Eluru District: దాతృత్వపు వెలుగులు
ABN , Publish Date - Aug 19 , 2025 | 04:52 AM
పల్లెటూరులో పుట్టినా అకుంఠిత కృషితో ఉన్నత స్థానాలను అధిరోహించారు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు భూరి విరాళాలతో ఇప్పుడు ముందుకొచ్చారు.
జన్మభూమి రుణం తీర్చుకునేందుకు భారీ విరాళాలు
ఏలూరు జిల్లా లక్ష్మీపురంలో దాతల సాయంతో కంటి ఆస్పత్రి నిర్మాణం
దెందులూరు, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): పల్లెటూరులో పుట్టినా అకుంఠిత కృషితో ఉన్నత స్థానాలను అధిరోహించారు. జన్మభూమి రుణం తీర్చుకునేందుకు భూరి విరాళాలతో ఇప్పుడు ముందుకొచ్చారు. దాతృత్వపు వెలుగులతో ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం వంగూరు(లక్ష్మీపురం)లో పుట్టిన ఆ దాతలు, తమ గ్రామస్తులు ఎవరికీ కంటి సమస్యలు లేకుండా చూడాలని నిర్ణయించారు. దీనికోసం గ్రామానికి చెందిన కాసరనేని దమయంతి, మాజీ ఐఏఎస్ అధికారి కొప్పుల రాజు దంపతులు 11 ఎకరాల భూమి, రెండు కోట్ల నగదును విరాళంగా ఇచ్చారు. అలాగే గ్రామానికి చెందిన ఎన్‌ఆర్‌ఐ వాణీ శ్రీరామ్ రూ. 2 కోట్లు, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు రూ.కోటి, వంశీ మొక్కజొన్న సీడ్స్ సంస్థల అధినేత ఆర్.రామారావు రూ. కోటి విరాళంగా ప్రకటించారు. ఇక ఆస్పత్రి నిర్మాణానికి ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ ముందుకొచ్చింది. పేదలకు ఉచితంగా కంటి వైద్యం అందించేందుకు అంగీకరించింది. దీంతో ఆస్పత్రి నిర్మాణానికి సోమవారం దెందులూరు, ఏలూరు, కైకలూరు, తణుకు, విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, బడేటి చంటి, కామినేని శ్రీనివాస్, ఆరిమిల్లి రాధాకృష్ణ, గద్దే రామ్మోహన్‌రావు, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలంతో కలిసి దాతలు భూమి పూజ చేశారు. దీనికి ‘కాసరనేని గోపాలకృష్ణయ్య ప్రాంగణం-కాసరనేని పరిపూర్ణ లక్ష్మీ నేత్ర సంరక్షణ కేంద్రం’గా నామకరణం చేశారు. ఆస్పత్రికి రోడ్డు కోసం రూ. 30 లక్షల విలువైన 61 సెంట్ల భూమిని మరో దాత, దమయంతి సోదరుడు, మాజీ జడ్పీటీసీ కాసరనేని విద్యాసాగర్ విరాళంగా అందించారు. దాతలను ఎమ్మెల్యేలు అభినందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, గ్రామస్తులు పాల్గొన్నారు.