School Cleanliness Drive: ముస్తాబై వస్తారు
ABN , Publish Date - Dec 12 , 2025 | 06:19 AM
ఒక చిన్న ఆలోచన... పెద్ద మార్పు తెచ్చింది. నిధులేవీ అక్కర్లేకుండా... తరగతి గది స్థాయిలో ఒక పథకం అమలవుతోంది. దాని పేరే... ‘ముస్తాబు’! విద్యార్థుల్లో శుభ్రత పట్ల అవగాహన పెంచడం...
పరిశుభ్రతపై విద్యార్థుల్లో అవగాహన
ప్రతి క్లాసులో అద్దం, దువ్వెన, పౌడర్
పార్వతీపురం మన్యం కలెక్టర్‌కు సీఎం ప్రశంస
(పార్వతీపురం - ఆంధ్రజ్యోతి)
ఒక చిన్న ఆలోచన... పెద్ద మార్పు తెచ్చింది. నిధులేవీ అక్కర్లేకుండా... తరగతి గది స్థాయిలో ఒక పథకం అమలవుతోంది. దాని పేరే... ‘ముస్తాబు’! విద్యార్థుల్లో శుభ్రత పట్ల అవగాహన పెంచడం... బడికి చక్కగా తయారై రావడమే ఈ పథకం ఉద్దేశం. బడికి వచ్చే పిల్లలు శుభ్రమైన యూనిఫాం ధరించాలి. తలకు నూనె రాసుకొని, చక్కగా దువ్వుకోవాలి. గోళ్లు తీసుకోవాలి. ఆడపిల్లలైతే రిబ్బన్లతో రెండు జడలు వేసుకోవాలి... ఇలాంటి నిబంధనలన్నీ కార్పొరేట్ స్కూళ్లలో అమలవుతుంటాయి. పార్యతీపురం మన్యం జిల్లాలోని ప్రభుత్వ బడుల్లోనూ పిల్లలు ఇలాగే చక్కగా తయారై తరగతి గదుల్లో అడుగు పెడుతున్నారు. కలెక్టర్ ప్రభాకర్‌రెడ్డి చొరవతో 2 నెలల క్రితం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి తరగతి గదిలో అద్దం, దువ్వెన, పౌడర్ ఏర్పాటు చేశారు. చేతులు కడుక్కొనేందుకు నీటి సదుపాయం కల్పించారు. ఒక్కో క్లాస్‌కు ఇద్దరు లీడర్లను నియమించారు. అపరిశుభ్రంగా ఉన్నవారిని అద్దం వద్దకు పంపిస్తారు. అక్కడ ముస్తాబైన తర్వాతే తరగతికి రావాల్సి ఉంది. ఆడపిల్లలు జడలు వేసుకోవడంలో తోటి విద్యార్థులు సహకరిస్తారు. ఈ కార్యక్రమం ప్రవేశపెట్టిన తర్వాత విద్యార్థుల్లో చురుకుతనం పెరిగిందని, అందరూ పరిశుభ్రంగా పాఠశాలకు వస్తున్నారని కృష్ణపల్లి ప్రాథమికోన్నత పాఠశాల హెచ్‌ఎం వి.నారాయణరావు తెలిపారు. ‘ముస్తాబు’ గురించి సీఎంకూ తెలిసింది. బుధవారం మంత్రులు, హెచ్‌వోడీలు, కార్యదర్శుల భేటీలో ప్రత్యేకంగా ప్రస్తావించి, జిల్లా కలెక్టర్ ప్రభాకరరెడ్డిని అభినందించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలును పరిశీలించాలని ఆదేశించారు.
చదువుతో పాటు పరిశుభ్రత అవసరం
పాఠశాల స్థాయి నుంచి విద్యార్థులకు చదువుతో పాటు పరిశుభ్రత ఎంతో అవసరం. పౌష్టికాహార లోపం నివారణ, ఆరోగ్యం తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ‘ముస్తాబు’ కార్యక్రమాన్ని ప్రారంభించాం. సీఎం చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించడం ఆనందంగా ఉంది.
- ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్