Deputy CM Pawan Kalyan: మీ మతంలో జరిగితే ఇలానే స్పందించేవారా?
ABN , Publish Date - Dec 11 , 2025 | 03:47 AM
తిరుమల శ్రీవారి పరకామణి చోరీ కేసు చాలా చిన్నదంటూ.. చిటికె వేసినంత తేలిగ్గా వైసీపీ అధినేత జగన్ మాట్లాడటం సరికాదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు...
పరకామణి కేసులో జగన్ వ్యాఖ్యలపై పవన్ ఫైర్
హిందువులు మెజారిటీ అనే భావన మిథ్యే : పవన్
అమరావతి, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ‘పరకామణి’ చోరీ కేసు చాలా చిన్నదంటూ.. చిటికె వేసినంత తేలిగ్గా వైసీపీ అధినేత జగన్ మాట్లాడటం సరికాదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఇది ఆయన బాధ్యతా రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. ‘‘ఇలాంటి సంఘటనలు ఇస్లాంలో గానీ, జగన్ ఆచరించే క్రిస్టియన్ మతంలో గానీ జరిగితే ఇలాగే స్పందించే వారా?.’’ అని ప్రశ్నించారు. బుధవారం మంగళగిరిలో జాతీయ మీడియాతో ఆయన మాట్లాడారు. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన జగన్.. ఇలా మాట్లాడటం సబబు కాదని పవన్ అన్నారు. ఆచారాలు, సంప్రదాయాలను కాపాడేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు టీటీడీని ఆదేశించారని తెలిపారు. కాగా, దేశంలో హిందువుల ఐక్యత, మెజారిటీ.. అనే భావన మిథ్యేనని పవన్ అ న్నారు. మెజారిటీ పేరిట హిందువులు వివక్షను ఎదుర్కొంటున్నారన్నారు. దేశంలో ముస్లింలు, క్రైస్తవులకు వర్తించే నిబంధనలే హిందువులకూ వర్తింపజేయాలని, లేదంటే ఘర్షణలకు అవకాశాలుంటాయని తెలిపారు. ప్రతి ఒక్క రూ హిందువులనే లక్ష్యంగా చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. హిందువుల ఆచారాలను మాత్రమే ప్రశ్నిస్తారని, తమిళనాడు ఎంపీల వ్యాఖ్యలు అదే కోవకి చెందుతాయన్నారు. ముస్లింలు, క్రైస్తవుల ప్రయోజనాలు కాపాడేందుకు వర్తించే నిబంధనలే హిందువులకు వర్తిస్తాయన్నా రు. తమిళనాడులో కొన్ని పార్టీలు సూడో సెక్యులరిజం పాటిస్తున్నాయని దుయ్యబట్టారు. డీఎంకే ప్రభుత్వం దేవాలయాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ తన ఒక్కడి వల్ల అయ్యే పనికాదని, ప్రతి హిందువు సనాతన ధర్మ పరిరక్షణకు నడుంబిగించాలని పిలుపునిచ్చారు. ముసాయిదా రాజ్యాంగంలో భగవద్గీత ప్రస్తావన ఉందని, దీనికి సంబంధించిన ‘ప్రతి’ తన కార్యాలయంలో ఉందని పవన్ కల్యాణ్ తెలిపారు.