Leaders of Medical Associations: సమ్మె విరమించిన పీహెచ్‌సీ వైద్యులు
ABN , Publish Date - Oct 25 , 2025 | 05:43 AM
వృత్తి సంబంధ డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన హామీ ఇవ్వడంతో నిరవధిక సమ్మెను విరమిస్తున్నట్లు వైద్య సంఘాల నేతలు తెలిపారు.
మంత్రి సత్యకుమార్‌తో చర్చలు సఫలం
రోగులకు కలిగిన ఇబ్బందికి చింతిస్తున్నాం: డాక్టర్లు
అమరావతి, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): వృత్తి సంబంధ డిమాండ్ల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్దిష్టమైన హామీ ఇవ్వడంతో నిరవధిక సమ్మెను విరమిస్తున్నట్లు వైద్య సంఘాల నేతలు తెలిపారు. పీజీ మెడికల్ ఇన్ సర్వీస్ కోటా కొనసాగింపు, ఉద్యోగ సర్వీసు వ్యవహారాలపై సానుకూల ఉత్తర్వు లు కోరుతూ గతనెల 28వ తేదీ నుంచి పీహెచ్‌సీ (ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు) వైద్యులు ఆందోళన బాట పట్టారు. ఈనెల 3 నుంచి నిరవధిక సమ్మెను చేపట్టారు. ఈ నేపథ్యంలో వైద్యులతో మంత్రి సత్యకుమార్ చర్చలు జరిపారు. పీహెచ్‌సీ వైద్యుల సంఘం డిమాండ్ మేరకు 2025-26 విద్యా సంవత్సరంలో పీజీ మెడికల్ ఇన్ సర్వీస్ కోటాను 20ుఅమలు చేసేందుకు మంత్రి అంగీకరించారు. 2026-27లో 15 శాతం కోటాను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. గతంలో అమలులో ఉండి, ప్రస్తుతం నిలిచిపోయిన డీఎన్బీ కోర్సుల్లో ప్రవేశాల కల్పనపైనా మంత్రి సానుకూలంగా స్పందించారు. ట్రైబల్ అలవెన్స్, టైమ్ బౌండ్ పదోన్నతులు, నోషనల్ ఇంక్రిమెంట్లు, అర్బన్ సర్వీస్ ఎలిజిబిలిటీ ఐదేళ్లకు కుదింపు వంటి సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.