Share News

Deputy CM Pawan Kalyan: గుంతలు పడ్డ రోడ్లు.. ప్రశ్నిస్తే కేసులు

ABN , Publish Date - Nov 27 , 2025 | 05:40 AM

గత వైసీపీ ప్రభుత్వం అంటే.. గుంతలు పడ్డ రోడ్లు, మరమ్మతులకు నోచుకోని కాల్వలు, పాలనపై ప్రశ్నిస్తే పెట్టిన అక్రమ కేసులే గుర్తుకు వస్తాయని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నారు....

Deputy CM Pawan Kalyan: గుంతలు పడ్డ రోడ్లు.. ప్రశ్నిస్తే కేసులు

  • గుంతలు పడ్డ రోడ్లు.. ప్రశ్నిస్తే కేసులు

  • గత ప్రభుత్వం అంటే గుర్తొచ్చేవి ఇవే: పవన్‌

  • కోనసీమ జిల్లా శివకోడులో పల్లె పండగ 2.0కు శ్రీకారం

అమలాపురం, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ ప్రభుత్వం అంటే.. గుంతలు పడ్డ రోడ్లు, మరమ్మతులకు నోచుకోని కాల్వలు, పాలనపై ప్రశ్నిస్తే పెట్టిన అక్రమ కేసులే గుర్తుకు వస్తాయని ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నారు. గత ప్రభుత్వం నుంచి కూటమి ప్రభుత్వానికి అప్పులు, సమస్యలు మాత్రమే వారసత్వంగా లభించాయని తెలిపారు. బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు మండలం శివకోడు గ్రామంలో బుధవారం పవన్‌ కల్యాణ్‌ పల్లె పండగ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అక్కడ ఉన్నవారిని ఉద్దేశించి ప్రసంగించారు. వైసీపీకి అనుకూలంగా ఉండే కొన్ని పత్రికలు కూటమి ప్రభుత్వం 16 నెలల కాలంలో ఏం చేసిందని ప్రశ్నిస్తున్నాయని, గత ప్రభుత్వంలా దోచుకోవడం లేదని మాత్రం తాను చెప్పగలనన్నారు. అప్పటిలా ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం లేదని, సంక్షేమం పేరుతో అభివృద్ధిని నిర్లక్ష్యం చేయడం లేదని, ఉద్యోగులకు సకాలంలోనే జీతాలు ఇస్తున్నామని, అభివృద్ధికి వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని, పెన్షన్లు గత ప్రభుత్వం కంటే బాగా ఇస్తున్నామని సమాధానం ఇవ్వగలనన్నారు. ప్రజలు బుద్ధి చెప్పినా వైసీపీ నాయకుల్లో మార్పు రాలేదని, వాళ్ల బుద్ధి మారడం లేదన్నారు. ‘‘రాజోలు గడ్డ నుంచి చెబుతున్నా.. 2029లో మీరు రారు. అలాంటి ఆశలు పెట్టుకోకండి. అది జరగదు.’’ అని వైసీపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కొబ్బరిచెట్టు వేసి పెంచితే 15ఏళ్లకు గానీ కాపు కాయదని, అలాగే మీరు ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించి 15ఏళ్ల పాటు కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోనే ఉంచాలని యువతను కోరారు. ‘‘కోనసీమలో కొబ్బరిచెట్టును ఇంటికి పెద్దకొడుకులా చూసుకుంటారు. కూటమి ప్రభుత్వాన్ని మీరు పెద్దకొడుకులా కాపాడితే ఆ పెద్దకొడుకే మీకు భవిష్యత్తు ఇస్తాడు’’ అని తెలిపారు. జన్‌-జీ యువత ఆలోచనలో చాలా మార్పు వచ్చిందని, అబద్ధపు హామీలతో వారిని మోసం చేయలేమని పేర్కొన్నారు. అందువల్లే బిహార్‌ ఎన్నికల్లో లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆశ చూపినా ఆర్జేడీని చిత్తుగా ఓడించారన్నారు. నిధులు లేకపోయినా, ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా, వేల కిలోమీటర్ల మేర రోడ్లు వేస్తున్నామనీ, పల్లెల రూపురేఖలు మారుస్తున్నామని తెలిపారు.


కోనసీమ కేరళ స్థాయి సత్తా ఉన్న ప్రాంతమని, ఇక్కడ బ్యాక్‌ వాటర్‌తో కేరళ తరహా టూరిజాన్ని అభివృద్ధి చేయవచ్చునని, మన దర్శక, నిర్మాతలు షూటింగుల కోసం కోనసీమను ఎన్నుకుంటే బాగుంటుందని సూచించారు. రాష్ట్రంలోని గ్రామాల ముఖ చిత్రాన్ని సంపూర్ణంగా మార్చివేసే లక్ష్యంతో పల్లె పండగ 2.0 కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం తొలిదశలో 4వేల కిలోమీటర్ల రోడ్డు వేశామని, ఇప్పుడు 2.0.లో రెండింతల అభివృద్ధికి శ్రీకారం చుట్టనున్నట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని 13,326 పంచాయతీల్లో రూ.6,787 కోట్ల వ్యయంతో 53,382 అభివృద్ధి పనులను చేపట్టేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు ప్రకటించారు.

కొబ్బరి బోర్డు ఏర్పాటుకు కోరతా..

పర్యటనలో భాగంగా డిప్యూటీ సీఎం మలికిపురం మండలం కేశనపల్లి, చింతలమోరి, శంకరగుప్తం గ్రామాల ప్రజలను కలిశారు. అక్కడ డ్రెయిన్‌ల నుంచి సముద్రపునీరు ఎగదన్నడం వల్ల నిర్జీవంగా మారిన కొబ్బరిచెట్లను పరిశీలించారు. 13 గ్రామాల కొబ్బరి రైతులతో ముఖాముఖి మాట్లాడారు. కొబ్బరి రైతుల సంక్షేమానికి బోర్డు ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరతానని హామీ ఇచ్చారు.

Updated Date - Nov 27 , 2025 | 05:40 AM