Share News

పరవశం

ABN , Publish Date - Sep 24 , 2025 | 01:11 AM

నగరంలోని పున్నమిఘాట్‌లో మంగళవారం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అబ్బురపరిచాయి. ముఖ్యఅతిథిగా గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ హాజరై వీక్షించారు. తొలుత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాన్ని తిలకించారు. గాయత్రీ మాత అలంకరణలో ఉన్న దుర్గమ్మకు ప్రత్యేక పూజలు జరిపారు.

పరవశం

- అంబరాన్నంటిన విజయవాడ ఉత్సవ్‌ సంబరాలు

- ఆధ్యాత్మిక వినోదాన్ని పంచిన సినీ గాయని వాగ్దేవి

- యువతలో జోష్‌ దింపిన దాండియా, అభిజిత్‌ నాయర్‌ వయోలిన్‌

- ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

- వీక్షించిన గవవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌

పున్నమిఘాట్‌ పులకరించింది. సాంస్కృతిక శోభతో వెల్లివిరిసింది. దాండియా నృత్యాలు, అభిజిత నాయర్‌ వయోలిన్‌, సినీ గాయని వాగ్దేవి సుస్వరాలు వెరసి నగర ప్రజలను ఆనంద డోలికలలో తేలియాడించాయి. విజయవాడ ఉత్సవ్‌ సంబరాలు రెండో రోజు మంగళవారం అంబరాన్నంటాయి.

విజయవాడ సిటీ/విజయవాడ కల్చరల్‌, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి):

నగరంలోని పున్నమిఘాట్‌లో మంగళవారం నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు అబ్బురపరిచాయి. ముఖ్యఅతిథిగా గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ హాజరై వీక్షించారు. తొలుత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాన్ని తిలకించారు. గాయత్రీ మాత అలంకరణలో ఉన్న దుర్గమ్మకు ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను వేద పండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన ద్వాదశ జ్యోతిర్లింగాలను గవర్నర్‌ సందర్శించారు. సినీ గాయని, చిన్నారి వాగ్దేవి మృదు మధురంగా ఆలపించిన భక్తి గీతాలను ఆసక్తిగా తిలకించారు.

యువతలో జోష్‌ నింపిన సంగీత, నృత్య ప్రదర్శనలు

మానస తెడ్ల బృందం చేసిన కూచిపూడి నృత్యం అమితంగా ఆకట్టుకుంది. అమ్మవారి శక్తి రూపాలను, శాంతి స్వభావం, ఉగ్ర రూపాన్ని నాట్య రూపంలో ప్రదర్శించారు. రాక్షస సంహారం చేసిన ఆది పరాశక్తి నాట్యం కట్టిపడేసింది. జగన్మోహిని, విఠలక్షి, కనకదుర్గ రూపంతో నాట్యాన్ని ముగించారు. సినీ గాయని, సరిగమ షో విన్నర్‌ చిన్నారి వాగ్దేవి ఆలపించిన మహాకనక దుర్గా.., శ్రీగౌరి.. శ్రీ గౌరీ వే.., చక్కని తల్లికి చాంగుబళా (అన్నమాచార్య కీర్తన), భాగ్య లక్ష్మి బారమ్మ.. సౌభాగ్య లక్ష్మి బారమ్మ (కన్నడ గేయం) ఆధ్యాత్మిక వినోదాన్ని పంచింది. కేరళ మ్యూజికల్‌ స్టార్‌ అభిజిత్‌ నాయర్‌ బృందం ప్రదర్శించిన వయోలిన్‌ మ్యూజిక్‌ యువతను ఉర్రూతలూగీంచింది. దాదాపు గంట పాటు ఈ బృందం వైలీలపై ప్రదర్శించిన సినీ గేయాలు ఆకట్టుకున్నాయి. ప్రధానంగా ఇళయరాజా, ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని రీమిక్స్‌ చేశారు. చివరిగా బోక్సో బృందం (హైదరాబాద్‌) ఆడిన దాండియా అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకుంది. ఈ బృందం కొద్దిేసపు మాత్రమే వేదికపై దాండియా ఆడింది. ఆ తర్వాత ప్రేక్షకులు మధ్యలోకి ఈ బృందం చేరుకుని అన్ని వర్గాల ప్రజలను దాండియాలో భాగస్వాములను చేసింది. విజయవాడ ఎంపీ కేశినేని శివనాద్‌, కలెక్టర్‌ జి.లక్ష్మీశ, పలువురు ప్రముఖులు ఈ దాండియాలో చురుగ్గా పాల్గొన్నారు.

Updated Date - Sep 24 , 2025 | 01:11 AM