Deputy CM Pawan: వంద రోజుల్లో పరిష్కరిస్తా
ABN , Publish Date - Oct 10 , 2025 | 04:44 AM
ఉప్పాడ మత్స్యకారుల సమస్యలన్నీ అర్థం చేసుకున్నానని, వాటిని పరిష్కరించడానికి వంద రోజులు గడువు కావాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
వైసీపీలా పరిశ్రమలను భయపెట్టం.. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలి
3 రోజుల్లో సముద్రంలోకి వెళ్తా.. పారిశ్రామిక వ్యర్థ జలాలను పరిశీలిస్తా
నక్కపల్లి, కాకినాడ సెజ్‌లు, దివీస్, అరబిందో, డెక్కన్.. వైఎస్ హయాంలోనివే
వాటి కాలుష్యంపై ఆడిట్ చేయిస్తా.. ఉప్పాడలో రక్షణ గోడ నిర్మాణం
రూ.323 కోట్లు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలం
ఉప్పాడ మత్స్యకారుల సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
కాకినాడ, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): ఉప్పాడ మత్స్యకారుల సమస్యలన్నీ అర్థం చేసుకున్నానని, వాటిని పరిష్కరించడానికి వంద రోజులు గడువు కావాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. వారిలో ఒకడిగా భావించి సమస్య పరిష్కరిస్తానని, న్యాయం చేయలేకపోతే రాజకీయాలు వదిలి వెళ్లిపోతానని ప్రకటించారు. గత వైసీపీ ప్రభుత్వం మాదిరిగా పరిశ్రమలను కూటమి సర్కారు భయపెట్టదని స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలను బెదిరించడం వైసీపీ చేసే పని అని మండిపడ్డారు. రాష్ట్రానికి పెట్టుబడులు రావాలని, లేదంటే అభివృద్ధి ముందుకు వెళ్లదని అన్నారు. కాకినాడ జిల్లాలో తన సొంత నియోజకవర్గం పిఠాపురం పరిధిలోని ఉప్పాడలో గురువారం ఆయన మత్స్యకారులతో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. సముద్రంలో కలుస్తున్న పారిశ్రామిక వ్యర్థ జలాల ప్రాంతాలను మరో మూడు రోజుల్లో బోటులో వెళ్లి పరిశీలిస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో నక్కపల్లి, కాకినాడ సెజ్‌లు, దివీస్, అరబిందో తదితర పరిశ్రమలు వైఎస్ హయాంలో వచ్చినవేనని.. కూటమి పార్టీలు ప్రారంభించినవి కాదని.. వీటి ద్వారా వెదజల్లే జల, వాయు కాలుష్యంపై ఆడిట్ చేయిస్తానని తెలిపారు. అంతకుముందు ఉదయం కాకినాడ కలెక్టరేట్‌లో పలువురు మత్స్యకార ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. వారితో చర్చించి సమస్యలు తెలుసుకున్నారు. సాయంత్రం బహిరంగ సభలో ప్రసంగించారు. ఆ సందర్భంగా ఇంకా ఏమన్నారంటే..
తాగునీటిని బాటిళ్లలో తాగాల్సిన పరిస్థితి
పరిశ్రమల నుంచి విడుదలయ్యే రసాయన, జల, శబ్ధ, వాయి కాలుష్యంవల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి. మత్స్యకారులు, ఎన్‌జీవో ప్రతినిధులు ఇదే విషయాన్ని నాకు వివరించారు. తామంతా పరిశ్రమలకు వ్యతిరేకం కాదని, కానీ అవి తమ ఉపాధి, జీవనోపాధిని దెబ్బతీయకూడదని చెప్పారు. ఇది చాలామంది ఆలోచనాధోరణి. గోదావరి జిల్లాలు, నెల్లూరు తదితర ప్రాంతాల్లో ఆక్వాకల్చర్ వల్ల ప్రభుత్వానికి రూ.1.30 లక్షల కోట్ల ఆదాయం వస్తోంది. ప్రత్యక్షంగా 3.72 లక్షల మందికి, పరోక్షంగా 15 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది. ఇది ఒకవైపు అభివృద్ధి.. అదే సమయంలో ఆయా ప్రాంతాల్లో తాగునీరు కలుషితమైంది. రక్షిత తాగునీటిని బాటిళ్లల్లో తాగాల్సిన పరిస్థితి.
సంఘాల నేతలతో చర్చించా
ఉప్పాడ కొత్తపల్లి మండలంలో మత్స్యకారులు నాలుగు రోజులు ధర్నాలు, ఆందోళనలు చేసిన విషయం నా దృష్టికి వచ్చింది. సమస్య పరిష్కారానికి కలెక్టరేట్‌లో మత్స్యకార సంఘాల నేతలతో చర్చించా. నక్కపల్లి సెజ్, దివీస్, అరబిందో, డెక్కన్ తదితర పరిశ్రమల నుంచి సముద్రంలో కలుస్తున్న కాలుష్యం వల్ల వేట దొరకడం లేదని వారు చెప్పారు. అంతర్వేది, మచిలీపట్నం నిజాంపట్నం తదితర ప్రాంతాలకు వేటకు వెళ్తే ఇబ్బంది పెడుతున్నారని చెప్పారు. వీటన్నిటినీ పరిష్కరించడానికి వంద రోజులు గడువు ఇవ్వండి. సముద్రంలో ఎంతశాతం కాలుష్యం కలుస్తోందో ఆడిట్ చేయకుంటే తెలియదు కదా! వ్యర్థాలు ఎక్కడ వదులుతున్నారు.. అవి సముద్రంలో ఎక్కడ కలుస్తున్నాయో మూడ్రోజుల్లో బోటులో వెళ్లి పరిశీలిస్తా. ఇతర ప్రాంతాల్లో వేట విషయంలో మంత్రి కొల్లు రవీంద్ర, రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఆధ్వర్యంలో సమావేశాలు జరిగాయి. ఇతర ప్రాంతాలవారు అక్కడకు వెళ్లి వేట సాగించే విషయంలో సానుకూలంగా ఉన్నారు. కానీ రింగు వలలు వినియోగించకూడదని చెబుతున్నారు.
పదవీకాలం పూర్తయ్యేలోగా రక్షణ గోడ
ఏదో ఒక మాట చెప్పేసి మీతో చప్పట్లు కొట్టించుకుని వెళ్లిపోవచ్చు. కానీ నేనలా అనుకోవడం లేదు. నిజం కురచ, అబద్ధం పొడవు. మీకు బాసటగా నిలబడతా. ఉప్పాడ రక్షణ గోడను నా పదవీకాలం పూర్తయ్యేలోగా పూర్తి చేస్తా. అవసరమైతే అమిత్‌షా, మోదీతో మాట్లాడతా. పారిశ్రామిక కాలుష్యం, ఇతర విషయాల్లో పరిశ్రమలు, మత్స్య శాఖలతోపాటు సంబంధిత మంత్రులందరితో మాట్లాడాలి. పీసీబీతో పరిశీలన జరిపాలి. ఇవన్నీ జరిగితేనే పూర్తి స్థాయి పరిష్కారం లభిస్తుంది. మీరు తిడితే పడతాను. మీ ఇంట్లో కుటుంబ సభ్యుడిని, నన్ను కాకపోతే ఎవరినంటారు? మిమ్మల్ని ఎగదోసి పబ్బం గడుపుకొనే నాయకులను నమ్మొద్దు. వారు పరిశ్రమలతో ఎంతో కొంత మాట్లాడుకుని పక్కకు తప్పుకొంటారు. నాపై నమ్మకం ఉంచండి. డిప్యూటీ సీఎంగా, పిఠాపురం ఎమ్మెల్యేగా కాదు. మీలో ఒకడిగా ఉన్నాను. తిట్లు, దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉన్నా. ఎక్కడికీ పారిపోను. నియోజకవర్గంలో చేపట్టే కాలుష్య నియంత్రణ మోడల్‌ను భవిష్యత్‌లో రాష్ట్రమంతా అమలు చేస్తాం.
మత్స్యకారులు చెబుతున్న సమస్యలపై నాకూ ఆవేదన ఉంది. వారిలో నేనూ ఒకడిగానే భావిస్తా. వారికి న్యాయం చేయలేనప్పుడు.. అది కుదరనప్పుడు రాజకీయాలు వదిలి వెళ్లిపోతా.
4 రోజులు ధర్నా చేస్తే ఐదో రోజు పరిష్కారం కాదు. వైసీపీవారిలా భయపెట్టి పారిశ్రామికవేత్తలను పారిపోయేలా చేయం. ఓఎన్‌జీసీ అందిస్తున్న నష్టపరిహారం, పరిశ్రమలతో మాట్లాడి.. ఎలా పరిహారమివ్వాలి.. నెలనెలా ఇవ్వాలా, ఒకేసారి ఇవ్వాలా అనేది నిర్ణయించాలి.
ఉప్పాడ తీరం ఏటా 25-30 మీటర్లు కోతకు గురవుతోందని అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లా. ఉప్పాడలో రక్షణ గోడ నిర్మాణానికి రూ.323 కోట్లు ఇవ్వడానికి కేంద్రం సానుకూలంగా ఉంది.
- పవన్ కల్యాణ్