Deputy CM Pawan Kalyan: ఏనుగులదాడుల నివారణకు హనుమాన్
ABN , Publish Date - Nov 10 , 2025 | 04:26 AM
అడవి ఏనుగుల దాడుల నివారణకు అటవీశాఖ రూపొందించిన హనుమాన్ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు....
ఏనుగుల సంచారంపై ఎప్పటికప్పుడు సమాచారం
150 ఏనుగులకు జియో ట్యాగింగ్: పవన్
చిత్తూరు జిల్లాలో ‘కుంకీ’ కేంద్రం ప్రారంభం
చిత్తూరు/పలమనేరు, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): అడవి ఏనుగుల దాడుల నివారణకు అటవీశాఖ రూపొందించిన హనుమాన్ ప్రాజెక్టు ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఆదివారం చిత్తూరు జిల్లాలో కుంకీ ఏనుగుల కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హనుమాన్ ప్రాజెక్టు పోస్టర్‌ను ఆవిష్కరించారు. 11 అంశాలతో కూడిన ఈ ప్రాజెక్టు గురించి అటవీశాఖ అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. వాటిని ఆసక్తిగా తెలుసుకున్న ఆయన, అటవీ శాఖతో పాటు పంచాయతీరాజ్, వ్యవసాయ, ఉద్యాన శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. దీనిపై చర్చించేందుకు ఈ నెల 3వ వారంలో సమీక్ష ఏర్పాటు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. మానవ, వన్య ప్రాణి సంఘర్షణను తగ్గించేందుకు ఇప్పటికే అమల్లో ఉన్న గజ యాప్ స్థానంలో నూతన సాంకేతికతో ప్రత్యేక యాప్‌ను సిద్ధం చేయాలన్నారు. ఏ ప్రాంతంలో ఏనుగులకు రేడియో కాలర్ ఏర్పాటు చేస్తే అత్యధిక ప్రయోజనం ఉంటుందో వాటికే ఏర్పాటు చేయాలని సూచించారు. జంతువుల సంచార సమాచారం ప్రజలకు తెలిసేలా అధునాతన టెక్నాలజీతో కొత్త యాప్‌ను రూపొందించి మార్చి 3లోగా అందుబాటులోకి తేవాలన్నారు. ఏనుగులతో తీవ్రంగా దెబ్బతింటున్న పంటల స్థానంలో ప్రత్యామ్నాయాలు ఎలా.. ఇందుకు రైతుల్ని ఎలా ఒప్పించాలనే అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. సర్ప మిత్ర వలంటీర్లకు ప్రోత్సాహకాలు అందించాలన్నారు.
20 ఎకరాల్లో ఎలిఫెంట్ క్యాంపు
మదపుటేనుగుల్ని అడవిలోకి తరిమి కొట్టేందుకు కర్ణాటక నుంచి ఆ మధ్య పవన్ నాలుగు కుంకీ ఏనుగుల్ని తీసుకొచ్చిన విషయం తెలిసిందే. చిత్తూరు జిల్లా పలమనేరు మండలం ముసలిమడుగులో 20 ఎకరాల్లో ఎలిఫెంట్ క్యాంపును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం జిల్లాల్లో 140-150 వరకు ఏనుగులు ఉన్నాయని అధికారులు చెప్పగా.. వాటన్నింటికీ జియో ట్యాగింగ్ చేయాలని పవన్ సూచించారు. ఇక్కడ ఏర్పాటు చేయనున్న గజారామం నగర వనానికి, మియావకీ ఫారెస్టు ప్లాంటేషన్, అధునాతన సోలార్ ఫెన్సింగ్ తదితర వాటికి శిలాఫలకాలను ఆవిష్కరించారు.
మియావకీ తరహా ప్లాంటేషన్
తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ మొక్కలు పెంచడం ద్వారా అడవిని పెంపొందించే మియావకీ తరహా ప్లాంటేషన్‌కు పవన్ శ్రీకారం చుట్టారు. 250 చమీ విస్తీర్ణంలో ఈ ప్లాంటేషన్‌ను ఏర్పాటు చేశారు. ఉసిరి మొక్కను నాటి కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. మీటరుకు ఒకటి చొప్పున నాటిన మియావకీ ప్లాంటేషన్‌ను మొబైల్‌లో వీడియో తీసుకున్నారు.
ఆసక్తిగా కుంకీల విన్యాసాలు
ఎలిఫెంట్ క్యాంపులో కుంకీ ఏనుగుల ప్రత్యేక విన్యాసాలు ఆకట్టుకున్నాయి. పవన్ ఆసక్తిగా తిలకించి తన సెల్‌ఫోన్‌లో రికార్డు చేసుకున్నారు. ఏనుగులు వరుసగా ఘీంకరిస్తూ పవన్‌కు సెల్యూట్ చేశాయి. వివిధ రకాల కలపను అడవిలో నుంచి ఎలా బయటికి తీసుకొస్తారో కుంకీలతో చేసి చూపించారు. కుంకీ ఏనుగులకు పవన్ ఆహారాన్ని అందించారు. వాటి సంరక్షణ చూసే మావటీలతో ఫొటో తీసుకుని రూ.50 వేలు బహుమతి అందించారు.
మత్తు ఇచ్చే గన్‌తో పవన్
మదపుటేనుగులు అదుపు తప్పినప్పుడు వాటికి ఓ ప్రత్యేకమైన మత్తు ఇచ్చి వాటి కోపాన్ని ఎలా అణచివేస్తారనేది మావటీలు పవన్‌కు చూపించారు. ఈ సందర్భంగా మత్తు ఇచ్చే ఇంజక్షన్ గన్‌ను పట్టుకుని పవన్ ఆసక్తిగా పరిశీలించారు.