పరిహారం చెల్లించండి
ABN , Publish Date - Oct 22 , 2025 | 11:13 PM
ఉమ్మడి కర్నూలు జిల్లాలో హిట్ అండ్ రన కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు నష్టపరిహారాన్ని అందజేయాలని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి ఆదేశాలు జారీ చేశారు.
హిట్ అండ్ రన కేసులపై జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి
కర్నూలు లీగల్, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కర్నూలు జిల్లాలో హిట్ అండ్ రన కేసులను త్వరితగతిన పరిష్కరించి బాధితులకు నష్టపరిహారాన్ని అందజేయాలని కర్నూలు జిల్లా ప్రధాన న్యాయాధికారి జి. కబర్ధి ఆదేశాలు జారీ చేశారు. విక్టిమ్ కాంపెన్సేషన కేసులపై జిల్లా స్థాయి అధికారుల మానిటరింగ్ సమావేశం బుధవారం స్థానిక జిల్లా కోర్టులో నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో పాటు నారాయణపేట జిల్లా అధికారులతో కూడా ఆయన వీడియో కాన్ఫరెన్స ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండర్ ట్రయల్ బాధితులు, హిట్ అండ్ రన కేసుల బాధితులకు నష్టపరిహారంతో పాటు అనాథ బాలలకు ఆధార్ కార్డులు మంజూరు చేసే విషయంపై ఆయన ఈ సమావేశంలో సమీక్షించారు. బాధితులకు రెండు కేసులలో రూ.12.50 లక్షలను నష్టపరిహారంగా ఆయన అధికారులతో సంప్రదించి మంజూరు చేశారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆధార్ కార్డు లేని 120 మంది అనాథ బాలలను గుర్తించారని, వారిలో 56 మందికి ఆధార్ కార్డులను మంజూరు చేసి మిగతా వారికి సత్వరమే ఆధార్ కార్డులను అందజేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి, అదనపు సీనియర్ సివిల్ జడ్జి దివాకర్, ఏజీపీ సయ్యద్ షాబుద్దీన, మెంబర్ పి. శివసుదర్శన తదితరులు పాల్గొన్నారు.