Perni Nani: నేనేంటో చూపిస్తా
ABN , Publish Date - Oct 11 , 2025 | 05:05 AM
వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మచిలీపట్నం పోలీస్ స్టేషన్‌లో రెచ్చిపోయారు. నేనేంటో చూపిస్తా. మీ ఇష్టం వచ్చినట్లు వైసీపీ నేతలను, కార్యకర్తలను అరెస్టు చేస్తారా..
మచిలీపట్నం పోలీస్ స్టేషన్‌లో మాజీ మంత్రి పేర్ని నాని రచ్చ
చట్టపరంగా చర్యలు తప్పవు: ఎస్పీ
మచిలీపట్నం, అక్ట్టోబరు 10(ఆంధ్రజ్యోతి): వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మచిలీపట్నం పోలీస్ స్టేషన్‌లో రెచ్చిపోయారు. ‘‘నేనేంటో చూపిస్తా. మీ ఇష్టం వచ్చినట్లు వైసీపీ నేతలను, కార్యకర్తలను అరెస్టు చేస్తారా?.’’ అంటూ సీఐ ఏసుబాబుతో వాగ్వాదానికి దిగారు. ఈ వ్యవహారంపై స్పందించిన జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు.. పేర్ని నాని పై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో అభివృ ద్ధి చేయడాన్ని వ్యతిరేకిస్తున్న వైసీ పీ నేతలు.. మచిలీపట్నం మెడికల్ కళాశాల వద్ద గత నెల 19న ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు 400 మందిపై కేసు నమోదు చేశారు. వీరికి 41-ఏ ప్రకారం నోటీసులు ఇచ్చేందుకు ఒక్కొక్కరినీ స్టేషన్‌కు పిలుస్తున్నారు. అయితే, మచిలీపట్నం నగర వైసీపీ అధ్యక్షుడు మేకల సుధాకర్‌బాబు(సుబ్బన్న) నోటీసులు తీసుకోకుండా ఎస్‌ఐ, సీఐ లేని సమయంలో వచ్చి, వారు లేరుకాబట్టి తర్వాత వస్తానని చెప్పి వెళ్లిపోతున్నారు. అదేవిధంగా 41-ఏ నోటీసులు ఎవరూ తీసుకోవద్దని, పోలీసులకు ఆధార్, ఇతర త్రా పత్రాలు ఇవ్వవద్దని వైసీపీ వాట్సాప్ గ్రూపులో పోస్టులు పెట్టారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సుబ్బన్నను శుక్రవారం స్టేషన్‌కు పిలిచి ప్రశ్నిం చారు. అనంతరం అరెస్టు చేశారు. విషయం తెలుసుకున్న పేర్ని నాని.. వైసీపీ కార్యకర్తలు, నేతలతో కలిసి స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ సమయంలో పేర్ని నాని సీఐతో వాగ్వాదానికి దిగారు. ‘‘నేను ఎవరో తెలియదని, గుర్తులేదని సీఐ అంటున్నారు. గుర్తుకువచ్చే రోజు వస్తుంది. ఏం చేస్తారు. మీచేతనైంది చేయండి. మహా అయితే సుబ్బన్నను సబ్ జైలులో పెడతారు.ఉరేస్తారా, వేస్తే వేయండి.’’ అని పేర్ని నాని బిగ్గరగా కేకలు వేశారు. ఈ సమయంలో సీఐ మాట్లాడుతూ.. ‘‘ఎవరో చెప్పిన మాటలు నమ్మొద్దు. వాస్తవాలు గ్రహించాలి. ఏం చేస్తారండీ బాబు. మహా అయితే మమ్మల్ని ఉరేస్తారా?.’’ అని అనడంతో.. ‘‘సుబ్బన్నను మీరు ఉరేస్తారా?.’’ అని పేర్ని నాని వాదించారు. కాగా, ఈ వ్యవహారంపై ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు మాట్లాడుతూ.. 41-ఏ నోటీసుపై సుబ్బన్న సరైన సమాధానం చెప్పలేదన్నారు. మాజీ మంత్రి పేర్ని నాని పోలీసులతో అమర్యాదగా, బెదిరింపు ధోరణితో మాట్లాడారని తెలిపారు. పోలీసులు విధి నిర్వహణలో ఉన్నప్పుడు బెదిరింపు ధోరణితో మాట్లాడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.