MSME Sector: ప్రోత్సాహకాలు ఇంకెప్పుడు
ABN , Publish Date - Sep 03 , 2025 | 06:15 AM
పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు చెల్లించడంతో కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం బాటలోనే నడుస్తోంది. రాష్ట్రంలో పరిశ్రమలకు చెల్లించాల్సిన రూ. 5 వేల కోట్లకు పైగా ప్రోత్సాహకాల బకాయిలను మే 15వ తేదీ లోపు విడుదల చేస్తాం.
పారిశ్రామికవేత్తలకు 5 వేల కోట్లకుపైగా బకాయిలు
వైసీపీ హయాం నుంచి పెండింగ్‌లోనే
నాలుగేళ్లు బకాయిపెట్టిన జగన్ సర్కార్
ఆదుకుంటామని కూటమి ప్రభుత్వం హామీ
మే 15లోపే నిధులు ఇస్తామన్న మంత్రులు
ఇప్పటి వరకు పైసా విదల్చని వైనం
కొవిడ్ నుంచి ట్రంప్ సుంకాల వరకు పారిశ్రామికవేత్తలకు దెబ్బపై దెబ్బ
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకాలు చెల్లించడంతో కూటమి ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం బాటలోనే నడుస్తోంది. ‘‘రాష్ట్రంలో పరిశ్రమలకు చెల్లించాల్సిన రూ. 5 వేల కోట్లకు పైగా ప్రోత్సాహకాల బకాయిలను మే 15వ తేదీ లోపు విడుదల చేస్తాం. ఇక మీదట క్రమం తప్పకుండా ప్రోత్సాహకాలు విడుదల చేసేలా దేశంలోనే తొలిసారిగా ఎస్ర్కో మెకానిజం (ప్రత్యేక ఖాతా)ను అందుబాటులోకి తీసుకువస్తాం’’ అని ఆరు నెలల క్రితం విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో పారిశ్రామిక పాలసీల మార్గదర్శకాలు విడుదల చేసిన సందర్భంగా రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్, ఎంఎ్‌సఎంఈ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పారిశ్రామికవేత్తలకు భరోసా ఇచ్చారు. కానీ, ఇంతవరకు ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. గత వైసీపీ ప్రభుత్వం కూడా పరిశ్రమలకు ఏటా ఆగస్టులో పారిశ్రామిక ప్రోత్సాహకాలను విడుదల చేస్తామంటూ క్యాలెండర్లను కూడా ప్రకటించింది. 2020-21 సంవత్సరంలో మాత్రమే రెండు విడతలుగా సుమారు రూ. 800 కోట్లు విడుదల చేసింది. ఆ తర్వాత నుంచి పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇవ్వకుండా చివరికి చేతులెత్తేసింది. ఆ నాలుగేళ్లలోనే రూ. 5 వేల కోట్లకు పైగా ప్రోత్సాహకాలు బకాయిలుగా పేరుకుపోయాయి. పెండింగ్ బకాయిలను విడుదల చేసి సంక్షోభంలో కూరుకుపోయిన పరిశ్రమలకు కొత్త ఊపిరి పోస్తామన్న కూటమి ప్రభుత్వం కూడా ఏడాది కాలంగా పట్టించుకోవడంలేదు. దీంతో తీవ్ర నష్టాలతో రాష్ట్రంలో తమ యూనిట్లను నడపలేమంటూ పారిశ్రామికవేత్తలు చేతులెత్తేస్తున్నారు. పెండింగ్‌లో ఉన్న ఇన్సెంటివ్స్ బకాయిలను విడుదల చేస్తే పరిశ్రమలు తిరిగి నిలదొక్కుకోవడానికి అవకాశముంటుందని పారిశ్రామికవేత్తలు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.
దళితులకు జగనన్న దగా
దళిత పారిశ్రామికవేత్తలను జగన్ ప్రభుత్వం దగా చేసింది. 2020-23లో ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానంలో భాగంగా ‘జగనన్న బడుగు వికాసం’ పథకం కింద రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు 45 శాతం రాయితీలు అందిస్తామని నాటి ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చారు. దళితుల ఎంఎస్ఎంఈ యూనిట్లకు విద్యుత్తు చార్జీల రీయింబర్స్‌మెంట్, అమ్మకం పన్ను, మూలధన రాయితీ తదితర ప్రయోజనాలు కల్పిస్తామంటూ ప్రకటించారు. ఆయన మాటలు నమ్మి రాష్ట్రంలోని వేలాదిమంది ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు బ్యాంకుల నుంచి, ప్రైవేటుగా అప్పులు చేసి వ్యాపారాలు ప్రారంభించారు. మొత్తంగా రాష్ట్రంలో ఎస్సీ పారిశ్రామికవేత్తలు 7,675 యూనిట్లు, ఎస్టీ పారిశ్రామికవేత్తలు మరో 1,320 యూనిట్లు నిర్వహిస్తున్నారు. వీరికి దాదాపు రూ. 1,200 కోట్ల వరకు ప్రోత్సాహకాలు పెండింగ్‌లో పెట్టేశారు. అప్పులు, వాటికి వడ్డీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని, తమ యూనిట్లు ఎన్‌పీఏలోకి వెళ్లిపోతున్నాయని, రవాణా వాహనాలు సీజ్ అయిపోతున్నాయని, తమకు రావాల్సిన రాయితీల నిధులను విడుదల చేసి ఆదుకోవాలంటూ దళిత పారిశ్రామికవేత్తలు ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు. గత ఏడాదిగా అదిగో ఇదిగో అంటూ కూటమి ప్రభుత్వం కాలయాపన చేస్తుండటంతో దళిత పారిశ్రామికవేత్తలు రోడ్లపై ఆందోళనలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల జేఏసీ ఆధ్వర్యంలో ఇటీవలే మంగళగిరిలోని ఏపీఐఐసీ భవన్ ముందు ఆందోళనకు దిగారు. సెప్టెంబరులో ఇన్సెంటివ్స్ విడుదలయ్యే అవకాశం అధికారుల చెప్పడంతో వారు ఆందోళన విరమించారు.
ఎంఎస్ఎంఈలను ముంచిన జగన్ సర్కారు
రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రాష్ట్రం నుంచి పలు పెద్ద పరిశ్రమలను వెళ్లగొట్టిన జగన్ ప్రభుత్వం.. కొవిడ్ దెబ్బతో తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన చిన్నపరిశ్రమలను కూడా నిండా ముంచేసింది. ఎంఎ్‌సఎంఈలకు ఇన్సెంటివ్స్ ఇవ్వకుండా బకాయిలు పెట్టింది. కొవిడ్‌తో కుదేలైపోయిన చిన్న పరిశ్రమలు తిరిగి నిలదొక్కుకునేందుకు ‘రీస్టార్ట్’ ప్యాకేజీని అమలు చేస్తామని చెప్పిన వైసీపీ సర్కారు.. అది కూడా చేయకుండా చేతులెత్తేసింది. దాంతో రాష్ట్రవ్యాప్తంగా కొన్ని వేల ఎంఎ్‌సఎంఈ యూనిట్లు మూతబడ్డాయి. ఇటీవల ముడిసరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోవడం, లేబర్ చార్జీలు, విద్యుత్తు చార్జీల భారాలను భరించలేక చిన్న పరిశ్రమలు ఇప్పటికీ మూతబడుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో దాదాపు 25 లక్షల ఎంఎ్‌సఎంఈ పరిశ్రమలున్నాయి. ఇవి రాష్ట్రంలో దాదాపు 70 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. వివిధ రంగాల్లో 40 శాతానికి పైగా పారిశ్రామిక ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నాయి. తాజాగా అమెరికా 50 శాతం సుంకాలు విధించడంతో రాష్ట్రం నుంచి ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ముఖ్యంగా ఫుడ్ ప్రాసెసింగ్, స్పిన్నింగ్, టెక్స్‌టైల్స్, ఆక్వా తదితర పరిశ్రమలు మరింత సంక్షోభంలో పడ్డాయని పారిశ్రామికవేత్తలు గగ్గోలు పెడుతున్నారు. కొవిడ్ కాలం నుంచి దెబ్బ మీద దెబ్బ పడుతున్న ఎంఎస్ఎంఈలను ఆదుకునేందుకు పరిశ్రమలకు చెల్లించాల్సిన రూ. 5 వేల కోట్ల పెండింగ్ పోత్సాహకాల నిధులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఏపీ చాంబర్స్ ప్రతినిధి బృందం ప్రభుత్వ పెద్దలను కలిసి వినతిపత్రాలు సమర్పించింది. ఉత్పత్తి వ్యయం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో పరిశ్రమల నిర్వహణ కష్టతరంగా మారిందని, ప్రభుత్వం వెంటనే పెండింగ్ ప్రోత్సాహకాలను విడుదల చేయాలని ఏపీ చాంబర్స్ అభ్యర్థించింది.