Share News

Macherla Court: పిన్నెల్లి సోదరులకు రిమాండ్‌

ABN , Publish Date - Dec 12 , 2025 | 05:33 AM

జైలుకు పోకుండా తప్పించుకోవడానికి చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలం కావడంతో పిన్నెల్లి సోదరులు గురువారం పల్నాడు జిల్లా మాచర్ల కోర్టులో లొంగిపోయారు.

Macherla Court: పిన్నెల్లి సోదరులకు  రిమాండ్‌

  • జంట హత్యల కేసులో మాచర్ల కోర్టులో లొంగుబాటు

  • నెల్లూరు జైలుకు తరలించిన పోలీసులు

  • వైసీపీ హయాంలో మాచర్లలో అరాచకం

  • 11 కేసుల్లో బెయిల్‌ తెచ్చుకోగలిగిన బ్రదర్స్‌

  • జంట హత్యల కేసులో మాత్రం చుక్కెదురు

  • సుప్రీంకోర్టు ఆదేశాలతో కోర్టుకు సరెండర్‌

మాచర్ల, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): జైలుకు పోకుండా తప్పించుకోవడానికి చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలం కావడంతో పిన్నెల్లి సోదరులు గురువారం పల్నాడు జిల్లా మాచర్ల కోర్టులో లొంగిపోయారు. గత ఏడాదిన్నర కాలంలో 11 కేసుల్లో బెయిల్‌ తెచ్చుకోగలిగారుగానీ, జంట హత్యల కేసులో మాత్రం వీరిద్దరు జైలుకు పోక తప్పలేదు. 14 రోజుల రిమాండ్‌కు కోర్టు ఆదేశించడంతో, గట్టి ఎస్కార్ట్‌ బందోబస్తు మధ్య పిన్నెల్లి సోదరులను నెల్లూరు జైలుకు తరలించారు. గతేడాది మే 24న పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నేతలు జవిశెట్టి వెంకటేశ్వర్లు, ఆయన సోదరుడు కోటేశ్వరరావు హత్యకు గురయ్యారు. ఈ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(ఏ6), ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి(ఏ7) మాచర్లలోని జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు న్యాయాధికారి పి. ప్రశాంత్‌ ఎదుట ఉదయం 11 గంటలకు లొంగిపోయారు. పిన్నెల్లి సోదరుల తరపున హైకోర్టు న్యాయవాది రామలక్ష్మారెడ్డి, గురజాల న్యాయవాదులు బర్రెడ్డి నాగిరెడ్డి, చల్లా రామిరెడ్డి, మాచర్ల న్యాయవాదులు సీహెచ్‌ నాగిరెడ్డి, గుంజె వరప్రసాద్‌, జి వెంకటేశ్వర్లు, చిట్టా విజయభాస్కర్‌రెడ్డి వాదనలు వినిపించారు. నిందితులకు రిమాండ్‌ విధించాలని ప్రభుత్వ న్యాయవాది పి. విజయకుమార్‌ కోరారు.

Updated Date - Dec 12 , 2025 | 05:33 AM