Pemmasani Chandrasekhar: జగన్.. ప్రతిసారీ ప్రజలను మోసం చేయలేవు
ABN , Publish Date - Sep 14 , 2025 | 04:00 AM
జగన్... ప్రజలను ఎప్పుడో ఒకసారి మోసం చేయొచ్చు. ప్రతిసారీ మోసం చేయలేరు అని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు...
వైసీపీ హయాంలో ఎయిమ్స్‌కు మంచినీళ్లు, విద్యుత్ కూడా ఇవ్వలేదు
చంద్రబాబు మూడు నెలల్లో సమకూర్చారు
వైద్య కళాశాలలు అంటే గోడలు కాదు:పెమ్మసాని
గుంటూరు, సెప్టెంబరు 13(ఆంధ్రజ్యోతి): ‘జగన్... ప్రజలను ఎప్పుడో ఒకసారి మోసం చేయొచ్చు. ప్రతిసారీ మోసం చేయలేరు’ అని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. వైద్యుడు కూడా అయిన ఆయన శనివారం గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ... వైద్య కళాశాలలపై వైసీపీ చేస్తున్న విష ప్రచారంపై మండిపడ్డారు. ‘గుంటూరు జిల్లా ప్రజలు బాగా తెలివిగల వారు. ఎవరికి అధికారం ఇవ్వాలో వాళ్లకు బాగా తెలుసు. మంగళగిరిలో ఎయిమ్స్‌ని టీడీపీ ప్రభుత్వం అత్యంత సుందరంగా, అద్భుతంగా తీసుకొచ్చి పూర్తి చేసింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరి ఎయిమ్స్‌కు కనీసం నీళ్లు, విద్యుత్ కూడా ఇవ్వలేదు. అప్రోచ్ రోడ్లు కూడా నిర్మించలేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం చంద్రబాబు మొదటి మూడు నెలల్లో నీళ్లు ఇచ్చారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి విద్యుత్ ఇచ్చారు. రోడ్లు కూడా నిర్మించారు. కూటమి అధికారంలోకి వచ్చేసరికి జీజీహెచ్‌లో లిఫ్టులు, సీటీ స్కాన్‌లు పని చేయడం లేదు. టెస్టులు బయటకు రాస్తున్నారు. ఇలా ఉన్న కళాశాలలు, ఆస్పత్రులను పట్టించుకోని మాజీ సీఎం జగన్... 17 మెడికల్ కళాశాలలు కట్టించాడంటే నమ్మే స్థితిలో ప్రజలు లేరు. ఎన్నికలకు ముందు శంకుస్థాపనలు చేయడం, మభ్య పెట్టడం జగన్‌కు పరిపాటే. మెడికల్ కళాశాలలు అంటే నాలుగు గోడలు కట్టి వదిలేయడం కాదు. ఒక్కో కాలేజీ నిర్మించాలంటే కనీసం రూ.500 కోట్లు కావాలి. వాటికి జగన్ ప్రభుత్వంలో ఎంత నిధులు కేటాయించారో చెప్పాలి. జగన్‌కు చేతనైతే మెడికల్ కళాశాలల టెండర్లు పాడుకొని అభివృద్ధి చేయాలి. దీర్ఘకాలంగా మెడికల్ కళాశాలల నిర్వహణ జరగాలన్న ఉద్దేశంతోనే సీఎం చంద్రబాబు పీపీపీ విధానంలో అభివృద్ధి చేయబోతున్నారు. త్వరలో అన్ని వివరాలతో నేను మాట్లాడతా’ అని పెమ్మసాని అన్నారు.