Share News

Pawan Kalyan: ఐదేళ్లలో జరగని అభివృద్ధి ఏడాదిలోనే చేశాం

ABN , Publish Date - Jun 20 , 2025 | 04:34 AM

గత ఐదేళ్లలో జరగని అభివృద్ధిని ఏడాదిలోనే చేసి చూపిస్తూ, ప్రజల్లోనే కాకుండా పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపడానికి కృషి చేశామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

 Pawan Kalyan: ఐదేళ్లలో జరగని అభివృద్ధి ఏడాదిలోనే చేశాం

  • వచ్చే నాలుగేళ్లలో రెట్టింపు చేస్తాం

  • అభివృద్ధికి కేరా్‌ఫగా ఆంధ్రప్రదేశ్‌

  • రాష్ట్రానికి కేంద్రం సంపూర్ణ సహకారం

  • స్వర్ణాంధ్ర-2047 దిశగా అడుగులు

  • గ్రామ స్వరాజ్యానికి ముందడుగు

  • ప్రజలకు ప్రగతి నివేదిక సమర్పించిన ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌

అమరావతి, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): గత ఐదేళ్లలో జరగని అభివృద్ధిని ఏడాదిలోనే చేసి చూపిస్తూ, ప్రజల్లోనే కాకుండా పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని నింపడానికి కృషి చేశామని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని, సుపరిపాలనను చూసి కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారాలు అందిస్తోందన్నారు. దీంతో రాష్ట్రం అన్ని రంగాల్లో సమష్టి అభివృద్ధి సాధిస్తూ స్వర్ణాంధ్ర-2047 సాధించే దిశగా అడుగులు వేస్తోందన్నారు. ఉపముఖ్యమంత్రిగా, వివిధ శాఖలకు మంత్రిగా బాధ్యతలు స్వీకరించి ఏడాది గడిచిన సందర్భంగా పవన్‌ కల్యాణ్‌ సుపరిపాలనకు ఏడాది పేరుతో 20 పేజీల సమగ్ర అభివృద్ధి నివేదిక 2024-25ను గురువారం విడుదల చేశారు. ‘ప్రగతి, పారదర్శకత, సుస్థిరత, జవాబుదారీతనం, గ్రామ స్వరాజ్యానికి ముందడుగు.. హరితాంధ్ర సాధనకై మరో అడుగు’ అంటూ ప్రజలకు నివేదిక సమర్పించారు. గత సంవత్సరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయానికి అండగా నిలబడి, రాష్ట్రాన్ని బానిస సంకెళ్ల నుంచి విముక్తి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. రాజకీయాల్లో, ప్రభుత్వంలో పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని నిరంతరం పరితపించే తాను చేపట్టిన శాఖల ద్వారా ఏడాదిలో చేసిన అభివృద్ధి, సాధించిన విజయాలను ప్రజలందరి ముందు ఉంచడం నైతిక బాధ్యతగా భావిస్తున్నానని పవన్‌ నివేదికలో పేర్కొన్నారు.


ఏడాదిలో ఎంతో అభివృద్ధి

ఏడాదిలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను నివేదికలో వెల్లడించారు. 1,312 కి.మీ మేర 449 బీటీ రోడ్లు, రూ.649 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా వివిధ పనులకు రూ.589 కోట్లు కేటాయించారు. గిరిజన ప్రాంతాలకు రోడ్ల నిర్మాణంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్‌ రోడ్లకు మరమ్మత్తులు చేపట్టారు. ఉపాధి నిధులతో 4 వేల కి.మీ సిమెంట్‌ రోడ్ల నిర్మాణం, గ్రామాలను కలిపేలా 276 కి.మీ. బీటీ రోడ్ల నిర్మాణం, 78 వేల నీటి కుంటలు, 22,500 గోకులాల షెడ్ల నిర్మాణం, 15 వేల పశువుల నీటి తొట్టెల నిర్మాణం చేపట్టారు. 1877 నివాస ప్రాంతాలకు తొలిసారిగా రహదారి సౌకర్యం కల్పించారు. 1137 గిరిజన గ్రామాలకు రహదారుల సమస్యను పరిష్కరించారు. వారికి డోలీ వెతలు చెరిపేసి, అభివృద్ధిని చేరువ చేస్తూ విద్య, వైద్య, ఉపాధి సౌకర్యాలు పొందే అవకాశం కల్పించారు.

పిఠాపురంలో అభివృద్ధి..

పిఠాపురం ఎమ్మెల్యేగా ఏడాది కాలంలో రికార్డు స్థాయిలో రూ.308 కోట్ల వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో చేపట్టినట్లు వివరించారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా జల్‌జీవన్‌ మిషన్‌ కింద చేపట్టబోయే పనుల వివరాలను వెల్లడించారు.

Updated Date - Jun 20 , 2025 | 04:35 AM