Tourist Attractions: పాపికొండల బోట్ షికారు ప్రారంభం
ABN , Publish Date - Nov 03 , 2025 | 06:27 AM
మొంథా తుఫాన్ ప్రభావంతో గతనెల 26న నిలిపివేసిన పాపికొండల బోట్ షికారు ఆదివారం తిరిగి మొదలైంది.
తొలి రోజు రెండు బోట్లలో 103 మంది షికారు
రాజమహేంద్రవరం, నవంబరు 2(ఆంధ్రజ్యోతి): మొంథా తుఫాన్ ప్రభావంతో గతనెల 26న నిలిపివేసిన పాపికొండల బోట్ షికారు ఆదివారం తిరిగి మొదలైంది. గోదావరి వరదల వల్ల తొలుత ఈ ఏడాది జూన్‌లో ఆపేసిన బోటు షికారు గత నెలలో దీపావళికి ముందే ప్రారంభించారు. అయితే ఆ తర్వాత భారీ వర్షాలు, మొంథా తుఫాన్ ప్రభావంతో మళ్లీ ఆపేశారు. ప్రస్తుతం వర్షాలు, వరదల ప్రభావం అంతగా లేకపోవడంతో అధికారులు తిరిగి అనుమతిచ్చారు. ఆదివారం అల్లూరి సీతారామరాజు జిల్లా పోలవరం ప్రాజెక్టు సమీపంలోని గండిపోచమ్మ గుడి వద్ద నుంచి రెండు బోట్లలో 103 మంది పర్యాటకులు బోటు షికారు చేశారు. సాధారణంగా గండి పోచమ్మ గుడి వద్ద నుంచి 15 బోట్లు, పోచవరం నుంచి 17 బోట్లు యాత్రికులను తీసుకెళ్తుంటాయి. అయితే ప్రస్తుతం పర్యాటకులు ఎక్కువగా లేకపోవడంతో రెండు బోట్లు మాత్రమే కదిలాయి. కార్తీక మాసం కావడంతో ఇక ప్రతిరోజూ టూరి్‌స్టల సందడి పెరగనుంది.