Share News

Accused Satish: గులకరాయి నిందితుడు అదృశ్యం

ABN , Publish Date - Jul 27 , 2025 | 05:45 AM

జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు, ఆయపై గులకరాయితో జరిగిన దాడి కేసులో నిందితుడిగా ఉన్న విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌ వడ్డెర కాలనీకి చెందిన వేముల సతీష్‌ అదృశ్యమయ్యాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Accused Satish: గులకరాయి నిందితుడు అదృశ్యం

  • వారం రోజులుగా కనిపించని సతీష్‌.. కేసు నమోదు

  • ప్రేమ వ్యవహారమే కారణం?

విజయవాడ, జూలై 26(ఆంధ్రజ్యోతి): జగన్‌ సీఎంగా ఉన్నప్పుడు, ఆయపై గులకరాయితో జరిగిన దాడి కేసులో నిందితుడిగా ఉన్న విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌ వడ్డెర కాలనీకి చెందిన వేముల సతీష్‌ అదృశ్యమయ్యాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత ఏడాది ఏప్రిల్‌లో ఎన్నికల ప్రచారం చేస్తుండగా జగన్‌కు, పక్కనే ఉన్న అప్పటి సెంట్రల్‌ నియోజకవర్గ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాసరావుకు ఓ చిన్న రాయి తగిలింది. ఈ కేసులో వేముల సతీష్‌ను ఏ2గా నిర్ధారించి పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపారు. కొద్దిరోజుల క్రితం వరకు ఇంటి వద్ద ఉన్న సతీష్‌ వారం రోజులుగా కనిపించడం లేదు. ఓ బాలికతో ఉన్న ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు చెబుతున్నారు. సతీష్‌ స్థానికంగా ఓ బాలికను ప్రేమించాడు. తల్లిదండ్రులు లేని బాలిక మేనత్త వద్ద ఉంటోంది. సతీష్‌ ప్రేమ వ్యవహారం తెలిసిన బాలిక మేనత్త, ఈ నెల 20వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు సతీష్‌ను, అతడి కుటుంబ సభ్యులను స్టేషన్‌కు పిలిపించారు. దీంతో అతడి ప్రేమ విషయం ఇంట్లో తెలిసిపోయింది. పోలీసులు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు. దీనిపై కుటుంబ సభ్యులు సతీష్‌ను మందలించారు. అప్పటి నుంచి అతడు కనిపించడం లేదు. ఇంట్లోనే ఫోన్‌ వదిలిపెట్టి వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అజిత్‌సింగ్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఖమ్మంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లాడేమోనని అక్కడ గాలించినా సతీష్‌ ఆచూకీ లభించలేదు. పోలీసులు అతడి కోసం పది మంది సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. సతీష్‌ అదృశ్యమైన విషయం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది.

Updated Date - Jul 27 , 2025 | 05:45 AM