Share News

Macherla Court: పోలీసు కస్టడీకి పిన్నెల్లి సోదరులు

ABN , Publish Date - Dec 27 , 2025 | 04:13 AM

మాచర్ల వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిలను రెండు రోజుల పోలీసుల కస్టడీకి మాచర్ల న్యాయస్థానం అనుమతించింది.

Macherla Court: పోలీసు కస్టడీకి పిన్నెల్లి సోదరులు

  • 29, 30 తేదీల్లో విచారించేందుకు మాచర్ల కోర్టు అనుమతి

మాచర్ల, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): మాచర్ల వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు వెంకట్రామిరెడ్డిలను రెండు రోజుల పోలీసుల కస్టడీకి మాచర్ల న్యాయస్థానం అనుమతించింది. మాచర్ల రూరల్‌ పోలీసులు పిన్నెల్లి సోదరులను తమ కస్టడీ ఇవ్వాలని కోరగా.. దీనిపై శుక్రవారం న్యాయమూర్తి శ్రీనివాస్‌ కల్యాణ్‌ విచారించారు. వారిద్దరిని ఈ నెల 29, 30 తేదీల్లో విచారించేందుకు అనుమతించారు. దీంతో మాచర్ల రూరల్‌ పోలీసులు నెల్లూరు జైలుకు వెళ్లి.. పిన్నెల్లి సోదరులను విచారించాల్సి ఉంది. నిందితుల తరఫున న్యాయవాది బార్రెడ్డి నాగిరెడ్డి, ప్రభుత్వం తరుఫున ఇన్‌చార్జి ఏపీపీ ప్రసాద్‌నాయక్‌ వాదనలు వినిపించారు. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో గత మే నెల 24న జరిగిన టీడీపీ నేతలు జెవిశెట్టి వెంకటేశ్వర్లు, అతని సోదరుడు జెవిశెట్టి కోటేశ్వరరావు హత్య కేసులో రామకృష్ణారెడ్డి (ఏ6), వెంకట్రామిరెడ్డి (ఏ7)గా ఉన్నారు. వీరు ఈ నెల 11న మాచర్ల జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో లొంగిపోయారు. న్యాయమూర్తి ప్రశాంత్‌ వీరికి 14 రోజుల రిమాండ్‌ విధించగా.. పిన్నెల్లి సోదరులు ప్రస్తుతం నెల్లూరు జిల్లా జైలులో ఉన్నారు. బుధవారం వీరి రిమాండ్‌ గడువు ముగియడంతో న్యాయమూర్తి ప్రశాంత్‌ ఆన్‌లైన్‌ ద్వారా పిన్నెల్లి సోదరులను విచారించారు. అనంతరం జనవరి 7వ తేదీ వరకు రిమాండ్‌ను పొడిగించారు.

Updated Date - Dec 27 , 2025 | 04:14 AM