Deputy CM Pawan Kalyan: ప్రజలు మెచ్చాలి
ABN , Publish Date - Dec 20 , 2025 | 05:50 AM
నియోజకవర్గాల్లో అభివృద్ధి, ఉపాధికి ఉన్న అవకాశాలను గుర్తించి వాటిని ముందుకు తీసుకువెళ్లే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని జనసేన అధినేత..
జనసేన ఎమ్మెల్యేలకు పవన్ ఉద్బోధ
నిత్యం ప్రజలకు దగ్గరగా ఉంటూ సమస్యలు పరిష్కరించండి
నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
9 మంది ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం ముఖాముఖి
అమరావతి, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గాల్లో అభివృద్ధి, ఉపాధికి ఉన్న అవకాశాలను గుర్తించి వాటిని ముందుకు తీసుకువెళ్లే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో మనం చేసిన అభివృద్ధి.. నియోజకవర్గ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవాలనే తపనతో పని చేయాలన్నారు. పనితీరు ప్రజలు మెచ్చేలా ఉండాలని దిశానిర్దేశం చేశారు. జనసేన ఎమ్మెల్యేలతో ముఖాముఖి సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఆయన 9 మందితో భేటీ అయ్యారు. వారి నియోజకవర్గాల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, నడుస్తున్న ప్రాజెక్టులపై చర్చించారు. ‘నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి ఏం కావాలో తెలుసుకోవడానికి అధిక ప్రాధాన్యమివ్వాలి. అర్జీల పరిష్కారానికి పెద్ద పీట వేయాలి. ప్రతి నియోజకవర్గం ఆర్థికంగా బలోపేతం కావాలి. మౌలిక వసతుల కల్పనతో పారిశ్రామికాభివృద్ధికి అనువైన వాతావరణం కల్పించాలి. యువతకు ఉపాధి, ఉద్యోగావకాశాలు పెంచడంపై ప్రత్యేక దృష్టి సారించాలి. పాలన సంబంధిత అంశాలతో పాటు పార్టీ కార్యక్రమాల నిర్వహణకు ప్రాధాన్యమివ్వాలి. జన సైనికులు, వీర మహిళలతో ఎప్పటికప్పుడు చర్చించాలి. కూటమి స్ఫూర్తిని బలంగా నిలపాలి’ అని కోరారు. స్థానిక ఎన్నికలకు సమాయత్తం కావాలని పిలుపిచ్చారు. పార్టీ నిర్మాణ వ్యవహారాల్లో మచిలీపట్నం పార్లమెంట్ పరిధిలో చేపట్టిన పిఠాపురం ఫార్ములా అనుసరించాలని స్పష్టం చేశారు. తమ తమ నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన పనులు, ప్రాజెక్టులపై ఎమ్మెల్యేలు ఆయనకు ప్రతిపాదనలు సమర్పించారు.
ఎమ్మెల్యేలు ప్రస్తావించిన అంశాలు..నిమ్మక జయకృష్ణ (పాలకొండ): తోటపల్లి ఆధునికీకరణ, పాలకొండ ప్రధాన రహదారి విస్తరణ, కొండలోన గెడ్డ, వడ్డంగా ఎత్తిపోతలకు నిధులు కేటాయించాలి. పాలకొండ మున్సిపాలిటీలో డంపింగ్ యార్డుకు స్థలం కేటాయించాలి. వీరఘట్టం కొత్త బస్టాండ్ నిర్మాణం, పాలకొండలో మినీ క్రికెట్ స్టేడియం నిర్మాణం చేపట్టాలి. సీతంపేట మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి పనులు వేగవంతం చేయడంతో పాటు మెడికల్ కాలేజీగా మార్చాలి.
లోకం మాధవి (నెల్లిమర్ల): తారకరామ తీర్థ సాగరం ప్రాజెక్టు, నానో పార్క్ అభివృద్ధి, ఏఐ సిటీ, ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టాలి. నియోజకవర్గంలో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు జలజీవన్ మిషన్ పథకం ద్వారా నిధులు కేటాయించాలి.
పంచకర్ల రమేశ్‌బాబు (పెందుర్తి): సింహాచలం దేవస్థానం పరిధిలోని పంచగ్రామాల సమస్యను పరిష్కరించాలి. ఫార్మా కాలుష్యంతో ఇబ్బందిపడుతున్న తాడి గ్రామాన్ని తరలించాలి. నియోజకవర్గంలో చేపట్టాల్సిన టూరిజం ప్రాజెక్టులు, ఆర్ అండ్ బీ రోడ్డు నిర్మాణానికి సహకరించాలి. ఉపాధి నిధులు పెంచితే గ్రామాల్లో అభివృద్ధి పనులు మరిన్ని చేపడతాం.
సుందరపు విజయ్‌కుమార్ (ఎలమంచిలి): నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో కిడ్నీ సమస్యలు పెరుగుతున్నాయి. వాటిని నివారించడానికి జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా తాగునీరు అందించాలి. ఎలమంచిలి-గాజువాక ప్రధాన రహదారి పూర్తి చేయాలి.
పంతం నానాజీ (కాకినాడ రూరల్): నియోజకవర్గ పరిధిలోని స్థానిక సంస్థల ఎన్నికలు జరక్కపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు రావడం లేదు. అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలి. కార్పొరేషన్‌లో గ్రామాలు, వార్డుల విలీనం సమస్యను పరిష్కరించాలి. క్రికెట్ స్టేడియం, బీచ్ సుందరీకరణ, రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం చేపట్టాలి.
గిడ్డి సత్యనారాయణ (పి.గన్నవరం): గోదావరి వరదలు నియోజకవర్గంలోని మూడు మండలాల్లో తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. ముఖ్యంగా లంక గ్రామాలు, వేల హెక్టార్ల పంటలు ముంపుకు గురై, లక్షలాది మంది నిరాశ్రయులవుతున్నారు. గట్టు బలోపేంతో పాటు వరద నష్టాన్ని ఆరికట్టడానికి గ్రోయిన్ల నిర్మాణం చేపట్టాలి. వైనతీయ నదిపై ఊడిముడి-గంటి పెదపూడి మధ్య నిర్మాణంలో ఉన్న బ్రిడ్జ్‌ను పూర్తి చేయాలి. అయినపల్లి, అప్ననపల్లి, ఆదుర్రు గ్రామాల్లో ఉన్న పుణ్యక్షేత్రాలను ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలి.
దేవ వరప్రసాద్ (రాజోలు): సముద్ర జలాల ప్రభావంతో వేల ఎకరాల్లో కొబ్బరి తోటలు తుడిచిపెట్టుకుపోతున్నాయి. లక్షల చెట్లు మోడువారిపోతున్నాయి. ఈ సమస్యను పరిష్కరించడానికి శంకరగుప్తం డ్రెయిన్ డ్రెడ్జింగ్ చేయాలి. అంతర్వేది ఆలయంతో పాటు నియోజకవర్గంలో పర్యాటకానికి అనేక ప్రాంతాలు అనువుగా ఉన్నాయి. వాటిని టూరిజం స్పాట్లుగా అభివృద్ధి చేయాలి.
వంశీకృష్ణ శ్రీనివాస్ (విశాఖ దక్షిణ): ఎల్లమ్మతోట, వెంకటేశ్వర మెట్ట, అస్సాం గార్డెన్స్, మహారాణిపేటల్లో 22ఏ కింద దేవదాయశాఖ పరిధిలో ఉన్న భూములపై నిషేధం తొలగించేలా చూడాలి. పూర్ణా మార్కెట్, నెహ్రూ బజార్‌ను నూతనంగా నిర్మించాలి. బీచ్ రోడ్డును సుందరీకరించాలి.
మండలి బుద్ధ ప్రసాద్ (అవనిగడ్డ): తెలుగు భాష వాడుక పెంచే విధంగా చూడాలి. నియోజకవర్గంలో రైతాంగం సమస్యలు పరిష్కరించాలి.