Budda Venkanna: పిన్నెల్లి సోదరులు.. దాడులు, హత్యలు చేయించిన దుర్మార్గులు
ABN , Publish Date - Dec 15 , 2025 | 05:17 AM
మున్సిపల్ చైర్మన్ పదవికి వేలం పెట్టి దాడులు, హత్యలు చేయించిన దుర్మార్గులు పిన్నెల్లి సోదరులని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు.
వారి కోసం కొవ్వొత్తుల ర్యాలీలు చేయాలా..?: బుద్దా వెంకన్న
విజయవాడ అర్బన్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ చైర్మన్ పదవికి వేలం పెట్టి దాడులు, హత్యలు చేయించిన దుర్మార్గులు పిన్నెల్లి సోదరులని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న అన్నారు. విజయవాడలోని ఎంపీ కార్యాలయంలో ఆదివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు ఆదేశాలతో మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిలను అరెస్టు చేస్తే.. అది తప్పు, అన్యాయమని జగన్ మాట్లాడుతున్నాడని విమర్శించారు. టీడీపీ మద్దతుదారులను చంపేయాలని లక్ష్యంగా పెట్టుకున్న వ్యక్తులు పిన్నెల్లి సోదరులన్నారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సామాజిక వర్గంపైన తెగబడిన దుర్మార్గులని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిన్నెల్లి సోదరులకు మద్దతుగా కొవ్వొత్తుల ప్రదర్శన చేయాలని, జైలుకు వెళ్లి పరామర్శించాలని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఇద్దరు వ్యక్తులను కిరాతకంగా చంపిన పిన్నెల్లి సోదరులను వెనుకేసుకురావడం ఆయన నైజానికి నిదర్శనమన్నారు. అందుకే వైసీపీకి ప్రజలు 11 సీట్లు ఇచ్చారన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో కొడాలి నాని, పేర్ని నానిలు ఏదేదో వాగుతున్నారని.. ఒకరికి గుండెకాయ లేదు, మరొకరి ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని ఎద్దేవా చేశారు. ఇటువంటి వారు జగన్‌ను సీఎం చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. రాజశేఖరరెడ్డి బతికి వచ్చినా మళ్లీ జగన్ సీఎం కావడం కల అన్నారు.