Share News

Political Clash: గుడివాడలో హైటెన్షన్‌

ABN , Publish Date - Jul 13 , 2025 | 03:04 AM

ఎన్నిసార్లు రప్పా రప్పా అంటార్రా.. అధికారం రాగానే.. చీకట్లో కన్ను కొడితే నరికెయ్యాలి’’ అంటూ.. వైసీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ ఉన్మాద వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై...

Political Clash: గుడివాడలో హైటెన్షన్‌

  • పేర్ని ఉన్మాద వ్యాఖ్యలపై ఫైర్‌.. వైసీపీ సమావేశం ముట్టడి

  • పేర్ని నాని వస్తే నిలదీయాలని నిర్ణయించిన టీడీపీ కార్యకర్తలు

  • మచిలీపట్నంలో నాని గృహ నిర్బంధం.. ఉద్రిక్తత నేపథ్యంలో కొడాలి డుమ్మా

  • కృష్ణా జడ్పీ చైర్‌పర్సన్‌ హారిక కారుపై దేశం శ్రేణుల దాడి.. పగిలిన అద్దాలు

విజయవాడ/గుడివాడ, జూలై 12(ఆంధ్రజ్యోతి): ‘‘ఎన్నిసార్లు రప్పా రప్పా అంటార్రా.. అధికారం రాగానే.. చీకట్లో కన్ను కొడితే నరికెయ్యాలి’’ అంటూ.. వైసీపీ కార్యకర్తలను రెచ్చగొడుతూ ఉన్మాద వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ నేత, మాజీ మంత్రి పేర్ని నానిపై ఉమ్మడి కృష్ణా జిల్లా టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. శనివారం గుడివాడ ‘కే’ కన్వెన్షన్‌లో వైసీపీ నిర్వహించ తలపెట్టిన ‘బాబు ష్యూరిటీ-మోసం గ్యారంటీ’ సమావేశానికి పేర్ని నానీ వస్తున్నట్టు తెలుసుకుని.. అడ్డుకునేందుకు టీడీపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అప్రమత్తమైన పోలీసులు టీడీపీ కార్యకర్తలను అడ్డుకోవడంతో తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దింపారు. మరోవైపు, మచిలీపట్నం నుంచి పేర్ని నాని గుడివాడకు రాకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. తీవ్ర ఉద్రిక్తత నేపథ్యంలో కొడాలి నాని డుమ్మా కొట్టారు. పేర్ని నాని బయలుదేరే ప్రయత్నం చేసినా. పోలీసులు గృహ నిర్బంధం చేశారు. మరోవైపు మచిలీపట్నం, అవనిగడ్డ పోలీసు స్టేషన్లలో పేర్నిపై కేసులు నమోదయ్యాయి.


పోలీసుల మాట బేఖాతరు

‘బాబు ష్యూరిటీ’ కార్యమ్రంలో పాల్గొనేందుకు వచ్చిన కృష్ణా జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక కారును టీడీపీ శ్రేణులు అడ్డగించారు. పోలీసులు కూడా ఆమెను వెనక్కి వెళ్లిపోవాలని సూచించారు. అయినా, ఆమె లెక్కచేయకపోవడంతో ఈలోగా టీడీపీ శ్రేణు లు హారిక కారు అద్దాలు ధ్వంసం చేశారు.

గతం గుర్తు చేస్తూ..: ‘కుప్పంలో చంద్రబాబు గెలిస్తే రాజకీయాలు వదిలేసి ఆయన బూట్లు పాలిష్‌ చేస్తూ ఆయన దగ్గరే పడుంటా.’ అంటూ గత ఎన్నికల ముందు కొడాలి నానీ చేసిన వ్యాఖ్యలను టీడీపీ కార్యకర్తలు గుర్తు చేశారు. ‘ఓటమి తర్వాత ఈ సవాల్‌ను మరిచిపోయారు’ అంటూ గుడివాడలో భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. నాని ఎక్కడ దాక్కున్నా బయటకు రావాలని శ్రేణులు నినాదాలు చేశారు.


  • మా కారునే ఆపుతారా.. కొడకల్లారా!

  • పోలీసులపై రెచ్చిపోయిన జెడ్పీ చైర్‌పర్సన్‌ భర్త

  • మీడియా ముందు హారిక మొసలి కన్నీరు

గుడివాడలో పరిస్థితి ఉద్రిక్తతంగా ఉందని.. వెనక్కి వెళ్లిపోవాలని నచ్చజెప్పిన పోలీసులపై వైసీపీ నాయకురాలు, కృష్ణా జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ ఉప్పాల హారిక, ఆమె భర్త ఉప్పాల రాములు రెచ్చిపోయారు. నాగవరప్పాడు వంతెన వద్ద వారి కారును నిలిపివేయడంతో ‘‘మా కారునే ఆపుతారా.. కొడకల్లారా?’’ అంటూ ఉప్పాల రాము వేలు పెట్టి చూపిస్తూ పోలీసులను హెచ్చరించారు. ‘పోలీసు లం... కొడకడా ఏం పీకుతున్నావ్‌ రా!?’ అంటూ హారిక సైతం ఓ పోలీసుపై విరుచుకుపడ్డారు. పోలీసులు సంయమనంతో వ్యవహరించారు. హారిక అసభ్య పదజాలంతో టీడీపీ శ్రేణులను సైతం రెచ్చగొట్టారు. అనంతరం.. గుడివాడ వన్‌టౌన్‌ పోలీసుస్టేషన్‌కు చేరుకుని టీడీపీ నాయకులు తనపై దాడిచేశారని ఫిర్యాదు చేశారు. తమ తప్పేమీ లేదన్నట్టు హారిక మొసలి కన్నీరు కార్చారు.

ZP Chairperson Uppala Harika.jpg

Updated Date - Jul 13 , 2025 | 03:08 AM