Share News

Supreme Court: పిన్నెల్లి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వాయిదా

ABN , Publish Date - Oct 09 , 2025 | 05:03 AM

తెలుగుదేశం నాయకుల హత్య కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట రామిరెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ మరోసారి వాయిదా పడింది.

Supreme Court: పిన్నెల్లి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వాయిదా

  • అఫిడవిట్‌ దాఖలుకు సమయం కోరిన ప్రభుత్వం

  • తదుపరి విచారణ నవంబరు 3కు వాయిదా వేసిన సుప్రీం

న్యూఢిల్లీ, అక్టోబరు 8(ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం నాయకుల హత్య కేసులో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట రామిరెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ మరోసారి వాయిదా పడింది. అఫిడవిట్‌ దాఖలు చేసేందుకు మరికొంత సమయం ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేయడంతో విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టీడీపీ నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావు దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యలో పిన్నెల్లి సోదరుల ప్రమేయం ఉందని పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. తమకు ముం దస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ ఇద్దరూ హైకోర్టును ఆశ్రయించగా నిరాశే ఎదురైంది. హైకోర్టు తీర్పును ఆగస్టు 31న సుప్రీం కోర్టులో సవాల్‌ చేశారు. ఆ పిటిషన్‌ బుధవారం జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌, జస్టిస్‌ సందీప్‌ మెహతా, జస్టిస్‌ ఎన్‌.వి.అంజారియాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. అయితే, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ్‌ లూథ్రా హాజరై.. అఫిడవిట్‌ దాఖలు చేయడానికి మరికొంత సమయం కావాలని విజ్ఞప్తి చేశారు. రెండువారాల సమయం కావాలని కోరగా, పిన్నెల్లి తరఫు న్యాయవాదులు వారం రోజుల సమయం ఇవ్వాలని కోరారు. అయితే, ధర్మాసనం దీపావళి పండుగ తర్వాత చూద్దామని చెబుతూ.. తదుపరి విచారణను ధర్మాసనం నవంబరు 3కు వాయిదా వేసింది.

Updated Date - Oct 09 , 2025 | 05:04 AM