Prakash Raj: ప్రజలే రాజకీయం చేయాలి
ABN , Publish Date - Dec 28 , 2025 | 05:26 AM
దేశంలో ప్రజలు రాజకీయం చేసినప్పుడే పాలకులు సవ్యంగా ఉంటారని, కానీ మన దేశంలో నాయకులే రాజకీయాలు చేస్తున్నారని సినీనటుడు ప్రకాశ్‌రాజ్ వ్యాఖ్యానించారు.
అప్పుడే పాలకులు సవ్యంగా ఉంటారు
స్టీల్ ప్లాంటైనా, మెడికల్ కాలేజీలైనా.. ప్రైవేటీకరణ ఆగాలంటే పోరాటం తప్పదు
టికెట్ రేట్లు పెంచితే ఆ సినిమా చూడటం మానేయండి: సినీ నటుడు ప్రకాశ్‌రాజ్
విశాఖపట్నం/బీచ్‌రోడ్డు (విశాఖపట్నం), డిసెంబరు 27(ఆంధ్రజ్యోతి): దేశంలో ప్రజలు రాజకీయం చేసినప్పుడే పాలకులు సవ్యంగా ఉంటారని, కానీ మన దేశంలో నాయకులే రాజకీయాలు చేస్తున్నారని సినీనటుడు ప్రకాశ్‌రాజ్ వ్యాఖ్యానించారు. సీఐటీయూ అఖిల భారత మహాసభలు విశాఖలో నిర్వహిస్తున్న సందర్భంగా ఏర్పాటుచేసిన శ్రామిక ఉత్సవ్‌లో పాల్గొనడానికి ఆయన శనివారం ఇక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. కార్మికుల కోసం పోరాటం చేసేవారంటే తనకు ఇష్టమని చెప్పారు. అభ్యుదయ ఆలోచనలు, ఆందోళనలకు అండగా ఉంటానని, అందుకే సీఐటీయూ నాయకులు పిలవగానే విశాఖ వచ్చానని తెలిపారు. మావోయిస్టులను జనజీవన స్రవంతిలోకి తీసుకురావాల్సిన బాధ్యతను విస్మరించి వారిని చంపేయడం అన్యాయమని పేర్కొన్నారు. ఈ దేశంలో ప్రశ్నించే వారిపై పీడీ యాక్ట్ కేసులు పెడుతున్నారని, గౌరీ లంకేశ్‌ను చంపినవారిని బెయిల్ ఇచ్చి బయటకు వదులుతున్నారని వ్యాఖ్యానించారు. వందేళ్ల ఉత్సవం చేసుకుంటున్న ఆరెస్సె్‌సలో ఒక్క మహిళ కూడా లేరని, వారిలో ఒక్కరూ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొనలేదని ప్రకాశ్‌రాజ్ విమర్శించారు. విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణపై మాట్లాడుతూ, ‘అమ్మేవాడు, కొనేవాడు ఇద్దరూ మన కళ్ల ముందే ఉన్నారు. వ్యాపారం చేసుకుంటున్నారు.’ అని విమర్శించారు. ప్రభుత్వాలను నడిపేవారే అమ్ముడుపోతున్నారని ఆరోపించారు. దేశంలో విమానరంగం పదేళ్లుగా ఇద్దరి చేతుల్లోనే ఉందని, అందుకే సమస్యలు వస్తున్నాయని అన్నారు. స్టీల్ ప్లాంటు అయినా, మెడికల్ కాలేజీలు అయినా ప్రైవేటీకరణ కాకుండా ఆగాలంటే నిరంతర పోరాటం చేయక తప్పదని స్పష్టం చేశారు.
మహిళలపై శివాజీ వ్యాఖ్యలు తప్పే
మహిళలపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ముమ్మూటికీ తప్పేనని ప్రకాశ్ రాజ్ స్పష్టం చేశారు. ఆడవాళ్లకు ఆది నుంచి అన్యాయం చేస్తున్నది మగవారేనని, గిల్లితే గిల్లించుకోవడానికి అదేమీ ‘పోకిరి’ సినిమా కాదని అన్నారు. శివాజీ చెప్పిన క్షమాపణలు కూడా సంస్కారవంతంగా లేవని అభిప్రాయపడ్డారు. సినిమా టికెట్ల ధరలు ఇష్టానుసారం పెంచేయడంపై స్పందిస్తూ... అలాంటి సినిమాలు చూడటం మానేయాలని సూచించారు.
పోరాటాలతోనే కార్మిక హక్కుల సాధన
కమలం కిందున్న ఆరెస్సె్‌సను కూకటివేళ్లతో పెకలించాలి
సీఐటీయూ ‘శ్రామిక ఉత్సవ్’లో ప్రకాశ్‌రాజ్
పోరాటాలు చేస్తే తప్ప కార్మిక హక్కులు సాధించుకోలేమని సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాటుచేసిన ‘శ్రామిక ఉత్సవ్’లో ఆయన ప్రసంగించారు. భారతదేశం సరోవరం అయితే అందులో బయటకు కనిపించే కమలం బీజేపీ అని, ఆ పుష్పం కింద ఉన్న బలమైన వేళ్లు ఆరెస్సెఎస్ అని అభివర్ణించారు. దాన్ని కూకటివేళ్లతో పెకలించాల్సి ఉందన్నారు. దేశాన్ని కార్పొరేట్ సంస్థలే నడిపిస్తున్నాయని చెప్పారు. రాజకీయ పార్టీలు కార్పొరేట్ సంస్థలకు అమ్ముడుపోయాయని మండిపడ్డారు. శ్రమ దోపిడీపై మాట్లాడాలని, గొంతు విప్పాలని...అప్పుడే సమాజంలో మార్పు వస్తుందన్నారు. ‘చావు రాకముందే చావకూడదని నేను గొంతు విప్పుతున్నా. ఇది నా బాధ్యత’...అని చెప్పారు. దేశంలో ప్రశ్నించే వారి గొంతు నొక్కేయడం పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవికి ప్రకా్‌షరాజ్ జ్ఞాపికను అందజేశారు.