Share News

High Court: జగన్‌కు బిగ్ షాక్.. విచారణకు ఆదేశం!

ABN , Publish Date - Jul 31 , 2025 | 04:35 AM

మాజీ ముఖ్యమంత్రి జగన్‌ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వ హయాంలో సహజ వనరులను కొల్లగొట్టడంతో రాష్ట్ర ఖజానాకు రూ.లక్షల కోట్లు నష్టం వాటిల్లింది.

High Court: జగన్‌కు బిగ్ షాక్.. విచారణకు ఆదేశం!

  • హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు

  • పిటిషనర్‌ అభ్యర్థనతో విచారణ వారం రోజులకు వాయిదా

అమరావతి, జూలై 30(ఆంధ్రజ్యోతి): ‘మాజీ ముఖ్యమంత్రి జగన్‌ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వ హయాంలో సహజ వనరులను కొల్లగొట్టడంతో రాష్ట్ర ఖజానాకు రూ.లక్షల కోట్లు నష్టం వాటిల్లింది. దీనిపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో సిట్‌ ఏర్పాటు చేయండి’ అని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను, రెవెన్యూ, రాష్ట్ర పోలీసులను సిట్‌లో సభ్యులుగా నియమించాలని పిటిషనర్‌ విన్నవించారు. ఆదాయనికి మించి ఆస్తులు కలిగి ఉన్న జగన్‌, తదితరులపై నిష్పాక్షిక దర్యాప్తునకు వీలుగా ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసేలా సీబీఐ, ఈడీని ఆదేశించాలని కోరుతూ ఢిల్లీకి చెందిన న్యాయవాది మెహెక్‌ మహేశ్వరి ఈ పిల్‌ దాఖలు చేశారు. కూటమి ప్రభుత్వం విడుదల చేసిన శ్వేతపత్రాలను పిల్‌కు జత చేశారు. జీఏడీ ముఖ్యకార్యదర్శి, కేంద్ర హోం, ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శులను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిల్‌ బుధవారం విచారణకు రాగా పార్టీ ఇన్‌ పర్సన్‌ మెహెక్‌ మహేశ్వరి ఆన్‌లైన్‌ ద్వారా స్పందిస్తూ... ప్రస్తుత పిల్‌లో స్వయంగా హైకోర్టుకు హాజరై వాదనలు వినిపిస్తానని, విచారణను వచ్చే వారానికి వాయిదా వేయాలని కోరారు. అందుకు అంగీకరించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేసింది.


పిటిషన్‌లో ఏముందంటే....

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అవినీతిపై సీఎం చంద్రబాబు శాసనసభ వేదికగా శ్వేతపత్రాలు విడుదల చేశారు. గత ప్రభుత్వం ఖనిజాలు, గనులు, భూమి, అడవులను కొల్లగొట్టి ప్రభుత్వ ఖజానాకు రూ.లక్షల కోట్లు నష్టం చేసిందని అందులో పేర్కొన్నారు. ‘విశాఖలో భూ ఆక్రమణల ద్వారా ఖజానాకు రూ.4,469 కోట్ల నష్టం జరిగింది. ఒంగోలులో కుటుంబ వివాదాలు, ఖాళీ స్థలాలు, ప్రభుత్వ భూములకు నకిలీ పట్టాలు సృష్టించి రూ.101 కోట్ల భూ కుంభకోణానికి పాల్పడ్డారు. తిరుపతిలో నిషేధిత జాబితా(22ఏ)లోని భూములను రిజిస్ట్రేషన్‌ చేయడం ద్వారా ఖజానాకు రూ.270 కోట్లు నష్టం వాటిల్లింది. చిత్తూరు జిల్లాలో ఎస్టేట్‌ అబాలిష్‌మెంట్‌ యాక్ట్‌ను ఉల్లంఘించి వ్యవసాయేతర భూముల్లో సొంత మనుషులకు పట్టాల కేటాయించడంద్వారా రూ.99 కోట్లు, అసైన్డ్‌ భూముల్లో ఇళ్లస్థలాలు కేటాయించడం, వివిధఅక్రమాల ద్వారా రూ.3వేల కోట్లు, వైసీపీ కార్యాలయాలకు భూముల కేటాయింపుతో రూ.300 కోట్ల అక్రమాలకు పాల్పడ్డారు’ అని శ్వేతపత్రంలో పేర్కొన్న వివరాలను పిటిషన్‌లో పేర్కొన్నారు.

Updated Date - Jul 31 , 2025 | 07:13 AM