Share News

బినామీలతో ప‘రేషన్‌’!

ABN , Publish Date - Jun 18 , 2025 | 01:25 AM

విధానాలు మారినా ప్రజా పంపిణీ వ్యవస్థలో తీరు మారడంలేదు. అవినీతిమయమైన ఎండీయూ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసి డీలర్ల చేతికే రేషన్‌ పంపిణీ బాధ్యతలు అప్పగించినా పంపిణీ శాతం పెరగలేదు. దీనికి ప్రధాన కారణం బినామీ డీలర్లేనని తెలుస్తోంది. పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీరిని నియంత్రించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

బినామీలతో ప‘రేషన్‌’!

- ఉమ్మడి కృష్ణాలో 150 మంది బినామీ రేషన్‌ డీలర్లు!

- పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తోన్న అక్రమార్కులు

- కార్డుదారులకు పెరగని పంపిణీ శాతం

-నెరవేరని ప్రభుత్వ లక్ష్యం.. మామూళ్ల మత్తులో అధికారులు

విధానాలు మారినా ప్రజా పంపిణీ వ్యవస్థలో తీరు మారడంలేదు. అవినీతిమయమైన ఎండీయూ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేసి డీలర్ల చేతికే రేషన్‌ పంపిణీ బాధ్యతలు అప్పగించినా పంపిణీ శాతం పెరగలేదు. దీనికి ప్రధాన కారణం బినామీ డీలర్లేనని తెలుస్తోంది. పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నట్టు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీరిని నియంత్రించాల్సిన అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

ప్రజా పంపిణీ వ్యవస్థలో బినామీ డీలర్లు రాజ్యమేలుతున్నారు. ఎన్టీఆర్‌, కృష్ణాజిల్లాల్లో కలిపి మొత్తం 150 మందికిపైగా వీరు ఉన్నట్టు తెలుస్తోంది. ఎండీయూ వ్యవస్థలో డోర్‌ డెలివరీ పేరుతో కార్డుదారులకు బియ్యాన్ని ఇచ్చినట్టు ఇచ్చి, వారి దగ్గర ఎదురు కొనుగోలు చేసి అదే వాహనాల్లో తరలించుకుపోయేవారు. ఈ విధానాన్ని అరికట్టేందుకు, పంపిణీ శాతాన్ని గణనీయంగా పెంచేందుకు కూటమి ప్రభుత్వం ఎండీయూ వ్యవస్థను రద్దు చేసింది. రేషన్‌ దుకాణాల నుంచే నిత్యావసరాల పంపిణీ చేపట్టింది. తొలి నెల పంపిణీ శాతం దాదాపుగా సమానంగా ఉండటంతో.. సివిల్‌ సప్లయిస్‌ ఉన్నతాధికారులు సైతం విస్తుపోతున్నారు. దీనిపై లోతుగా వెళితే.. బినామీ డీలర్ల అక్రమాల వల్లనే పంపిణీ శాతం మెరుగు పడలేదని తెలుస్తోంది. కార్డుదారులు పూర్తి స్థాయిలో బియ్యం తీసుకోకపోవటానికి ప్రధానంగా బినామీ డీలర్లు రేషన్‌ను దారి మళ్లించడమే కారణమని సమాచారం. గతంలో డీలర్లు స్టాకిస్టులుగా ఉన్నపుడు కూడా ఎండీయూ ఆపరేటర్లతో బినామీ డీలర్లు మిలాఖత అయ్యి పేదల బియ్యాన్ని తరలించేవారు. ఇప్పుడు డీలర్లే పంపిణీ దారులుగా మారారు. కార్డుదారులకు నిత్యావసరాల పంపిణీ శాతం గణనీయంగా పెరగాలని గట్టిగా ప్రభుత్వం నిర్దేశించినా కూడా బినామీ డీలర్లు పాతపనే చేస్తున్నారు. దీంతో బియ్యం పంపిణీ శాతం పెరగటం లేదు.

బినామీ డీలర్లదే హవా!

సివిల్‌ సప్లయిస్‌లోకి బినామీ డీలర్లు ఎలా ప్రవేశిస్తున్నారో తెలిస్తే ఆశ్యర్యపోతారు. అసలైన డీలర్ల పేర్లు కాగితాల మీదనే కనిపిస్తాయి. పరీక్షలు రాసి, తమ తెలివితేటలతో దక్కించుకున్న వారు ఇప్పటికీ చాలా వరకు షాపులను నిర్వహిస్తున్నారు. ధన ఆశ, అక్రమ వ్యాపారం చేయాలన్న ఉద్దేశ్యం, రాజకీయ సిఫార్సులతో వచ్చిన వారి డిపోలు సింహభాగం బినామీల చేతిలోకి వెళ్లాయి. ఇంకాస్త వివరంగా చెప్పాలంటే అక్రమ బియ్యం వ్యాపారుల స్వాధీనంలో ఉన్నాయి. ఇంత తేలిగ్గా బినామీల చేతుల్లో రేషన్‌ దుకాణాలు ఎలా నడుస్తున్నాయో చూస్తే ఆశ్యర్యపోతారు. ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి నిత్యావసరాలను డీలర్లు దిగుమతి చేసుకోవాలి. కానీ నామినీల పేరుతో భార్య, ఇతరుల పేర్లను డీలర్లు ఇస్తున్నారు. డీలర్లు సూచించిన నామినీలు ఎవరైనా సరే ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల నుంచి బియ్యం దిగుమతి చేసుకోవటానికి అవకాశం ఉంటోంది. దీంతో బినామీ డీలర్ల పని సులువైపోతోంది. బినామీ డీలర్లు ఒరిజినల్‌ డీలర్లుగా వ్యవహరిస్తూ నిత్యావసరాలను డ్రా చేసుకుని తరలించుకుపోతున్నారు. కార్డుదారులకు వీలైనంత వరకు ఇచ్చి .. మిగిలిన వాటిని గుట్టుగా తరలించేస్తున్నారు.

బినామీలను కనిపెట్టే అవకాశం ఉన్నా..

డీలర్లు ఎన్ని సార్లు లాగిన్‌ అయ్యారు. ఎంత సమయం లాగిన్‌లో ఉన్నారు అనేది తెలుసుకునే వ్యవస్థ సివిల్‌ సప్లయిస్‌ దగ్గర ఉంది. దీనిని బట్టి డీలర్లు లాగిన్‌ చేస్తున్నారో, ఇతరులు లాగిన్‌ చేస్తున్నారో అర్థమవుతుంది. ఎవరు లాగిన్‌ చేస్తున్నారో కూడా తెలుస్తుంది. కాబట్టి బినామీ డీలర్లను కనిపెట్టడం కూడా సులువే. కానీ అధికారులు ఆ వైపు దృష్టి సారించడంలేదని విమర్శలు వస్తున్నాయి.

పెట్టుబడి అంతా అక్రమ వ్యాపారులదే..

కొంత మంది డీలర్లలో నిత్యావసరాలకు డీడీలు కట్టలేని వారు కూడా ఉన్నారు. ఇలాంటి డీలర్లు ఏనాడో అక్రమ వ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయారు. వారు ఇచ్చే జీతాలకు అలవాటు పడిపోయారు. దీంతో అక్రమార్కులు తమ కనుసైగలతో డిపో నడిపిస్తున్నారు. పేదలకందాల్సిన బియ్యం పక్కదారి పట్టిస్తున్నారు. క్షేత్ర స్థాయిలో వీటిని అడ్డుకోవాల్సిన పీడీఎస్‌ డీటీలు మామూళ్ల మత్తులో పట్టించుకోవడంలేదని విమర్శలు ఉన్నాయి.

Updated Date - Jun 18 , 2025 | 01:25 AM