Share News

Anantapur District; ప్రాణం తీసిన పెన్సిల్‌

ABN , Publish Date - Aug 06 , 2025 | 03:50 AM

పెన్సిల్‌ కోసం ఇద్దరు చిన్నారులు బడిలో గొడవపడ్డారు. అది ఇళ్ల వరకూ వెళ్లి.. తల్లిదండ్రులు ఘర్షణ పడ్డారు. ఈ గొడవలో తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థి తండ్రి ప్రాణాలు కోల్పోయాడు.

Anantapur District; ప్రాణం తీసిన పెన్సిల్‌

  • ఇద్దరు చిన్నారుల మధ్య బడిలో గొడవ

  • ఓ విద్యార్థి తల్లిదండ్రులపై మరొకరి దాడి

  • తీవ్ర గాయాలతో విద్యార్థి తండ్రి మృతి

  • అనంతపురం జిల్లాలో విషాద ఘటన

శెట్టూరు, ఆగస్టు 5(ఆంధ్రజ్యోతి): పెన్సిల్‌ కోసం ఇద్దరు చిన్నారులు బడిలో గొడవపడ్డారు. అది ఇళ్ల వరకూ వెళ్లి.. తల్లిదండ్రులు ఘర్షణ పడ్డారు. ఈ గొడవలో తీవ్రంగా గాయపడిన ఓ విద్యార్థి తండ్రి ప్రాణాలు కోల్పోయాడు. అనంతపురం జిల్లా శెట్టూరు మండల కేంద్రంలో ఈ దారుణం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు, శెట్టూరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గగన్‌, క్రిష్‌ అనే ఇద్దరు విద్యార్థులు మూడో తరగతి చదువుతున్నారు. గగన్‌ పెన్సిల్‌ను సోమవారం మధ్యాహ్నం క్రిష్‌ విరిచేశాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. పాఠశాల విరామ సమయంలో ఒకరిపై ఒకరు మట్టి విసురుకున్నారు. బడి వదిలాక సాయంత్రం ఇంటికి వెళ్లి గొడవపడిన విషయాన్ని తెలియజేశారు. తమ కొడుకును కొట్టారని క్రిష్‌ తల్లిదండ్రులు మర్రియమ్మ, మర్రిస్వామి ఆగ్రహించారు. శెట్టూరు మండలం యర్రబోరేపల్లికి చెందిన తమ బంధువులకు సమాచారం ఇచ్చి పిలిపించుకున్నారు. వారు రాగానే గగన్‌ ఇంటి వద్దకు వెళ్లి.. తల్లిదండ్రులు ప్రకాశ్‌, ప్రమీలమ్మపై దాడి చేశారు. ప్రకాశ్‌(37)కు తీవ్ర గాయాలు కావడంతో అపస్మారక స్థితిలో పడిపోయాడు. కాలనీ వాసులు వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతి చెందాడు. ప్రకాశ్‌ దంపతులకు నలుగురు సంతానం. దాడికి పాల్పడిన యర్రబోరేపల్లికి చెందిన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ గొడవ శెట్టూరు పోలీస్‌స్టేషన్‌కు కూతవేటు దూరంలో జరిగింది. గొడవ జరుగుతోందని పోలీసులకు సమాచారం అందించినా స్పందించలేదని, అందుకే నిండు ప్రాణం బలైందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మృతుడి భార్య ప్రమీలమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు మంగళవారం కేసు నమోదు చేశారు. ఈ విషయమై శెట్టూరు ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాలాజీని వివరణ కోరగా, పాఠశాల ఆవరణలో విద్యార్థులు గొడవ పడలేదని, మరో చోట గొడవపడ్డారని తెలిపారు.

Updated Date - Aug 06 , 2025 | 03:52 AM