ఎమ్మెల్యే ఇంటిని ముట్టడించిన ప్రజలు
ABN , Publish Date - Nov 28 , 2025 | 11:18 PM
కొత్త మండలాల ఏర్పాటు విషయంలో ఆదోని నియోజకవర్గంలో రగడ రాజుకుంది. పెద్దతుంబళం గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పది గ్రామాల ప్రజలు శుక్రవారం 200 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు.
ఆదోని, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): కొత్త మండలాల ఏర్పాటు విషయంలో ఆదోని నియోజకవర్గంలో రగడ రాజుకుంది. పెద్దతుంబళం గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ పది గ్రామాల ప్రజలు శుక్రవారం 200 బైకులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆదోనిలోని ఎమ్మెల్యే పార్థసారథి ఇంటిని ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో ఎమ్మెల్యే పార్థసారథి స్పందిస్తూ ప్రజాభిప్రాయ సేకరణకు ప్రభుత్వం 30 రోజుల సమయం ఇచ్చిందన్నారు. ఈలోగా సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఇదిలా ఉండగా తమ గ్రామాలను ఆదోని మండలంలోనే ఉంచాలని చాగి, నారాయణపురం, ఢణాపురం, నాగనాథనహళ్లి, బసాపురం గ్రామాలకు చెందిన వారు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. తమ గ్రామాలను ప్రతిపాదిత పెద్దహరివాణం మండలంలో చేర్చకుండా గతంలో మాదిరిగానే ఆదోని మండలంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. కొత్త మండల కేంద్రం పెద్దహరివాణానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరం ఉంటుందని, అదే ఆదోని అయితే ఆరు కిలోమీటర్లలోపే ఉంటుందన్నారు. తమ గ్రామానికి మండలంగా గుర్తించినందుకు పెద్దహరివాణం గ్రామ ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.