Pedapurum Attack: భూవివాదంలో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు
ABN , Publish Date - Apr 28 , 2025 | 04:38 AM
పెద్దాపురంలో వైసీపీ కార్యకర్తల కత్తులతో దాడి చేసిన ఘటనలో టీడీపీ కార్యకర్త జార్జి చక్రవర్తి గాయపడ్డారు. భూవివాదం కారణంగా జరిగిన ఈ దాడి పై పోలీసు దర్యాప్తు మొదలైంది.
పెద్దాపురంలో టీడీపీ కార్యకర్తపై కత్తులతో దాడి
జార్జి పరిస్థితి విషమం కాకినాడ జీజీహెచ్‌కు తరలింపు
పెద్దాపురం, ఏప్రిల్ 27(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా పెద్దాపురంలో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. టీడీపీ కార్యకర్తకు చెందిన 2.54 ఎకరాల భూమిని నకిలీ పత్రాలు సృష్టించి కొట్టేసేందుకు స్కెచ్ వేశారు. పెద్దాపురానికి చెందిన తొగు జార్జ్ చక్రవర్తి 2010లో పాత పెద్దాపురంలో సర్వే నంబరు 234/2లోని 2.54 ఎకరాల భూమిని కట్టమూరుకు చెందిన విశ్వేశ్వరరావు వద్ద కొనుగోలుచేసి వరి సాగు చేస్తున్నారు. అయితే ఆ భూమి తమదంటూ ఓ మహిళతో కొందరు వైసీపీ కార్యకర్తలు కోర్టులో కేసు వేయించారు. కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ జార్జ్ సాగు చేసుకుంటున్నారు. శనివారం రాత్రి తన పొలంలో వరి కోత మిషన్‌తో పనులు చేయిస్తుండగా పెద్దాపురం వైసీపీ కార్యకర్తలు విన్నా విజయచక్రవర్తి, ఎ.వీర్రాఘవరావు, పెదిరెడ్ల నాని, ఐతి మేరి, కొత్తపల్లి సాయికుమార్, మరికొందరు ఆయనపై కత్తులతో దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన జార్జిని అక్కడ పనిచేస్తున్నవారు హుటాహుటిన పెద్దాపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అయితే పరిస్థితి విషమించడంతో కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. ఈ ఘటనపై మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దాపురం డీఎస్పీ శ్రీహరి రాజుతో ఫోన్లో మాట్లాడారు. జార్జ్‌పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆయనపై దాడిచేసిన వైసీపీ కార్యకర్తలపై గతంలోనూ దౌర్జన్యాలు, కొట్లాట కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు.