Consumer Awareness: తడి తగిలితే తంటా
ABN , Publish Date - Aug 27 , 2025 | 05:08 AM
వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించే క్రమంలో ఇథనాల్ కలిపిన పెట్రోలునే విక్రయించాలని కొన్నేళ్ల కిందటే కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించింది. అంతేకాదు, ఇథనాల్ శాతాన్ని 20కి పెంచింది.
నీరైపోతున్న పెట్రోల్
పెట్రోల్-ఇథనాల్ మిశ్రమ ప్రక్రియలో కంపెనీల నిర్లక్ష్యం
ఆయిల్ ట్యాంకులోకి నీటి చుక్క వెళ్లినా నీరవుతున్న ఇథనాల్
తరచూ వాహనాలకు రిపేర్లు
బంకుల్లోనే నీళ్లు కలిపేశారని భావిస్తూ వాహనదారుల గగ్గోలు
ఇటీవల.. పెట్రోల్‌లో ఇథనాల్‌ను 20 శాతానికి పెంచిన కేంద్రం
అవగాహన కల్పించడంలో విఫలం
విజయవాడలోని ఓ పెట్రోలు బంకులో ఇటీవల ఒకే కుటుంబానికి చెందిన వారు మూడు మోటారు సైకిళ్లలో పెట్రోలు పోయించుకున్నారు. అవి కొద్ది సేపటికే మొరాయించి ఆగిపోయాయి. మెకానిక్ దగ్గరకు తీసుకెళ్లగా.. పెట్రోల్‌లో నీళ్లు కలిశాయని చెప్పాడు. దీంతో వాళ్లు బంకుకు వెళ్లి పెట్రోలుకు బదులు నీళ్లు పోశారంటూ గొడవకు దిగారు. ఇది కేవలం కొందరి సమస్య కాదు.. ఎంతో మందికి ఎదురవుతున్న అనుభవం! దీనికి కారణం.. పెట్రోలులో ఇథనాల్ మిశ్రమం సక్రమంగా జరగకపోవడమే!!
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించే క్రమంలో ఇథనాల్ కలిపిన పెట్రోలునే విక్రయించాలని కొన్నేళ్ల కిందటే కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించింది. అంతేకాదు, ఇథనాల్ శాతాన్ని 20కి పెంచింది. కొన్నాళ్ల కిందటి వరకు ఆయిల్ కంపెనీలు ఒక శాతం ఇథనాల్ కలిపిన పెట్రోలును విక్రయించగా, తర్వాత ఇథనాల్ డోసును 5 శాతానికి, 10 శాతానికి పెంచారు. ఇటీవల కేంద్రం ఇథనాల్ శాతాన్ని 20కి పెంచాలని ఆదేశించింది. అంతేకాదు, ‘ఈ-20 పెట్రోల్ పాలసీ’ని తెచ్చింది. ముడిచమురు దిగుమతులను నియంత్రించడం, కాలుష్యానికి కారణమయ్యే కర్బన ఉద్గారాలను నియంత్రించే లక్ష్యంతో ఈ పాలసీని తీసుకువచ్చినట్టు కేంద్రం పేర్కొంది. 2030 నాటికి దశలవారీగా పెట్రోలులో ఇథనాల్‌ను 30 శాతానికి పెంచే దిశగా చర్యలు తీసుకుంటోంది. ఇదిలావుంటే, ఇథనాల్ కలిపిన పెట్రోలు నింపిన వాహనం ట్యాంకులోకి ఒక్క నీటి చుక్క చేరినా లేదా నీటి చెమ్మ(తడి) తగిలినా.. వెంటనే పెట్రోలులో కలిసి ఉన్న ఇథనాల్ మొత్తం నీరుగా మారిపోతోంది. అప్పటి వరకు ట్యాంకులో పాలు-నీళ్లుగా కలిసి ఉన్న పెట్రోలు-ఇథనాల్ పూర్తిగా వేరైపోతాయి. పెట్రోలు కంటే నీరు బరువుగా ఉండటం వల్ల నీరుగా మారిన ఇథనాల్ ట్యాంకు అడుగు భాగంలోకి, పెట్రోలు పైభాగంలోకి చేరుతుంది. ఈ కారణంగానే వాహనాలు మొరాయిస్తున్నాయి. వాహనాలకు వాటర్ సర్వీసింగ్ చేయించినా, వర్షంలో ఉంచినా పెట్రోలు ట్యాంకులోకి నీరు చేరడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో పెట్రోలుతో కలిసి ఉన్న ఇథనాల్ నీరుగా మారిపోతోంది.
ఏంటీ బ్లెండింగ్?
చెరకు, మొక్కజొన్న తదితర వ్యవసాయ ఉత్పత్తుల నుంచి ఇథనాల్‌ను తయారు చేస్తారు. పెట్రోల్ తరహాలోనే ఇథనాల్‌కు కూడా మండే స్వభావం ఉంది. వాహనాలకు పెట్రోలు ఏవిధంఽగా పని చేస్తుందో ఇథనాల్ కూడా అదే తరహా ఇంధనంగా పని చేస్తుంది. కాబట్టి పెట్రోలులో ఇథనాల్ కలపడం వల్ల ఎలాంటి నష్టం ఉండదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఇథనాల్‌ను పెట్రోల్‌లో కలిపే ప్రక్రియ కీలకం. దీనినే ‘ఇథనాల్ బ్లెండింగ్’ అంటారు. నిబంధనల ప్రకారం బ్లెండింగ్ చేసి బంకులకు సరఫరా చేయాల్సిన ఆయిల్ కంపెనీలు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. బంకులకు పంపే ట్యాంకుల్లో పెట్రోలు, ఇథనాల్‌ను విడివిడిగా నింపి తరలిస్తున్నాయి. పెట్రోలు బంకుల్లోని అండర్ గ్రౌండ్ ట్యాంకుల్లోకి నీరు చేరినా, చెమ్మ తగిలినా.. ఆ ట్యాంకులోని ఇథనాల్ మొత్తం నీరుగా మారిపోతోందని నిపుణులు చెబుతున్నారు. పెట్రోలు-ఇథనాల్ బ్లెండింగ్ ప్రక్రియ సరిగా ఉండాలని సూచిస్తున్నారు.
సుప్రీం కోర్టులో పిల్
రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా ఈ సమస్య తీవ్రంగా మారడంతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ‘ఈ-20 పెట్రోలు పాలసీ’ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. తప్పనిసరిగా 20 శాతం ఇథనాల్ కలిపిన ఇంధనాన్నే విక్రయించాలంటూ కేంద్రం విధించిన నిబంధనలను వ్యతిరేకిస్తూ న్యాయవాది అక్షయ్ మల్హోత్రా ఈ పిల్ వేశారు. పెట్రోలులో ఇథనాల్ బ్లెండింగ్‌పై వాహనదారులకు అవగాహన కల్పించకుండా ఈ పాలసీని అమలు చేయడం వినియోగదారుల రక్షణ చట్టం-2019 ఉల్లంఘనేనని వ్యాజ్యంలో పేర్కొన్నారు.
అవగాహన కల్పించాలి
‘‘పెట్రోలులో ఇథనాల్ కలుపుతున్నారనే విషయం ఇప్పటికీ చాలామంది వాహనదారులకు తెలియదు. దీనిపై ప్రభుత్వాలు, ఆయిల్ కంపెనీలు అవగాహన కల్పించాలి. ఇథనాల్‌ను శాస్త్రీయ పద్ధతుల్లో బ్లెండింగ్ చేస్తే సమస్య రాకపోవచ్చు. కానీ, ఆయిల్ కంపెనీలు బ్లెండింగ్ ప్రక్రియను ఎలా నిర్వహిస్తున్నాయో ఎవరికీ తెలియడం లేదు. వాహనదారులకు నష్టం జరిగితే.. దానికి పెట్రోలు బంకులను బాధ్యులను చేస్తున్నారు. పెట్రోలులో ఇథనాల్ బ్లెండింగ్ విధానంపై వాహనదారులకు అవగాహన కల్పించాల్సి ఉంది’’
- రావి గోపాలకృష్ణ, పెట్రోలు డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు