AP Assembly Petitions: ప్రజల వినతులపై అసెంబ్లీలో పిటిషన్లు
ABN , Publish Date - Sep 27 , 2025 | 06:40 AM
శాసనసభ పిటిషన్ల కమిటీకి సమర్పించేందుకు శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు పలు అంశాలపై పిటిషన్లు ఇచ్చారు. 20 మందికి పైగా ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో...
సమర్పించిన పలువురు ఎమ్మెల్యేలు
పలు అంశాలపై శాసనసభలో చర్చ
అమరావతి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): శాసనసభ పిటిషన్ల కమిటీకి సమర్పించేందుకు శుక్రవారం అసెంబ్లీలో ఎమ్మెల్యేలు పలు అంశాలపై పిటిషన్లు ఇచ్చారు. 20 మందికి పైగా ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాల్లో ప్రజల నుంచి అందిన వినతులను పిటిషన్ల రూపంలో అందజేశారు. ఈ సందర్భంగా ఆయా సమస్యలను వారు అసెంబ్లీలో చర్చించారు.
గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఆర్‌ఎంపీలకు శిక్షణ ఇవ్వాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కోరారు. తద్వారా చిన్నపాటి అనారోగ్య సమస్యలకు స్థానికంగానే పరిష్కారం లభిస్తుందన్నారు.
మినిమం టైమ్ స్కేలు ప్రాతిపదికపై పనిచేస్తున్న 1998 డీఎస్సీ టీచర్లను వారి మండలాలు, క్లస్టర్లలోనే నియమించాలని ఆముదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ కోరారు.
2019-24 మధ్య స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్‌లో టెండర్లు, ఇతర కొనుగోళ్ల అవినీతిపై విచారణ జరిపించాలని చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు కోరారు.
జగ్గయ్యపేటలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేయాలని జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య కోరారు.
కొత్తవలసలోని ముగదలపాడు గ్రామంలో రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాకపోవడం వల్ల భూములు అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడిందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. ఈ సమస్యకు పరిష్కారం చూపి వారికి న్యాయం చేయాలన్నారు.
డీఎస్సీ కారణంగా ఉద్యోగాలు కోల్పోయే ఆశ్రమ, గిరిజన పాఠశాలల్లోని తాత్కాలిక టీచర్లను ఆదుకోవాలని పాలకొండ ఎమ్మెల్యే ఎన్.జయకృష్ణ కోరారు.
వైసీపీ హయాంలో జరిగిన నాడు- నేడు పనుల్లో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు కోరారు.
రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని రాజాం ఎమ్మెల్యే కొండ్రు మురళి విజ్ఞప్తి చేశారు.
పరకామణి స్కాంపై విచారణ చేయాలి: జ్యోతుల నెహ్రూ
టీటీడీ పరకామణి స్కాంపై విచారణ జరిపించాలని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ డిమాండ్ చేశారు. జీరో అవర్‌లో మాట్లాడుతూ.. సీవీ రవికుమార్ అనే ఉద్యోగి అక్రమంగా రూ.200 కోట్లు సంపాదించాడని ఆరోపించారు. ఆయన డాలర్లు కొట్టేసిన విషయం వీడియోల్లోనూ బయటపడిందన్నారు. గత ప్రభుత్వంలోనే కేసు నమోదైనా ఉద్దేశపూర్వకంగా లోక్‌అదాలత్‌లో రాజీ చేశారన్నారు. కొట్టేసిన ఆస్తులను చివరికి ఆ ఉద్యోగి టీటీడీకి దానం చేశాడని, దానిని బోర్డు ఆమోదం లేకుండా ఈవో ఆమోదించారని ఆరోపించారు. ఫిర్యాదుదారున్ని బెదిరించి రాజీ చేశారని, దీనిపై అన్ని ఆధారాలున్నాయని, సిట్ ద్వారా విచారణ చేయించాలని డిమాండ్ చేశారు.