Share News

Land Encroachment: అడవి తల్లికి పెద్దిరెడ్డి పోటు

ABN , Publish Date - Nov 14 , 2025 | 04:54 AM

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జాల దందా బయటపడింది. అటవీ భూములను కూడా ఆయన ఆక్రమించినట్లు స్పష్టమైంది.

Land Encroachment: అడవి తల్లికి పెద్దిరెడ్డి పోటు

  • మంగళంపేట రిజర్వ్‌ ఫారెస్ట్‌లో 32.63 ఎకరాలు దురాక్రమణ

  • ఉమ్మడి సర్వే బృందం నిర్ధారణ

  • స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ

  • అటవీ చట్ట ఉల్లంఘనపై నలుగురిపై కేసు..చార్జిషీట్‌

  • కోర్టు ఆదేశాలతో తదుపరి చర్యలు: పీసీసీఎఫ్‌

  • డిప్యూటీ సీఎం ఆదేశాలతో అటవీ భూముల వివరాలన్నీ వెబ్‌సైట్‌లో చేరుస్తామని వెల్లడి

అమరావతి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కబ్జాల దందా బయటపడింది. అటవీ భూములను కూడా ఆయన ఆక్రమించినట్లు స్పష్టమైంది. దానిని అటవీ శాఖ ఇప్పటికే నిర్ధారించింది. చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట రిజర్వ్‌ ఫారె్‌స్టలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు 32.63 ఎకరాల భూమిని ఆక్రమించినట్లు తేల్చింది. దీనిపై కేసు వేయడం, చార్జిషీట్‌ దాఖలు చేయడం, ఆక్రమిత భూములను స్వాధీనం చేసుకోవడం జరిగాయి. వాటిల్లో చెట్ల పెంపకం కూడా చేపట్టారు. సర్వే నంబర్లు 295/1బీ, సీ, డీ, ఈ, 296/1ఏ, 1బీల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పేరుతో 15 ఎకరాలు, పెద్దిరెడ్డి ఇందిరమ్మ (భర్త భాస్కరరెడ్డి) పేరుతో 20.8 ఎకరాలు, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి పేరుతో 21 ఎకరాలు, పెద్దిరెడ్డి ద్వారకానాథ్‌రెడ్డి పేరుతో 18.94 ఎకరాలు, డమ్మీ పట్టాతో 1.80 ఎకరాలు ఉంది. అడవికి చెందిన 32.63 ఎకరాల భూమిని ఆక్రమించేశారు. పెద్దిరెడ్డి కుటుంబసభ్యులు అటవీ భూములను ఆక్రమించినట్లు తీవ్ర ఆరోపణలు రావడంతో ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 29న చిత్తూరు కలెక్టర్‌, ఎస్పీ, అనంతపురం జిల్లా ఫారెస్ట్‌ కన్జర్వేటర్‌తో త్రిసభ్య కమిటీని నియమించింది. రెవెన్యూ, అటవీ, సర్వే, ల్యాండ్‌ రికార్డుల శాఖల అధికారులు జనవరి 31, ఫిబ్రవరి 7, 10 తేదీల్లో పట్టాదారులకు ముందస్తు నోటీసులు జారీచేసి, సంబంధిత భూములపై ఉమ్మడి సర్వే నిర్వహించాయి. పట్టాదారుల అధీనంలో ఉన్న భూమి మంగళంపేట రిజర్వ్‌ ఫారెస్ట్‌ గెజిట్‌లో సూచించిన సరిహద్దు లోపలికి వచ్చినట్లు అధికారులు గుర్తించారు. అటవీ ప్రాంతంలో బోర్‌వెల్‌ వేయడం, వ్యవసాయ భూమికి నీటి సరఫరా అటవీ వనరుల అనధికార వినియోగం కిందకు వస్తాయని తేల్చారు.


రూ.1.26 కోట్ల మేర నష్టం చేశారు..

అటవీ భూముల ఆక్రమణలు తొలగించాలని మార్చి 3న పట్టాదారులకు నోటీసులు ఇవ్వాలని, బోర్‌వెల్‌ తొలగింపునకు చర్యలు తీసుకోవాలని కమిటీ సూచించింది. ప్రభుత్వం మార్చి 11న పట్టాదారులకు నోటీసులు ఇచ్చింది. అక్రమణలను ఎందుకు తొలగించకూడదో 15 రోజుల్లో తెలపాలని పేర్కొంది. ఆక్రమిత 32.63 ఎకరాల భూమిలో రూ.1.26 కోట్ల మేర నష్టం చేసినట్లు అటవీ, రెవెన్యూ అధికారులు ఏప్రిల్‌ 30న తనిఖీల్లో తేల్చారు. అటవీ చట్టాలను ఉల్లంఘించినందుకు నలుగురు నిందితులపై మే 4న చిత్తూరు తూర్పు ఫారెస్ట్‌ రేంజ్‌లో అటవీ చట్టంతో పాటు పలు ఇతర సెక్షన్ల కేసు నమోదైంది. అధికారులు మే 5న ఫ్లస్ట్‌ క్లాస్‌ మేజిస్ర్టేట్‌ కోర్టుకు ప్రాథమిక నేర నివేదికను సమర్పించారు. మే 28న ఆక్రమిత భూమిని స్వాధీనం చేసుకున్నారు. మే 29న ఆక్రమణదారులకు నోటీసులిచ్చారు. తహసీల్దారు నుంచి భూముల పత్రాలను తీసుకొని, ప్రతి వ్యక్తి భూమి వివరాలను జూన్‌ 16న అటవీ అధికారులు పరిశీలించారు. అక్రమిత భూమిలోని 560 చెట్లను జప్తు చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం దర్యాప్తు కోసం పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ అక్టోబరు 4న కోర్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేశారు.


ఆక్రమిత భూమి స్వాధీనం: పీసీసీఎఫ్‌

మంగళంపేట రిజర్వ్‌ ఫారెస్ట్‌లోని భూముల ఆక్రమణ వాస్తవమని విచారణలో తేలిందని ప్రిన్సిపల్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ (పీసీసీఎఫ్‌) పీవీ చలపతిరావు గురువారం మంగళగిరిలోని అరణ్యభవన్‌లో మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో ఏ1గా పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, ఏ2గా రామచంద్రారెడ్డి, ఏ3గా ద్వారకానాథ్‌రెడ్డి, ఏ4గా ఇందిరమ్మ ఉన్నారని చెప్పారు. ఆక్రమణదారుల నుంచి 32.63 ఎకరాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అటవీ చట్టం ప్రకారం ప్రాథమిక నేర నివేదిక మేరకు కోర్టులో కేసు వేసి, చార్జీషీటు దాఖలు చేశామని పేర్కొన్నారు. మంగళంపేట అటవీ ప్రాంతంలో 75.74 ఎకరాలకు పట్టాలుండగా, 32.63 ఎకరాల అటవీ భూమిని కూడా ఆక్రమణదారులు కలుపుకుని, కంచె వేశారన్నారు. ఉద్యాన పంటలు వేసి ఆదాయం పొందారని, చట్ట విరుద్ధంగా బోరు వేసి అటవీ వనరుల్ని దుర్వినియోగం చేశారని, అక్రమంగా రోడ్డు కూడా నిర్మించారని చెప్పారు. రూ.1.26 కోట్ల విలువైన అటవీ సంపదకు నష్టం చేశారని వివరించారు. 32.63 ఎకరాలకు ఆక్రమణదారులు చట్టబద్ధమైన పత్రాలు సమర్పించలేకపోయారని తెలిపారు. కోర్టులో కేసు నడుస్తున్నందున కోర్టు ఆదేశాలతో తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ ఆదేశాలతో అటవీ భూముల వివరాలన్నీ ఫారెస్ట్‌ వెబ్‌సైట్‌లో చేర్చుతామని చెప్పారు. ఇటీవల మంగళంపేట రిజర్వ్‌ ఫారెస్ట్‌ భూములపై పవన్‌ ఏరియల్‌ సర్వే చేపట్టగా.. ఆయన కార్యాలయం గురువారం సంబంధిత వీడియోను ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. ఆక్రమణలపై ఆయన ఆదేశాల నేపథ్యంలో పీసీసీఎఫ్‌ వివరాలు వెల్లడించారు.

Updated Date - Nov 14 , 2025 | 04:57 AM