ఆర్‌యూ రుణం తీర్చుకోండి
ABN , Publish Date - Nov 13 , 2025 | 12:09 AM
ఆదర్శంగా, ఉన్నతంగా తీర్చిదిద్దిన రాయలసీమ వర్సిటీతో పాటు సమాజానికి రుణం తీర్చుకోవాలని గవర్నర్, ఆర్ వర్సిటీ ఛాన్సలర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు.
ప్రతి విద్యార్థికి ఉన్నత విద్య కీలకం
కలను సాకారం చేసుకోండి
తల్లిదండ్రులు, గురువులను గౌరవించండి
గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్
రాయలసీమ వర్సిటీలో ఘనంగా నాలుగో స్నాతకోత్సవం
విద్యార్థులకు బంగారు పతకాలు, డాక్టరేట్ల ప్రదానం
కర్నూలు అర్బన, నవంబరు 12(ఆంధ్రజ్యోతి): ఆదర్శంగా, ఉన్నతంగా తీర్చిదిద్దిన రాయలసీమ వర్సిటీతో పాటు సమాజానికి రుణం తీర్చుకోవాలని గవర్నర్, ఆర్ వర్సిటీ ఛాన్సలర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పిలుపునిచ్చారు. దేశ ప్రగతి రథానికి విద్యార్థులు చోదకశక్తిగా మారాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన ఆకాంక్షించారు. బుధవారం రాయలసీమ యూనివర్సిటీలో 4వ స్నాతకోత్సవం(కాన్వకేషన)కు ఛాన్సలర్ హోదాలో హాజరు అయ్యారు. ఆయనతో పాటు ఉన్నత విద్యామండలి చైర్మన మధుమూర్తి, వైస్ ఛాన్సలర్ వి.వెంకట బసవరావు, రెక్టార్ ఎనటీకే నాయక్, రిజిసా్ట్రర్ బోయ విజయ్ కుమార్ నాయుడులు వేదికపైకి చేరుకున్నారు. కలెక్టర్ డాక్టర్ సిరి, ఎంపి బస్తిపాటి నాగరాజు, ఎస్పీ విక్రాంత పాటిల్, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అంతకుముందు యూనివర్సిటీ ప్రాంగణానికి చేరుకున్న గవర్నర్‌కు ఎనసీసీ, పోలీస్ బెటాలియన బృందాలు గౌరవవందనం సమర్పించాయి. అనంతరం డాక్టరేట్ అందుకోబోయే వారు గవర్నర్‌తో కలిసి విడివిడిగా ఫొటోలు తీయించుకున్నారు. అక్కడి నుంచి డాక్టరేట్ దుస్తుల్లో మేళ తాళాల నడుమ వేదిక వద్దకు చేరుకున్నారు. అనంతరం సభ వేదికలో గవర్నర్ విద్యార్థులను ఉద్ధేశించి మాట్లాడారు. ప్రతి విద్యార్థికి ఉన్నత విద్య కీలకం అన్నారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులతో పాటు గురువులను గౌరవించాలన్నారు. ఉన్నత విద్యలో మహిళలు రాణించడం ఎంతో అభినందనీయమన్నారు. రాబోయే కాన్వకేషనకు తాను తప్పకుండా వస్తానని, అప్పుడు విద్యార్థులు ఎలా చదువుతున్నారో చూస్తానన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పరిశ్రమలు, అవకాశాలను యువత కోసం తెచ్చి ఆర్థికంగా దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలపాలని తపన పడుతున్నాయన్నారు. ప్రభుత్వ ఉన్నత ఆశయాల్లో యువత కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. రాయలసీమ యూనివర్సీటికి ఎంతో ప్రతిష్టాత్మకమైన పేరు ఉందని, ఇక్కడి వనరులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దిన ఈ విద్యా సంస్థకు, సమాజానికి రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క విద్యార్థిపై ఉందన్నారు. ఇదిలా ఉండగా ఏఎం గ్రీన చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎస్‌ఎస్‌వి రామకుమార్‌కు యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను అందజేసింది. గవర్నర్ నుంచి డాక్టరేట్ అందుకున్న ఆయన మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక రంగాలతో పాటు విద్యుత రంగంలో తాను చేస్తున్న కృషికి గుర్తింపుగా తనను గౌరవించిన రాయలసీమ వర్సిటీకి రుణపడి ఉంటానన్నారు.
వర్సిటీలో మెరుగైన వసతులు
- వైస్ ఛాన్సలర్ వెంకట బసవరావు
రాయలసీమ యూనివర్సిటి మెరుగైన వసతులు ఉన్నాయి. 1976 శ్రీవెంకటేశ్వర యూనివర్సీటీ కింద కొనసాగుతూ 1996లో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సీటీ కింద పీజీ సెంటర్‌గా రూపాంతరం చెంది, 2007లో రాయలసీమ యూనివర్సీటీగా ఏర్పడింది. అప్పటి నుండి ఒడిదుడుకుల మద్య విద్యార్థులకు విద్యను అందిస్తూ, 2019లో ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేశాం. రీసెర్చ్ విభాగంతో ప్రతి విభాగానికి అత్యాధునిక ల్యాబ్‌లు, పరికరాలు, వసతుల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించి విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాం. ప్రస్తుతం విద్యార్థుల అడ్మిషన్స కూడా పెరిగాయి. ప్రతి విద్యారికి ఉపాధి చూపించే లక్ష్యంగా పలు సంస్థలు, కంపెనీలతో ఇంటర్వ్యూలు నిర్వహించి ఉపాధి అవకాశాల కోసం జాబ్ మేళాలు నిర్వహిస్తున్నాం. క్వాంటమ్ టెక్నాలజీని విద్యార్థుల కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నాం.
4వ స్నాతకోత్సవంలో...
డిగ్రీ పట్టాలు పొందిన వారు : 18,396
పీజీ పూర్తి చేసిన విద్యార్థులు : 246
బంగారు పతకాలు అందుకున్న వారు : 75
పీహెచడీ డాక్టరేట్లు పొందిన వారు : 140