Liquor Scams: సేమ్ టు షేమ్!
ABN , Publish Date - Sep 17 , 2025 | 03:47 AM
ఒకదానిని మించింది మరొకటి ఢిల్లీలో వంద కోట్లు... ఛత్తీస్‌గఢ్‌లో రూ.2500 కోట్లు... ఏపీలో ఏకంగా రూ.3500 కోట్లపైమాటే! అన్నీ లిక్కర్ స్కాములే! కాస్త అటూ ఇటుగా దేశంలో...
మద్యమే ఆదాయ మార్గం.. ఛత్తీ్‌సగఢ్ స్కామ్‌తో ఏపీకి పోలికలు
అక్కడా ఇక్కడా ప్రభుత్వ దుకాణాలే.. నేతల నుంచి అధికారుల దాకా కుమ్మక్కు
ఛత్తీ్‌సగఢ్ స్కామ్‌పై ఈడీ దర్యాప్తు.. ఏకంగా మాజీ సీఎం తనయుడి అరెస్టు
చైతన్య బాఘేల్‌పై 7 వేల పేజీలతో చార్జిషీటు
ఏపీ దోపిడీని పట్టించుకోని ఈడీ.. సిట్ విచారణలో వెలుగుచూస్తున్న నిజాలు
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ఒకదానిని మించింది మరొకటి! ఢిల్లీలో వంద కోట్లు... ఛత్తీస్‌గఢ్‌లో రూ.2500 కోట్లు... ఏపీలో ఏకంగా రూ.3500 కోట్లపైమాటే! అన్నీ లిక్కర్ స్కాములే! కాస్త అటూ ఇటుగా దేశంలో ఒకే సమయంలో మూడు రాష్ట్రాల్లో ‘మద్యం’ నుంచి నేతలు సొమ్ములు పిండుకున్నారు. వీటిలో స్కామ్‌లకే స్కామ్... దేశ చరిత్రలోనే అతి పెద్ద స్కామ్‌గా చెప్పుకోదగ్గది ఏపీలో జగన్ హయాంలో జరిగింది. ఢిల్లీలో అప్పటి ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అరెస్టు చేసింది. ఛత్తీ్‌సగఢ్‌లో నాటి ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ తనయుడు చైతన్య బాఘేల్‌ను కటకటాల వెనక్కి నెట్టింది. ఛత్తీ్‌సగఢ్ స్కామ్‌లో చైతన్య బాఘేల్ పాత్రను వివరిస్తూ మంగళవారం ఈడీ ఏకంగా 7వేల పేజీల చార్జిషీటు దాఖలు చేసింది. ఏపీ లిక్కర్ స్కామ్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థలు పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వమే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ద్వారా దర్యాప్తు చేయిస్తోంది. ఛత్తీ్‌సగఢ్, ఏపీ లిక్కర్ స్కామ్‌లో అనేక సారూప్యతలు కనిపిస్తుండటం ఉండటం విశేషం. ఇప్పటిదాకా దర్యాప్తులో గుర్తించిన అంశాల ఆధారంగా...
‘పాలసీ’ పేరుతో...
‘మద్యం విక్రయాలు, వినియోగం నియంత్రణ’ పేరుతో ఒక పాలసీని రూపొందించి... దానినే దోపిడీకి అనుకూలంగా మార్చుకున్నారు. ఏపీలో, ఛత్తీ్‌సగఢ్‌లో అదే ‘పాలసీ’! ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో... సొంత ‘ముడుపుల దుకాణాలు’ తెరిచారు.
తిలాపాపం...
ఛత్తీ్‌సగఢ్ లిక్కర్ స్కామ్‌లో సీఎం తనయుడితో మొదలుకుని అనేక మంది అధికారులు, రాజకీయ నాయకులు, వ్యాపారులు కుమ్మక్కయ్యారు. ఏపీలో... మాత్రం ‘ఎవరిని బడితే వారిని’ ఇందులో వేలు పెట్టనివ్వలేదు. ఏ స్థానంలో ఎవరుండాలో, ఎవరి పాత్ర ఏమిటో ముందే నిర్ణయించుకుని... వారి ద్వారా మాత్రమే స్కామ్ నడిపించారు. ‘అంతిమలబ్ధిదారు’కు మాత్రమే అత్యధిక వాటా వెళ్లేలా పకడ్బందీగా వ్యవహరించారు.
అందరికీ ‘కిక్కు’
ఛత్తీ్‌సగఢ్‌లో నేతలతోపాటు మద్యం ఉత్పత్తిదారులు, రవాణాదారులు, సీనియర్ అధికారులు చేతులు కలిపారు. తమ నెట్‌వర్క్ సాఫీగా నడిచేలా చూసుకున్నారు. వచ్చిన సొమ్ములతో ఆస్తులు కొన్నారు. బిల్డింగులు కట్టుకున్నారు. జల్సాలు చేసుకున్నారు. ఏపీలోనూ ఇదే జరిగింది. అయితే... ఇదంతా ‘అంతిమ లబ్ధిదారు’ కనుసన్నల్లోనే సాగింది. అయినప్పటికీ... కమీషన్ల సొమ్మును కొందరు పాత్రధారులు సొంతానికి మళ్లించుకుని ఆస్తులు పోగేసుకున్నారు. ఆఫ్రికా దేశాల్లో వ్యాపారాలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు.
కేంద్రం పాత్ర ఏమిటి?
కారణాలు ఏమైనప్పటికీ... ఢిల్లీ, ఛత్తీ్‌సగఢ్‌లలో జరిగిన మద్యం స్కామ్‌లపై కేంద్రం తీవ్రంగా స్పందించింది. ఢిల్లీలో ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రినే ఈడీ అరెస్టు చేసింది. ఛత్తీ్‌సగఢ్‌లో చైతన్య బాఘేల్‌ను ఈ ఏడాది జూలైలో అరెస్టు చేసింది. కానీ... ఆ రెండు రాష్ట్రాలకు మించిన ఏపీ లిక్కర్ స్కామ్‌పై మాత్రం ఈడీ స్పందించలేదు. ‘సిట్’ చేసిన దర్యాప్తులో షెల్ కంపెనీల ఏర్పాటు నుంచి మనీ లాండరింగ్ వరకు అనేక అక్రమాలు బయటపడ్డాయి. తాము గుర్తించిన సమాచారాన్ని ఈడీతో పంచుకుంటూనే ఉన్నారు. అయినా... ఈడీ గప్‌చుప్!
‘లెక్కే లేదు’...
ఏపీలో సొంత డిస్టిలరీలు, సొంత బ్రాండ్లను రంగంలోకి దించారు. ఇక... ఇతర కంపెనీలకు సంబంధించి, కమీషన్లు ఇచ్చిన వారికి మాత్రమే ఆర్డర్లు వెళ్లాయి. ఇదంతా ఒక పద్ధతి ప్రకారం జరిగింది. ఛత్తీ్‌సగఢ్ స్కామ్ సూత్రధారులకు ఇన్ని తెలివితేటలు లేవు కాబోలు! వ్యవహారాన్ని నాటుగా నడిపించారు. సుమారు 40 లక్షల కేసుల మద్యాన్ని ప్రభుత్వ మద్యం దుకాణాల ద్వారా ‘అనధికారికం’గా విక్రయించారు. తద్వారా వచ్చిన లాభాలను సొంతానికి పంచుకున్నారు.
హోలోగ్రామ్‌తోనూ...
ఛత్తీ్‌సగఢ్‌లో హోలోగ్రామ్‌లు సరఫరా చేసే కాంట్రాక్టరు కూడా లిక్కర్ సిండికేట్‌లో భాగమే. నకిలీ హోలోగ్రామ్‌లు సరఫరా చేసి... వాటిద్వారా అనధికారికంగా సరుకు విక్రయించారు. ఏపీలోనూ ఇలాంటి ‘డీలింగ్స్’ జరిగినట్లు అనుమానాలున్నాయి. మద్యం డిపోల నుంచి కాకుండా... డిస్టిలరీల నుంచి నేరుగా షాపులకు తరలించి, ఆ మద్యాన్ని విక్రయించినట్లు ఆరోపణలున్నాయి. జగన్ హయాంలో మద్యం దుకాణాల్లో డిజిటల్ చెల్లింపులకు ఆస్కారం ఇవ్వకపోవడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.