Deputy CM Pawan Kalyan: భారమైనా.. భరిస్తాం!
ABN , Publish Date - Oct 05 , 2025 | 04:35 AM
ఆటో డ్రైవర్ల సేవ’లో పథకం అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.436 కోట్ల భారం పడుతుందని, అయినా ఆ భారాన్ని ఆనందంగా భరిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.....
సమర్థ నాయకత్వం, ప్రణాళికా బద్ధమైన పాలనతో రాష్ట్రాభివృద్ధి
‘స్ర్తీశక్తి’తో వారికి జరిగే నష్టం గురించి క్యాబినెట్‌లో మాట్లాడా
రోడ్లపై గుంతలు, గ్రీన్‌ట్యాక్స్ సమస్యలూ పరిష్కరించాం
‘ఆటోడ్రైవర్ల సేవ’లో ప్రారంభ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
విజయవాడ, అక్టోబరు 4(ఆంధ్రజ్యోతి): ‘ఆటో డ్రైవర్ల సేవ’లో పథకం అమలుతో రాష్ట్ర ప్రభుత్వంపై రూ.436 కోట్ల భారం పడుతుందని, అయినా ఆ భారాన్ని ఆనందంగా భరిస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. సమర్థవంతమైన నాయకత్వం, ప్రణాళికా బద్ధమైన పాలన ఉంటే ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. మహిళల కోసం ‘స్ర్తీశక్తి’ పథకాన్ని ప్రవేశపెడుతున్న సందర్భంగా క్యాబినెట్‌లో చర్చ జరిగిందని, ఈ పథకం కారణంగా ఆటో డ్రైవర్ల ఉపాధి దెబ్బతింటుందన్న అంశాన్ని తాను ప్రస్తావించానని తెలిపారు. ఆటోడ్రైవర్లను నిర్లక్ష్యం చేయబోమని, ఎట్టి పరిస్థితుల్లో వారికి నష్టం జరగకుండా చూస్తామని సీఎం చంద్రబాబు చెప్పారన్నారు. అయితే దీనికి సమయం కావాలని అడిగారని, ఆ రోజు చెప్పిన ప్రకారమే ఆటోడ్రైవర్లకు రూ.15వేల ఆర్థిక సహాయాన్ని అందించే పథకానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందికరమైన విషయమే అయినప్పటికీ కచ్చితమైన ప్రణాళికతో దీన్ని అమలు చేస్తున్నారని కొనియాడారు. ఈ పథకంలో మొత్తం 2.90 లక్షల మంది ఆటో డ్రైవర్లకు రూ.436 కోట్ల లబ్ధి కలుగుతుందన్నారు. ఎన్నికల ముందు పిఠాపురంలో ఆటోలో ప్రయాణించినప్పుడు ఆటోడ్రైవర్లు తమ ఇబ్బందులను తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. గ్రీన్ ట్యాక్స్ సమస్యను ఏడాదిన్నరలోపే పరిష్కరించామని తెలిపారు. అలాగే రోడ్లపై గోతుల కారణంగా గత వైసీపీ ప్రభుత్వంలో వాహనమిత్ర కింద ఇచ్చిన రూ.10వేలు మరమ్మతులకే ఖర్చయి పోయేవని పవన్ వివరించారు. దెబ్బతిన్న రోడ్లను కూటమి ప్రభుత్వం పూడ్చటంతో పాటు వాటిని అభివృద్ధి చేసిందని గుర్తుచేశారు. ఇప్పుడు ఆటోవాలాలకు ఎలాంటి మరమ్మతులు చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. గత ప్రభుత్వం ఇచ్చిన దానికంటే అదనంగా రూ.5వేలు పెంచి ఆర్థిక సహాయం కింద రూ.15వేలు అందించడం మంచి విషయమన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నందుకు సీఎం చంద్రబాబుకు పవన్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.