Minister Dola Sri: భాగస్వామ్య సదస్సులో 410 ఒప్పందాలు
ABN , Publish Date - Nov 06 , 2025 | 04:03 AM
విశాఖ నగరంలో 14, 15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు రాష్ట్రభవిష్యత్‌కు తలమానికం అవుతుందని మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు.
రూ.9.8 లక్షల కోట్ల పెట్టుబడులు
7.5 లక్షల మందికి ఉపాధి: డోలా
విశాఖపట్నం, నవంబరు 5(ఆంధ్రజ్యోతి): విశాఖ నగరంలో 14, 15 తేదీల్లో జరగనున్న భాగస్వామ్య సదస్సు రాష్ట్రభవిష్యత్‌కు తలమానికం అవుతుందని మంత్రి డాక్టర్ డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి అన్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరుగుతున్న సదస్సు ఏర్పాట్లను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. దేశ, విదేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలు, రాజకీయ ప్రముఖుల సమక్షంలో 410 ఒప్పందాలు జరుగుతాయని, రూ.2.7 లక్షల కోట్లతో చేపట్టనున్న ప్రాజెక్టులకు శంకుస్థాపనలు జరుగుతాయని తెలిపారు. సదస్సు ద్వారా రాష్ట్రానికి రూ.9.8 లక్షల కోట్లు పెట్టుబడులు రానున్నాయని.. 7.5 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నామని, అందులో పది లక్షల మందికి ఉద్యోగాలు కల్పించే ప్రక్రియ ఇప్పటికే పూర్తిచేశామన్నారు. పెట్టుబడుల సదస్సు విజయవంతానికి ప్రభుత్వం అవిరళ కృషిచేస్తోందని, సీఎం చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్, మంత్రులు పలు దేశాల్లో పర్యటించి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులను ఆహ్వానించారని గుర్తుచేశారు. 40 దేశాల నుంచి వందల సంఖ్యలో అతిథులు, వివిధ కంపెనీల ప్రతినిధులు వస్తున్నారన్నారు.