Andhra Pradesh Liquor Policy: మన మద్యమే తాగుతున్నారు
ABN , Publish Date - Dec 29 , 2025 | 03:24 AM
మన రాష్ట్ర ప్రజలు మన మందే తాగాలి’.. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఇదే కోరుకుంటుంది. ఎందుకంటే ప్రజలు ఇతర రాష్ర్టాల మందు తాగితే వారు కట్టే పన్నులు కూడా ఆయా రాష్ర్టాలకు వెళ్లిపోతాయి.
కూటమి ప్రభుత్వ చర్యలతో ఎన్‌డీపీఎల్‌కు స్వస్తి!
ఎన్టీఆర్ జిల్లాలో 93 శాతం తగ్గిన పొరుగు మద్యం
74శాతానికి చేరిన పాపులర్ బ్రాండ్ల అమ్మకాలు
ఎన్‌డీపీఎల్ నియంత్రణతో పెరిగిన ఆదాయం
గతంలో షాపుల్లో నాసిరకం జే బ్రాండ్ల విక్రయం
పొరుగు మద్యంతో వైసీపీ నేతలకు కాసుల పంట
ప్రస్తుతం అందుబాటులోకి 87 పాపులర్ బ్రాండ్లు
ధరలూ తగ్గడంతో ఏపీ మద్యానికే ప్రాధాన్యం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
‘మన రాష్ట్ర ప్రజలు మన మందే తాగాలి’.. ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా ఇదే కోరుకుంటుంది. ఎందుకంటే ప్రజలు ఇతర రాష్ర్టాల మందు తాగితే వారు కట్టే పన్నులు కూడా ఆయా రాష్ర్టాలకు వెళ్లిపోతాయి. గత వైసీపీ ప్రభుత్వం మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించింది. అప్పట్లో జే బ్రాండ్లు తాగలేక చాలామంది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ (ఇతర రాష్ర్టాల మద్యం) తాగారు. దానివల్ల ఏపీ ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం పక్క రాష్ర్టాలకు వెళ్లిపోయింది. ఆ విషయం తెలిసినా కమీషన్ల కోసం కక్కుర్తి పడిన గత ప్రభుత్వం జే బ్రాండ్లనే కొనసాగించి ఎన్‌డీపీఎల్ అక్రమాలను పెంచి పోషించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంతర్జాతీయ, జాతీయ స్థాయి పాపులర్ బ్రాండ్లను తిరిగి ప్రవేశపెట్టడంతో ఎన్‌డీపీఎల్‌కు చెక్ పడింది. ఓవైపు మంచి బ్రాండ్లు రావడం, మరోవైపు మద్యం ధరలు తగ్గడంతో ఇక్కడి మందుబాబులు ఏపీ మద్యానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.
నాసిరకం బ్రాండ్లతో ఎన్‌డీపీఎల్: వైసీపీ ప్రభుత్వం పక్కా వ్యూహంతో మద్యం వ్యాపారాన్ని భ్రష్టు పట్టించింది. అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలకే మద్యం షాపులను గుప్పిట్లోకి తీసుకుంది. మద్య నిషేధం పేరుతో కొత్త పాలసీ అని నమ్మబలికి ప్రభుత్వ షాపులు ఏర్పాటుచేసింది. వాటిలో కమీషన్లు ఇచ్చే నాసిరకం బ్రాండ్లు మాత్రమే విక్రయించేలా ప్రణాళిక అమలుచేసింది. ప్రజలు ఎప్పటినుంచో తాగుతున్న పాపులర్ బ్రాండ్లు షాపుల్లో కనిపించకుండా చేసింది. దీంతో వేరేదారి లేక చాలావరకూ జనం జే బ్రాండ్లనే తాగారు. కొందరు నాటుసారా, గంజాయి వైపు మళ్లారు. ఆ సమయంలో వైసీపీకే చెందిన కొందరు నాయకులు పక్క రాష్ర్టాల మద్యాన్ని ఇక్కడకు తీసుకొచ్చి జే బ్రాండ్లు తాగలేనివారికి ఎక్కువ రేట్లకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. దీంతో పలు జిల్లాల్లో తెలంగాణ, కర్ణాటక మద్యం ఏరులై పారింది. దీనివల్ల అటు ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం వస్తే... వైసీపీ నాయకులు మాత్రం భారీగా లాభపడ్డారు.
ప్రభుత్వం మారాక భారీ వ్యత్యాసం... 2023 అక్టోబరు నుంచి 2024 అక్టోబరు వరకు... కర్నూలు జిల్లాలో 34,565 లీటర్ల ఎన్‌డీపీఎల్ పట్టుబడింది. అదే 2024 అక్టోబరు నుంచి 2025 నవంబరు వరకు చూస్తే పట్టుబడిన ఎన్‌డీపీఎల్ 10,604 లీటర్లకు పడిపోయింది. అంటే 69శాతం తగ్గింది. అదే సమయానికి అనంతపురంలో 21,611 లీటర్ల నుంచి 10,426 లీటర్లు(52శాతం), ఎన్టీఆర్ జిల్లాలో 16,694 లీటర్ల నుంచి 1,122 లీటర్లు (93శాతం), కాకినాడలో 15,554 నుంచి 1,737 లీటర్లు (89శాతం), చిత్తూరులో 13,864 నుంచి 1,644 లీటర్లు (88శాతం), శ్రీసత్యసాయి జిల్లాలో 11,082 నుంచి 5,614 లీటర్లు (49శాతం) మేర ఎన్‌డీపీఎల్ తగ్గిపోయింది. దీంతో తెలంగాణ, కర్ణాటక రాష్ర్టాలతో సరిహద్దు ఎక్కువగా ఉన్న జిల్లాల్లో 40శాతానికి పైగా అమ్మకాలు పెరిగాయి. దీంతో రాష్ర్టానికి ఆదాయం పెరిగింది.
పెరిగిన పాపులర్ బ్రాండ్ల అమ్మకాలు
గత ప్రభుత్వంలో వైసీపీ పెద్దలకు కమీషన్లు ఇవ్వలేక పలు అంతర్జాతీయ, జాతీయ మద్యం బ్రాండ్లు ఏపీకి గుడ్‌బై చెప్పాయి. కొన్ని ఉన్నప్పటికీ అతితక్కువ మద్యం మాత్రమే అమ్మాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక 87 పాపులర్ బ్రాండ్లు తిరిగొచ్చాయి. వాటి అమ్మకాలు గత ప్రభుత్వంలో 20.7 శాతంగా ఉంటే, ఈ ప్రభుత్వంలో 74 శాతానికి పెరిగాయి. 50 బ్రాండ్ల ధరలను కూటమి ప్రభుత్వం తగ్గించింది. గత ప్రభుత్వం జే బ్రాండ్లపైనే దోపిడీ చేయగా, కూటమి ప్రభుత్వం అన్ని బ్రాండ్ల ధరలు తగ్గించింది.