Nara Lokesh: వ్యక్తిగత దాడులు రాజకీయాల్లో వాంఛనీయం కాదు
ABN , Publish Date - Nov 26 , 2025 | 06:52 AM
రాజకీయాల్లో వ్యక్తిగత దాడులు ఎప్పుడూ వాంఛనీయం కాదు. విమర్శలు చేసే సమయంలోనూ గౌరవంగా వ్యవహరించాలి అని టీడీపీ శ్రేణులకు మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు.
విమర్శ కూడా గౌరవంగా ఉండాలి: లోకేశ్
అమరావతి, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): ‘రాజకీయాల్లో వ్యక్తిగత దాడులు ఎప్పుడూ వాంఛనీయం కాదు. విమర్శలు చేసే సమయంలోనూ గౌరవంగా వ్యవహరించాలి’ అని టీడీపీ శ్రేణులకు మంత్రి లోకేశ్ పిలుపునిచ్చారు. వైసీపీ అధినేత జగన్.. తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న ప్లకార్డు పట్టుకుని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌ను అభ్యర్థిస్తున్నట్లు ఉన్న ఏఐ వీడియోను కొందరు పార్టీ సానుభూతిపరులు వైరల్ చేయడంపై లోకేశ్ స్పందించారు. ‘ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలు సహజం. కానీ అవి వ్యక్తిగత దాడులుగా మారకూడదు. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు గౌరవప్రదంగా ఉండాలి. సంబంధిత అంశాలకు మాత్రమే విమర్శ పరిమితం కావాలి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు... ద్వేషపూరిత, దిగజారుడు విమర్శల నుంచి నిర్మాణాత్మక విమర్శలు, అభివృద్ధి దిశగా పయనించాలి’ అని లోకేశ్ ఆకాంక్షించారు.