Guntur Highway Crash: యాత్ర నుంచి తిరిగొస్తూ.. మృత్యువొడికి..
ABN , Publish Date - Dec 27 , 2025 | 04:57 AM
రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణకు చెందిన ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు.
రెండు వేర్వేరు ప్రమాదాల్లో 8 మంది దుర్మరణం
మృతులంతా తెలంగాణవాసులు
నంద్యాల జిల్లాలో డివైడర్‌ను దాటి.. బస్సును ఢీకొట్టిన కారు
ఐదుగురు దుర్మరణం.. మృతుల్లో తండ్రీకొడుకు
గుంటూరులో రోడ్డు పక్క ఆగిఉన్న కారును ఢీకొట్టిన ట్రావెల్ బస్సు
ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి
బస్సు డైవ్రర్ నిర్లక్ష్యం, అతివేగమే దుర్ఘటనకు కారణం
ఆళ్లగడ్డ, గుంటూరు, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో తెలంగాణకు చెందిన ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో జరిగిన ప్రమాదంలో తండ్రీకొడుకులు మృతి చెందగా, గుంటూరు జిల్లాలో జరిగిన మరో ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కన్నుమూశారు. ఆళ్లగడ్డ పోలీసుల కథనం మేరకు.. హైదరాబాద్‌కు చెందిన గుండేరావు కులకర్ణి (46) టూరిస్టులకు క్యాటరింగ్ చేస్తూ వారి బస్సుల వెంట కారులో వెళ్లి వారికి వంట చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈనేపథ్యంలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు బస్సు యాత్రికులతో క్యాటరింగ్ ఒప్పదం కుదుర్చుకున్నారు. వారి వెంట ఈనెల 11న హైదరాబాద్ నుంచి బయలు దేరి శబరిమలై, మైసూర్, కాణిపాకం, తిరుపతి, ఒంటిమిట్ట ప్రాంతాలను సందర్శించారు. గురువారం తిరుపతి నుంచి హైదరాబాద్‌కు తిరిగొస్తుండగా వారు ప్రయాణిస్తున్న టొయోటొ క్వాలిస్ వాహనం.. ఆళ్లగడ్డ .. నల్లగట్ల సమీపంలో అతి వేగంగా ప్రయాణిస్తూ.. డివైడర్‌ను ఢీకొని అవతలి రోడ్డుపై ఎదురుగా వస్తున్న సీజేఆర్ ప్రైవేటు బస్సును ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న శివసాయి తండ్రి గుండేరావు కులకర్ణి, శివసాయి స్నేహితుడు శ్రావణ్(21), గుండేరావు సహాయకులు ఇటికాడి నరసింహులు(30), సిద్ధప్ప(50)అక్కడికక్కడే మృతి చెందారు. శివసాయితోపాటు, తీవ్రంగా గాయపడిన గుండేరావు మరో కుమారుడు సిద్ధార్థ కులకర్ణి(27)ని పోలీసులు హుటాహుటిన నంద్యాల ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ సిద్ధార్థ మృతి చెందాడు. కారులో ఇరుక్కున్న మృతదేహాలను క్రేన్ సాయంతో బయటికి తీసి ఆళ్లగడ్డ ప్ర భుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనాస్థలాన్ని డీఎస్పీ ప్రమోద్, రూరల్ సీఐ రమణ, ఎస్‌ఐ వరప్రసాద్ పరిశీలించి కేసు నమోదు చేశారు. శివసాయితోపాటు వెళ్లిన అతడి స్నేహితుడు శ్రావణ్ కూడా ఈ ఘటనలో దుర్మరణం చెందడంతో.. అతడి తల్లిదండ్రుల శోకానికి అంతులేకుండా పో యింది. కారు అతివేగంతోపాటు, కారు నడుపుతున్న శివసా యి నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
మనవడి పుట్టెంటుక్రలు తీసి వస్తూ..
గుంటూరు శివారు 16వ నంబర్ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం, మిడతనపల్లికి చెందిన కుంచనపల్లి వెంకటయ్య (62), ఆయన భార్య కుంచనపల్లి సుశీల(55), వారి అల్లుడు వరసైన నవీలా మహేష్ (27) అక్కడికక్కడే మృతి చెందారు. వెంకటయ్య కుమారుడు కుంచనపల్లి మధు వంట మాస్టర్‌గా జీవనం సాగిస్తున్నారు. ఆయనకు భార్య మనీషా, జ్ఞానేశ్వర్(4), వర్షిత్ (11నెలలు) సంతానం ఉన్నారు. వర్షిత్ పుట్టెంట్రుకల మొక్కు తీర్చేందుకు ఈనెల 23న తిరుమల వెళ్లారు. 25న తిరుగు ప్రయాణమయ్యారు. వాస్తవానికి వారు ఒంగోలు మీదుగా అద్దంకి వచ్చి అక్కడి నుంచి నార్కెట్‌పల్లి హైవే మీదుగా తెలంగాణ వెళ్లా ల్సి ఉన్నా, కారుకు గాస్ ఫిల్లింగ్ కోసం మార్టూరు వరకు రావాల్సి వచ్చిం ది. దీంతో విజయవాడ మీదుగా వెళదామనుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం 4.30 గంటల సమయానికి గుంటూరు సమీపంలోని అంకిరెడ్డిపాలెం వద్దకు రాగానే.. కారు నడుపుతున్న మహే్‌షకు నిద్ర వస్తుండడంతో ముఖం కడుక్కుందామని, 16వ నంబర్ జాతీయ రహదారిపై రోడ్డు మార్జిన్‌లో కారు ఆపారు. ఇంతలో వెనుక నుంచి అతివేగంగా వచ్చిన వీఆర్‌సీఆర్‌కు చెందిన ప్రైవేటు ట్రావెల్ బస్సు కారును బలంగా ఢీ కొట్టింది. కారు డ్రైవింగ్ సీట్లో ఉన్న మహేష్, వెంకటయ్య, సుశీల అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ఉన్న మధు, ఆయన మామ మల్సూర్, భార్య మనీషా, ఇరువురు పిల్లలకు స్వల్ప గాయాలయ్యాయి. తిరుమలలో తన ఒడిలో కూర్చోబెట్టుకుని చిన్నారి వర్షిత్‌కు పుట్టు వెంట్రుకలు తీయించిన మేనమామ మహేష్ గంటల వ్యవధిలోనే మృతి చెందడంతో బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఘటనా స్థలాన్ని సందర్శించి ప్రమాద తీవ్రతను పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.