Vandemataram Event: దేశభక్తితో దేశాభివృద్ధి
ABN , Publish Date - Nov 11 , 2025 | 05:28 AM
దేశభక్తి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని, జాతీయ గేయమైన వందేమాతరం స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దేశభక్తితో మెలగాలని సీఎం చంద్రబాబు సూచించారు.
నాడు నలిగిపోతున్న జాతిని వందేమాతరం మేల్కొల్పింది: సీఎం
విజయవాడ సిటీ, నవంబరు 10(ఆంధ్రజ్యోతి): దేశభక్తి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తుందని, జాతీయ గేయమైన వందేమాతరం స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ దేశభక్తితో మెలగాలని సీఎం చంద్రబాబు సూచించారు. సోమవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన వందేమాతర గేయం 150 వసంతాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బ్రిటిష్ పాలనలో నలిగిపోతున్న జాతిని వందేమాతరం మేల్కొలిపిందని ఈ సందర్భంగా చెప్పారు. ‘1875 నవంబరు 7వ తేదీన బెంగాల్‌లోని గంటలపారా అనే చిన్న గ్రామంలో పుట్టిన ఈ గేయం భారత జాతిని ఐక్యం చేసింది. బ్రిటిష్ పాలనలో ప్రజలు అణచివేత, భానిసత్వం, నిరాశ, నిస్పృహల్లో ఉన్న సమయంలో బంకిం చంద్ర ఛటర్జీ తన కలం ద్వారా దేశాన్ని జాగృతం చేశారు. బ్రిటిష్ పాలకులు దీనిని నిషేధించడంతో పాటు ఎంతో మంది ఉద్యమకారులను అరెస్టు చేశారు. తూటాలు పేల్చారు. అయినప్పటికీ పలువురు యోధులు మరణించే చివరి క్షణాల్లో కూడా వందేమాతరం అంటూ ప్రాణాలు విడిచారు. 1907లో బిపిన్ చంద్రపాల్ తెలుగు నేలపై ఈ గేయాన్ని పాడారు. ఆ సమయంలో గాదిచర్ల హరిసర్వోత్తమరావు రాజమండ్రిలో పెద్ద ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈ నెల 7 నుంచి 2026 నవంబరు 7 వరకు ఏడాది పాటు వందేమాతర ఉత్సవాలను జరుపుకొంటున్నాం. మొత్తం 4దశలుగా నిర్వహిస్తాం. మొదటి దశను నవంబరు 7-14 వరకు ప్రారంభ వారోత్సవంగా.. రెండో దశ 2026 జనవరి 19-26 వరకు గణతంత్ర వేడుకలుగా, మూడో దశ ఆగస్టు 7-15 వరకు హర్‌ఘర్ తిరంగా వారోత్సవాలుగా, నాలుగో దశ నవంబరు 1- 7 వరకు ముగింపు వారోత్సవంగా జరుపుతాం’ అని చెప్పారు.