ASI Director: అది పింక్ డైమండ్ కాదు.. కెంపు
ABN , Publish Date - Sep 11 , 2025 | 04:00 AM
తిరుమల శ్రీవారికి మైసూరు మహారాజు బహూకరించింది పింక్ డైమండ్ కాదని, అది కేవలం కెంపు మాత్రమేనని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) స్పష్టం చేసింది.
1945లో మైసూరు మహారాజు శ్రీవారికి బహూకరించారు
అందులో ఉన్నది కెంపులు,కొన్ని రకాల రత్నాలు మాత్రమే
ఆధారాలతో తేల్చిన ఏఎస్ఐ డైరెక్టర్ మునిరత్నం రెడ్డి
తిరుమల, సెప్టెంబరు 10(ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారికి మైసూరు మహారాజు బహూకరించింది పింక్ డైమండ్ కాదని, అది కేవలం కెంపు మాత్రమేనని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) స్పష్టం చేసింది. తిరుమల ఆలయంలోని అత్యంత విలువైన పింక్ డైమండ్‌ను మాయం చేశారంటూ 2018లో ప్రధాన అర్చకుడు రమణదీక్షితులు చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ అంశంపై ఏఎస్ఐ లోతుగా అధ్యయనం చేసింది. మైసూర్‌లోని ఏఎస్ఐ డైరెక్టర్(ఎపిగ్రఫీ) మునిరత్నం రెడ్డి ఆ వివరాలను బుధవారం వెల్లడించారు. తాము సేకరించిన సమాచారం ప్రకారం అది పింక్ డైమండ్ కానేకాదని ప్రకటించారు. 1945 జనవరి 9న మైసూరు మహారాజు జయచామరాజేంద్ర వడియార్ శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చారని, తాను బాల్యంలో ధరించిన హారాన్ని స్వామికి సమర్పించారని వివరించారు. మైసూరు ప్యాలెస్ రికార్డుల ప్రకారం అందులో కెంపులు, మరికొన్ని రకాల రత్నాలు మాత్రమే ఉన్నాయని, పింక్ డైమండ్ ప్రస్తావన అందులో లేదని మునిరత్నం రెడ్డి స్పష్టం చేశారు.