Medical Colleges: మెడికల్ పీజీ ఫీజు రూ.30 వేలు..
ABN , Publish Date - Dec 05 , 2025 | 06:06 AM
ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ ఏడాది జరగనున్న పీజీ ప్రవేశాలకు సంబంధించిన వార్షిక ఫీజులను ప్రభుత్వం నిర్ధారించింది.
అమరావతి, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో ఈ ఏడాది జరగనున్న పీజీ ప్రవేశాలకు సంబంధించిన వార్షిక ఫీజులను ప్రభుత్వం నిర్ధారించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ పంపించిన ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు ఆమోదించారు. ప్రభుత్వ కోటా సీటుకు ఏడాదికి రూ.30 వేలుగా నిర్ణయించింది. సెల్ఫ్ ఫైనాన్సింగ్ సీట్లకు రూ.9 లక్షలు, ఎన్‌ఆర్‌ఐ కోటా సీట్లకు రూ.29 లక్షలుగా ఫీజులు నిర్ధారించింది. 2025-26 ఏడాదికి సంబంధించి విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల మెడికల్ కాలేజీల్లో 60 పీజీ సీట్లు కేటాయిస్తూ నేషనల్ మెడికల్ కౌన్సిల్ (ఎన్‌ఎంసీ) నిర్ణయం తీసుకుంది. ఇందులో రాజమండ్రి, నంద్యాల మెడికల్ కాలేజీల్లో ఒక్కో దానిలో 16 పీజీ సీట్లు, విజయనగరం, మచిలీపట్నం మెడికల్ కాలేజీల్లో ఒక్కో దానిలో 12 పీజీ సీట్లు, ఏలూరు మెడికల్‌కాలేజీలో 4 పీజీ సీట్లు కేటాయించింది.