AP Liquor Consumption: మన ‘తాగుడు’ తక్కువే!
ABN , Publish Date - Dec 23 , 2025 | 04:20 AM
ఆంధ్రప్రదేశ్‌లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తలసరి మద్యం వినియోగం తక్కువగా ఉంది. 2025 జనాభా అంచనాల ప్రకారం.. 2024-25లో ఏపీలో తలసరి మద్యం వినియోగం 2.71 లీటర్లుగా ఉండగా..
ఏపీలో తలసరి మద్యం వినియోగం 2.71 లీటర్లు
తెలంగాణ, కర్ణాటకల్లో సగటున 4 లీటర్లపైనే
మద్యంపై తలసరి ఖర్చూ తక్కువే
ఎక్సైజ్ శాఖ అంచనాల్లో ఆసక్తికర అంశాలు వెల్లడి
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
ఆంధ్రప్రదేశ్‌లో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తలసరి మద్యం వినియోగం తక్కువగా ఉంది. 2025 జనాభా అంచనాల ప్రకారం.. 2024-25లో ఏపీలో తలసరి మద్యం వినియోగం 2.71 లీటర్లుగా ఉండగా.. అదే తెలంగాణలో 4.44 లీటర్లు, తమిళనాడులో 3.38 లీటర్లు, కర్ణాటకలో 4.25 లీటర్లు ఉంది. అంటే మన రాష్ట్రంలోని వారి కంటే ఆయా రాష్ట్రాల్లో ప్రజలు ఎక్కువగా మద్యం తాగేస్తున్నారు. దక్షిణాదిన ఒక్క కేరళలో మాత్రమే తలసరి మద్యం వినియోగం మన కంటే తక్కువగా 2.53 లీటర్లుగా ఉంది. ఏపీలో మద్యం తాగడం కోసం తలసరి ఖర్చు రూ.6,399. తెలంగాణలో రూ.11,351, తమిళనాడులో 7,282, కర్ణాటకలో 6,918, కేరళలో రూ.5,958 చొప్పున ఏడాదికి ఖర్చు చేస్తున్నారు.
‘తలసరి’ లెక్క ఇలా..
మద్యం తలసరి వినియోగం అంటే తలసరి ఆదాయం తరహాలోనే లెక్కిస్తారు. అంటే ఒక రాష్ట్రంలో ఒక సంవత్సరంలో అమ్ముడైన మొత్తం మద్యాన్ని ఆ రాష్ట్ర జనాభాతో భాగించి.. తలసరి వినియోగం అంచనాలు రూపొందిస్తారు. ఇందులో రోజూ తాగేవారు, అప్పుడప్పుడు తాగేవారు, చాలా అరుదుగా తాగేవారు, అసలు తాగని వారు కూడా ఉంటారు.
ఆల్కహాల్ మాత్రమే పరిగణనలోకి..
తలసరి మద్యం వినియోగంలో ఆల్కహాల్‌ను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. అంటే ఒక లిక్కర్ బాటిల్‌లో 42 శాతం, బీరు బాటిల్‌లో 8 శాతం లేదా 5 శాతమే ఆల్కహాల్ ఉంటుంది. నీటితో కలిపి ఆ ఆల్కహాల్‌ను బ్లెండ్ చేస్తారు. అందువల్ల తలసరి మద్యం వినియోగంలో మొత్తం సీసాలో ఉన్న లిక్కర్‌ను పరిగణనలోకి తీసుకోలేదు. అందులోని ఆల్కహాల్ శాతాన్ని మాత్రమే తీసుకుని, తలసరి వినియోగం లెక్కగట్టారు. ఒక కేసు లిక్కర్ అంటే 8.64 లీటర్లు ఉంటుంది. అందులో ఆల్కహాల్ 3.74 లీటర్లు మాత్రమే. అలాగే కేసు బీరులో కేవలం 0.59 లీటర్ల ఆల్కహాల్ ఉంటుంది. మన రాష్ట్ర జనాభా 5 కోట్లు ఉంటే.. అందులో మద్యం తాగేవారు సుమారు 50 లక్షలు ఉండొచ్చని అంచనా. అందులోనూ రోజూ తాగేవారు చాలా తక్కువ. పండగకు, ఫంక్షన్‌కు, పార్టీల పేరుతో తాగేవారే ఎక్కువ మంది ఉన్నారు. మద్యం బాగా అలవాటైన వారు రోజూ తాగుతుంటారు. అలాంటివారు సగటున రోజుకు 3 క్వార్టర్ల వరకు తాగుతారని అంచనా. వారు ఎక్కువగా చీప్ లిక్కర్ లేదా మీడియం రకం బ్రాండ్లు తాగుతుంటారు. అందువల్ల వారు మద్యంపై చేసే ఖర్చు కూడా చాలా తక్కువ. పెద్ద ఐటీ కంపెనీలు, ఇతరత్రా పెద్ద కంపెనీలు ఉన్న నగరాల్లో మద్యం వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌కు అలాంటి నగరం ఒక్కటీ లేకపోవడం కూడా మద్యం వినియోగం పెరగకపోవడానికి ఒక కారణం.
రాష్ట్రంలో ఎక్కువగా లిక్కర్ వినియోగమే..
తెలంగాణ, కర్ణాటకల్లో బీర్ వినియోగం ఎక్కువ. ఏపీలో లిక్కర్ ఎక్కువ తాగుతారు. సాధారణంగా ఎక్కడైనా వేసవిలో బీర్ అమ్మకాలు, శీతాకాలంలో లిక్కర్ అమ్మకాలు ఎక్కువగా నమోదవుతాయి. కానీ ఏపీలో వేసవిలోనూ లిక్కరే ఎక్కువగా తాగుతుంటారు. బీర్‌లో తక్కువ ఆల్కాహాల్ శాతాన్ని ఇక్కడి ప్రజలు పెద్దగా ఇష్టపడరు. అలాగే సంక్రాంతి సమయంలో లిక్కర్ వినియోగం విపరీతంగా పెరుగుతుంది. కోడి పందేల కారణంగా సంక్రాంతి సమయంలో ఏపీలో మద్యం అమ్మకాలు భారీగా పెరుగుతాయి.