనే అంశంపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ ఏడాది నియోజకవర్గానికి రూ.2 కోట్లు చొప్పున, జిల్లా మొత్తంగా కేవలం రూ.14 కోట్లను కాల్వల నిర్వహణ(ఓఅండ్‌ఎం) పనులకు కేటాయించి సరిపెట్టారు. వచ్చే ఏడాదిలో జలవనరులశాఖ అధికారులు ఎంతమేర కాల్వల పనులకు అంచనాలను తయారు చేస్తారు.. ఎంతమేర నిధులు విడుదల అవుతాయనే అంశంపై ఈ సమావేశం చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మచిలీపట్నం, అవనిగడ్డ నియోజకవర్గాల్లో ఎనిమిది అవుట్‌ ఫాల్‌ స్లూయిస్‌ గేట్లకు కనీస మరమ్మతులు చేసేందుకు రూ.38 కోట్లతో అంచనాలు రూపొందించారు. ఈ పనులకు సంబంధించి నేటికీ అనుమతులు రాలేదు.

నూతన కాలనీల్లో మౌలిక వసతులు కరువు

జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 665 ప్రభుత్వ లేఅవుట్‌లు ఉన్నాయి. వీటిలో 86,084 గృహాలను నిర్మాణం చేయాల్సి ఉంది. 30 వేలకుపైగా గృహాలు నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. 25వేల గృహాలకు సంబంధించిన పనులు వివిధ దశల్లో ఉన్నాయి. నూతన కాలనీల్లో రహదారులను కనీసంగా మెరక చేయకపోవడంతో అక్కడ నివాసం ఉంటున్నవారు వర్షాకాలంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అన్ని చోట్ల రోడ్లు, తాగునీటి పైపులైన్లు, విద్యుత లైన్‌ల పనులు చేపట్టి వేగవంతం చేసే అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

పశుసంవర్థకశాఖకు ఊతమిచ్చేలా నిర్ణయం తీసుకుంటారా ః

జిల్లాలో 29,261 ఆవులు, 3.50 లక్షల గేదెలు, 1.71 లక్షల గొర్రెలు, 40,500 మేకలు ఉన్నాయి. రైతులకు వ్యవసాయానికి అనుబంధంగా పాడిపరిశ్రమ ఉంటోంది. జిల్లాలో ఏరియా వెటర్నరీ ఆస్పత్రులు 13, వెటర్నరీ ఆస్పత్రులు 59, గ్రామీణ పశువైద్యశాలలు 101 ఉన్నాయి. వీటిలో పశువులకు సంబంధించిన మందులు అందుబాటులో ఉండటం లేదు. బయటనే కొనుగోలు చేయాల్సిన దుస్థితి. రైతులకు అధిక ఆదాయం సమకూర్చే పశుసంవర్థకశాఖకు ఊతమిచ్చేలా ఈ సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

- జిల్ల్లాలో రొయ్యల చెరువులకు విద్యుత సబ్సిడీ రాకపోవడంతో నెలకు 100 హెచ్‌పీ ట్రాన్స్‌ఫార్మర్‌కు రూ.50 వేల బిల్లు వచ్చే రైతులకు రూ.1.50 లక్షల మేర విద్యుత బిల్లులు వస్తున్నాయి. దీంతో పాటు అమెరికా ఆంక్షల నేపథ్యంలో రొయ్యల ఎగుమతులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రొయ్యల చెరువులకు విద్యుత రాయితీ ఇచ్చే అంశంపైనా ఈ సమావేశంలో నిర్ణయం తీసువాలని ఆక్వా రైతులు కోరుతున్నారు.

పోర్టు, గిలకలదిండి హార్బర్‌ పనులపై చర్చ అవసరం

జిల్లా అభివృద్ధిలో కీలకమైన మచిలీపట్నం పోర్టు పనులు 45 శాతం వరకు పూర్తయ్యాయి. 2026, డిసెంబరు నాటికి పోర్టు పనులు పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పనులను మరింత వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. అలాగే రూ.350 కోట్ల అంచనాలతో ప్రారంభించిన గిలకలదిండి హార్బర్‌ పనులను కాంట్రాక్టర్‌ దాదాపు నిలిపివేశారు. గడువు పొడిగించినా పనులు చేయకుండా జాప్యం చేస్తున్నారు. ఈ పనులు వేగవంతం చేయడంపైనా ఈ సమావేశంలో చర్చించాల్సిన అవసరం ఉంది.

- పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించడంపైతీసుకోవాల్సిన చర్యలపైనా చర్చించాలి.

- ఇంటింటికీ కుళాయిలను ఏర్పాటు చేసి తాగునీటిని అందించేందుకు జల్‌ జీవన్‌ మిషన్‌ పనులు దాదాపు నిలిచిపోయాయి. అమృత 2.0 ద్వారా పురపాలక సంఘాల్లో చేపట్టే పనులు, పీఎం సూర్యఘర్‌ పథకం అమలు తదితర అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.

Updated Date - Dec 19 , 2025 | 01:05 AM