Perni Nani: పగలే చంపండని చెబుతా
ABN , Publish Date - Jul 14 , 2025 | 03:03 AM
నరకండి అని చెబితే చీకట్లో ఎందుకు చెయ్యమని చెబుతాను.. పగలే చెయ్యమని చెబుతా.. అంటూ మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి పేట్రేగిపోయారు.
బాబూ.. 76 ఏళ్లు వచ్చాయ్..ఇంకా ఎంత కాలం ఉంటావ్
ఏరా పీకే.. సిగ్గుపెట్టలేదా దేవుడు
సీఎం, డిప్యూటీ సీఎంపై పేర్ని నాని అసభ్య వ్యాఖ్యలు
పెడనలో మళ్లీ పేట్రేగిన మాజీ మంత్రి
విజయవాడ, జూలై 13(ఆంధ్రజ్యోతి): ‘నరకండి అని చెబితే చీకట్లో ఎందుకు చెయ్యమని చెబుతాను.. పగలే చెయ్యమని చెబుతా..’ అంటూ మాజీ మంత్రి పేర్ని నాని మరోసారి పేట్రేగిపోయారు. ఆదివారం పెడనలో వైసీపీ నిర్వహించిన ‘బాబు ష్యూరిటీ - మోసం గ్యారంటీ’ సమావేశంలో ఆయన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో పవన్, లోకేశ్ ఆయా సభల్లో ప్రసంగించిన వీడియోలను ప్రదర్శించి.. కూటమి నేతలనుద్దేశించి అరేయ్.. ఒరేయ్ అంటూ అనుచితంగా మాట్లాడారు. ‘నీకు 76 ఏళ్లు వచ్చాయి.. ఇంకెంతకాలం ఉంటావు చంద్రబాబూ! జగన్‌ను, వైసీపీని భూస్థాపితం చేస్తాడంట! ఏరా పీకే (పవన్ కల్యాణ్..) నిన్నే రా.. సిగ్గుపెట్టలేదా దేవుడు మీకు? మాట మీద నిలబడవా లోకేశ్! ఐదు నెలలు జైలులో వంశీ ఉన్నాడుగా.. జైలుకి వెళ్లి ఉచ్చ పోయించావా? ఎవడొస్తాడో రండిరా.. మూడు నెలల్లో ఆరోగ్యం బాగు చేసుకుని మా వాడు (కొడాలి నాని) వస్తున్నాడు. మిమ్మల్ని కట్‌డ్రాయర్ మీద నిలబెట్టి ఉరికిచ్చి కొడతాడు. అరేయ్.. నేను చంపేయండని అనలేదురా. అనాలనుకుంటే పట్టపగలే అంటాను. చంద్రబాబు రోజులు లెక్కపెట్టుకోమని చెప్పాడు కదా! జగన్ అంతు చూడడం నీ తరమా, నీ కొడుకు తరమా? బందరులో ఒక మంత్రి ఉన్నాడు.
బెజవాడ వెళ్లి ఇష్టారాజ్యాంగా నన్ను తిడతాడు. దిక్కుమాలిన నీ మంత్రి పదవిని కాపాడుకోవడం కోసం.. ఆడపిల్ల(జడ్పీ చైర్‌పర్సన్ హారిక)ను కూడా తిడుతున్నావ్. సొల్లు రవీంద్రా.. నువ్వు అన్నం తినడం లేదు. బ్రాందీ షాపులో రూపాయి తింటున్నావ్. చేపల మార్కెట్‌లో సొంత అన్న కొడుకుల్ని మోసం చేసి స్థలం దొబ్బేశావు. 2024 మేలో ఎన్నికల కమిషన్‌కు ఇచ్చిన అఫిడివిట్‌లో నీ ఆస్తి కోటి రూపాయలు కూడా లేదు. మరి రెండు కోట్లు ఎక్కడివి? అన్నం తింటున్నావా డబ్బు తింటున్నావా? అధికారంలోకి వచ్చాక అతడి సంగతి ప్రత్యేకంగా చూస్తాం’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రవీంద్ర బందరులో స్థలాలు ఆక్రమించుకుని పెద్ద భవంతి కడుతున్నాడని.. మద్యం దుకాణాలు, ఇసుక రేవుల నుంచి ముడుపులు తింటున్నాడని.. బందరు కోటలో 9 ఎకరాలు ఆక్రమించుకుని ఐస్‌ఫ్యాక్టరీ కడుతున్నాడని.. కృత్తివెన్నులో 45 ఎకరాలు భూమిని ఆక్రమించేశాడని ఆరోపించారు. స్పీకర్ పదవికి కూడా విలువ ఇవ్వకుండా అయ్యన్నపాత్రుడిని ‘ముసలి నాయాలు’ అని పేర్ని దూషించారు.