Share News

పెనమలూరు సర్పంచ్‌ లింగాల భాస్కరరావుపై3 నెలల సస్పెన్షన్‌ వేటు

ABN , Publish Date - May 21 , 2025 | 12:48 AM

పెనమలూరు గ్రామ పంచాయతీ సర్పంచ్‌ లింగాల భాస్కరరావును విధుల నుంచి జిల్లా యంత్రాంగం సస్పెండ్‌ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఇరిగేషన్‌ కెనాల్‌ కట్టమీద సిమెంట్‌ రోడ్డును నిర్మాణం చేసినందుకు ఇన్‌చార్జి కలెక్టర్‌ గీతాంజలి శర్మ సర్పంచ్‌పై వేటు వేశారు.

పెనమలూరు సర్పంచ్‌ లింగాల భాస్కరరావుపై3 నెలల సస్పెన్షన్‌ వేటు

-ఆదేశాలు జారీ చేసిన ఇన్‌చార్జి కలెక్టర్‌ గీతాంజలి శర్మ

-3 నెలల పాటు సస్పెండ్‌, చెక్‌ పవర్‌ రద్దు

-ఉప సర్పంచ్‌ శీలం సుమతికి సర్పంచ్‌ విధులు, చెక్‌ పవర్‌ అప్పగింత

-నిబంధనలకు విరుద్ధంగా రూ.55.25 లక్షలతో ఇరిగేషన్‌ కాలువ కట్టపై సిమెంట్‌ రోడ్డు

-రూ.63.42 లక్షల పంచాయతీ నిధుల దుర్వినియోగం ఆరోపణలపై విచారణ

- దోషిగా తేలడంతో సర్పంచ్‌ పదవి నుంచి తొలగింపు

ఆంధ్రజ్యోతి, విజయవాడ: పెనమలూరు గ్రామ పంచాయతీ సర్పంచ్‌ లింగాల భాస్కరరావును విధుల నుంచి జిల్లా యంత్రాంగం సస్పెండ్‌ చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఇరిగేషన్‌ కెనాల్‌ కట్టమీద సిమెంట్‌ రోడ్డును నిర్మాణం చేసినందుకు ఇన్‌చార్జి కలెక్టర్‌ గీతాంజలి శర్మ సర్పంచ్‌పై వేటు వేశారు. ఇరిగేషన్‌ కెనాల్‌ కట్టపై నిబంధనలకు విరుద్ధంగా రూ.55,25,112 మేర బిల్లు చెల్లింపులు, పెనమలూరు గ్రామ పంచాయతీ నిధులు రూ.63,42,912 నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు చేయడంపై ఈ చర్యలు తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే.. పెనమలూరు మండలం పెనమలూరు గ్రామపంచాయితీ పరిధిలోని పల్లెపేటలో ఇరిగేషన్‌ కెనాల్‌ కట్టపై గ్రామ పంచాయతీ సీసీ రోడ్డు పనులు చేపట్టింది. అయితే ఇరిగేషన్‌ అధికారుల నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. నిబంధనలకు విరుద్ధంగా సిమెంట్‌ రోడ్డు పనులు చేపట్టారు. మొత్తం రోడ్డు పనులను 12 భాగాలుగా విభజించి 14వ ఆర్థిక సంఘం నిధుల ద్వారా చేపట్టే విధంగా సర్పంచ్‌ ప్రతిపాదించారు. ఈ రోడ్డు నిర్మాణం పూర్తి చేసిన తర్వాత 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.27,47,898, గ్రామ పంచాయితీ సాధారణ నిధులు రూ.27,77,214 వెరసి మొత్తం రూ.55,25,112 లను నిబంధనలకు విరుద్ధంగా చెల్లింపు జరిపారు. ఈ వ్యవహారంపై వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది. నిబంధనలకు విరుద్ధంగా పనులు చేపట్టడంతో పాటు నిధులు చెల్లించారని గుడివాడ డివిజనల్‌ పంచాయతీ అధికారి నివేదిక ఇచ్చారు. ఈ నివేదిక ఆధారంగా గ్రామ సర్పంచ్‌కి జిల్లా యంత్రాంగం షోకాజ్‌ నోటీస్‌ను జారీచేసింది. మార్చి 17వ తేదీన కలెక్టర్‌ సమక్షంలో విచారణ జరిగింది. ఈ విచారణలో నిజాలు నిగ్గుతేలాయి. గ్రామ సర్పంచ్‌ లింగాల భాస్కరరావుతో పాటు మాజీ కార్యదర్శి ఏ.వి.సుబ్బారావు కూడా దీనికి బాధ్యులని, వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించడం జరిగింది. ఏపీ పంచాయతీ రాజ్‌ చట్టం-1994 సెక్షన్‌ 249(6) అనుసరించి సర్పంచ్‌ని విధుల నుంచి మూడు నెలల పాటు సస్పెండ్‌ చేశారు. ఈ మూడు నెలల కాలానికి ఉప సర్పంచ్‌గా వ్యవహరిస్తున్న 13వ వార్డు నెంబర్‌ శీలం సుమతిని సర్పంచ్‌ విధుల నిర్వహించాల్సిందిగా ఆదేశించారు. సర్పంచ్‌ లింగాల భాస్కరరావు చెక్‌పవర్‌ను కూడా రద్దు చేసి ఉపసర్పంచ్‌కు ఆ అధికారాన్ని కల్పించారు.

Updated Date - May 21 , 2025 | 12:48 AM