Pensioners Celebrate as GST Cuts: ఒకటో తేదీ పింఛనర్లకు పెద్ద పండుగ..!
ABN , Publish Date - Oct 02 , 2025 | 03:58 AM
ఒకటో తేదీ వచ్చిందంటే రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెద్ద పండుగేనని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు....
జీఎస్టీ తగ్గింపుతో రైతులకు భారీగా లబ్ధి: నిమ్మల
యలమంచిలిలో సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్ ర్యాలీ
యలమంచిలి, అక్టోబరు 1(ఆంధ్రజ్యోతి): ఒకటో తేదీ వచ్చిందంటే రాష్ట్రంలోని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు పెద్ద పండుగేనని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి గ్రామంలోని తాడిగరువుతోటలో బుధవారం జరిగిన పింఛను పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. వృద్ధురాలు సాధనాల సత్యవతి ఇంటికి వెళ్లి.. ఆమెకు పింఛను సొమ్ము అందించారు. ఆమె యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఆమె కట్టెల పొయ్యిపై వంట చేయడం చూసి... గ్యాస్ స్టవ్, సిలెండర్ కనెక్షన్ ఇస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... గత ప్రభుత్వంలో ఒక నెల తీసుకోకపోతే పెన్షన్ ఇచ్చేవారు కాదని, నేడు సీఎం చంద్రబాబు మూడు నెలల పింఛను ఒకేసారి తీసుకునే అవకాశం కల్పించారని చెప్పారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా పింఛన్ సొమ్మును రూ.4 వేలకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబుదేనని అన్నారు.
జీఎస్టీ తగ్గింపుతో రైతులకు లబ్ధి
యలమంచిలి గ్రామంలో రైతుల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సూపర్ జీఎస్టీ.. సూపర్ సేవింగ్స్’ ట్రాక్టర్ ర్యాలీలో మంత్రి నిమ్మల స్వయంగా ట్రాక్టర్ నడిపి రైతుల్లో ఉత్సాహం నింపారు. అనంతరం యలమంచిలి ప్రధాన కూడలి వద్ద ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అవగాహన శిబిరాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. జీఎస్టీ తగ్గింపుతో వ్యవసాయ రంగంలో యంత్రాల ధరలు గణనీయంగా తగ్గాయని, దీంతో రైతాంగానికి భారీగా లబ్ధి చేకూరుతుందని చెప్పారు. జీఎస్టీ తగ్గింపుతో ప్రతి పేద, మధ్యతరగతి కుటుంబానికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ రూ.15 వేలు ఆదా అవుతుందని అన్నారు.